
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా... ఈ ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. రుణ నాణ్యత మెరుగుపడినా... లాభం, ఆదాయం విషయంలో విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో బ్యాంకు నికర లాభం 36 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.552 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.355 కోట్లకు పరిమితమయింది.
మొండి బకాయిలకు కేటాయింపులు పెరగడంతో నికర లాభం తగ్గినట్లు బ్యాంకు తెలిపింది. మొత్తం ఆదాయం రూ.12,047 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.12,490 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.3,721 కోట్లకు పెరిగింది. గత క్యూ2లో 2.12 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ2లో 2.31 శాతానికి చేరిందని, రిటైల్ రుణాలు 25 శాతం వృద్ధి చెందడంతో దేశీయ రుణాలు 14 శాతం పెరిగాయని, మొత్తం మీద 9 శాతం రుణ వృద్ధి సాధించామని బ్యాంకు తెలిపింది.
ఇతర ఆదాయం 11 శాతం పెరుగుదలతో రూ.1,737 కోట్లకు, నిర్వహణ లాభం 13 శాతం వృద్ధితో రూ.3,042 కోట్లకు ఎగిశాయి. వడ్డీ, ఫీజు ఆదాయాలు పెరగడంతో నిర్వహణ ఆదాయం పెరిగినట్లు బ్యాంకు తెలియజేసింది. ఈ బ్యాంక్ రూ.459 కోట్ల నికర లాభం, రూ.3,520 కోట్ల నికర వడ్డీ ఆదాయం సాధించగలదని విశ్లేషకులు అంచనా వేశారు.
మెరుగుపడిన రుణ నాణ్యత
క్యూ1లో 11.40 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 11.16 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు సైతం 5.17 శాతం నుంచి 5.05 శాతానికి తగ్గాయి. గతేడాది క్యూ2లో స్థూల మొండి బకాయిలు 11.35 శాతంగా, నికర మొండి బకాయిలు 5.46 శాతంగా ఉండటం గమనార్హం.
సీక్వెన్షియల్‌గా చూస్తే, స్థూల మొండి బకాయిలు, పునర్వ్యస్థీకరణ రుణాలు తగ్గాయని బ్యాంకు వివరించింది. గత క్యూ2లో రూ.9.22 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం వ్యాపారం ఈ క్యూ2లో 5 శాతం పెరిగి రూ.9.71 లక్షల కోట్లకు చేరింది, డిపాజిట్లు రూ.5.67 లక్షల కోట్ల నుంచి రూ.5.83 లక్షల కోట్లకు ఎగిశాయి.
పెరిగిన మొండి కేటాయింపులు...
మొండి బకాయిలకు కేటాయింపులు గత క్యూ2లో రూ.1,796 కోట్లుగా ఉండగా... ఈ క్యూ2లో 30 శాతం పెరిగి రూ.2,329 కోట్లకు చేరాయి. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై ఆశావహ అంచనాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ షేర్ 1.5 శాతం లాభంతో రూ.174 వద్ద ముగిసింది.