
పండుగ సీజన్ ప్రారంభాన్ని పురస్కరించుకుని బ్యాంక్ ఆఫ్ బరోడా కారు రుణ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫ్లోటింగ్ కార్ లోన్ వడ్డీ రేట్లు ఇప్పుడు సంవత్సరానికి 8.15 శాతం నుండి ప్రారంభమవుతాయి. ఇంతకు మందు ప్రారంభ వడ్డీ రేటు 8.40 శాతం ఉండేది.
కొత్త ప్రారంభ 8.15 శాతం వార్షిక వడ్డీ రేటు కొత్త కారు కొనుగోలు రుణాలపై వర్తిస్తుంది. ఆర్బీఐ ఈ ఏడాది మూడు మానిటరీ పాలసీ సమావేశాల్లో రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫిబ్రవరి, ఏప్రిల్ పాలసీ సమావేశాల్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు, జూన్లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో చాలా బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి.
తనఖా రుణాలపైనా..
బ్యాంక్ ఆఫ్ బరోడా తనఖా రుణం (ప్రాపర్టీపై రుణం) వడ్డీ రేట్లను కూడా వార్షికంగా 9.85 శాతం నుంచి 9.15 శాతానికి తగ్గించింది. దరఖాస్తుదారులు బ్యాంక్ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ - బరోడా డిజిటల్ కార్ లోన్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా కార్ లోన్‌కు డిజిటల్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా సమీప బ్యాంక్ శాఖను సందర్శించవచ్చు. బ్యాంక్ 6 నెలల ఎంసీఎల్ఆర్‌తో లింక్ చేసిన బరోడా కార్ లోన్‌పై ఆకర్షణీయమైన ఫిక్స్డ్ వడ్డీ రేటును కూడా బ్యాంక్ అందిస్తుంది.