బ్యాంకు వడ్డీపై పన్నెంతో తెలుసా?

bank interest rate - Sakshi - Sakshi

2016–17 ఆర్థిక సంవత్సరానికి రిటర్నులు దాఖలు చేయడానికి గడువు తేది అయిపోయింది. ఏదైనా కారణంతో వేయలేకపోతే వెంటనే వేసేయండి. ఇక ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే.. ఇన్‌కమ్‌ శ్లాబులు.. రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.. 

60 సంవత్సరాలు దాటని వారికి రూ.2,50,000 వరకు పన్ను లేదు. రూ.2,50,000 దాటితే రూ.5,00,000 లోపల 5 శాతం, రూ.5,00,000 నుంచి రూ.10,00,000 వరకు 20 శాతం, రూ.10,00,000 ఆపైన 30 శాతం పన్ను భారం ఉంటుంది.  

60 నుంచి 80 ఏళ్ల లోపు ఉన్న వారికి రూ.3,00,000 వరకు పన్ను ఉండదు.  

80 సంవత్సరాలు దాటిన వారికి రూ.5,00,000 వరకు పన్ను పడదు.  

చెల్లించే పన్ను మీద అదనంగా విద్యా సుంకం 3 శాతంగా ఉంటుంది. 

నికర ఆదాయం రూ.50,00,000 దాటితే సర్‌చార్జి 10 శాతం. ఇక నికర ఆదాయం రూ.1,00,00,000 దాటితే సర్‌చార్జి 15 శాతం.  

80 ఏళ్ల లోపు వారికి ఆదాయం రూ.3,50,000 లోపల ఉంటే ట్యాక్స్‌ రిబేటు ఇస్తారు. ఈ రిబేటు రూ.2,500 వరకు మాత్రమే. ఈ రిబేటు వలన రూ.3,00,000 వరకు పన్నుండదు. అంటే శ్లాబులు మార్చకపోయినా రూ.3,00,000 వరకు పన్ను భారం లేదన్నమాట.  

పైవన్నీ పరిగణనలోకి తీసుకొని సెక్షన్‌ 80సీ, 80డీ, 80జీ తదితర మినహాయింపులు ఇచ్చిన తర్వాత మీ నికర ఆదాయాన్ని లెక్కించండి. పన్ను భారం తెలుసుకోండి. మీరు ఉద్యోగి అయితే మీ మొత్తం ఆదాయం మీద పన్నుభారం టీడీఎస్‌ ద్వారా జమ అయితే సరి!. అలా కాకపోతే పన్ను భారం పూర్తిగా చెల్లించినట్లు కాదు. అలాంటప్పుడు అడ్వాన్స్‌గా పన్ను చెల్లించాలి. మీరు వ్యాపారస్తులయినా, వృత్తికి సంబంధించిన వారయినా, ఇతర ఆదాయం ఉన్న వారయినా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.  

సాధారణంగా ఉద్యోగస్తులకొచ్చే జీతం మీద, ఆదాయం మీద పూర్తి పన్ను భారాన్ని టీడీఎస్‌ రూపంలో మినహాయించటం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో అటు ఉద్యోగస్తులకు ఇటు ఇతరులకు టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను మినహాయించటం) పూర్తిగా జరగకపోవచ్చు. జరిగినా కొంత భాగానికే జరుగుతుంది. అది ఎలాంటి పరిస్థితుల్లోనో ఒక్కసారి చూద్దాం... 

సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాల మీద వచ్చే వడ్డీకి మినహాయింపు రూ.10,000. అంతకన్నా ఎక్కువగా వచ్చే వడ్డీని ఆదాయంలో కలపాలి. ఈ వడ్డీ మీద టీడీఎస్‌ ఉండదు. పన్ను భారం ఏర్పడినప్పుడు మొత్తం పన్ను చెల్లించాలి.  

ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వడ్డీకి ఎలాంటి మినహాయింపు లేదు. కాకపోతే వార్షిక వడ్డీ రూ.10,000 దాటినప్పుడే టీడీఎస్‌ చేస్తారు. మీ వడ్డీ రూ.10,000 లోపల ఉందనుకోండి. టీడీఎస్‌కి గురికాదు. కాని పన్ను భారం ఉంటుంది. 

వార్షిక వడ్డీ రూ.10,000 దాటిన తర్వాత బ్యాంకు వాళ్లు వడ్డీలో 10 శాతాన్ని టీడీఎస్‌ చేస్తారు. చాలా మంది ఈ 10 శాతంలో పన్ను భారం తీరిపోయిందనుకుంటారు. అది తప్పు. మీ నికర ఆదాయం రూ.5,00,000 దాటినట్లయితే మీ పన్ను భారం 20శాతం. మీ నికర ఆదాయం రూ.10,00,000 దాటితే మీ పన్ను భారం 30 శాతం. ఈ రెండూ సందర్భాల్లో మీ పన్ను భారం మీరే స్వయంగా చెల్లించాలి. ఆ మేరకు అడ్వాన్స్‌గా 2018 మార్చి లోపల జమచేయాలి. మీ వార్షిక వడ్డీ రూ.60,000 అనుకోండి. టీడీఎస్‌ రూ.6,000 మాత్రమే. 20 శాతం.. రూ.12,000 పన్నుభారం అదనం. 30 శాతం.. రూ.18,000 పన్ను భారం అదనం. 

విద్యా సుంకం అదనం
ఈ అదనపు పన్ను భారాన్ని అడ్వాన్స్‌ టాక్స్‌ రూపంలో గడువు తేదీలోపల చెల్లించకపోతే నెలకు వందకు 1 శాతం వడ్డీ వేస్తారు. ప్రస్తుతం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వారు బ్యాంకు అకౌంట్స్‌ వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏడాదికి రెండు సార్లు సేవింగ్స్‌ బ్యాంక్‌ వడ్డీ జమవుతుంది. మీకు ఎన్ని అకౌంట్లుంటే అన్ని అకౌంట్లలో వడ్డీ కలపాల్సిందే. మొత్తం మీద రూ.10,000 మినహాయింపు. మిగతాది పన్నుకు గురవుతుంది. అలాగే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు మీద వడ్డీలు.. ఆదాయపు పన్ను వారి చేతిలో మీ రాబడి వివరాలు పదిలంగా ఉన్నాయి. వారు అడగకముందే డిక్లేర్‌ చేసి మీ పన్ను భారం చెల్లించండి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top