
రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్), దాని మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీల రుణ ఖాతాలను దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ‘మోసపూరితమైనవి’గా ప్రకటించింది. ఈ మేరకు ఆర్‌కామ్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.
దివాలా చట్టం (ఐబీసీ) 2016 కింద ప్రస్తుతం సీఐఆర్పీలో ఉన్న ఆర్‌కామ్ దివాలా ప్రక్రియ ప్రారంభానికి ముందు కాలానికి సంబంధించినదని పేర్కొంది. ఈ రుణాలను పరిష్కార ప్రణాళికలో భాగంగా లేదా ఐబీసీ కింద లిక్విడేషన్ ద్వారా పరిష్కరించాల్సి ఉందని కంపెనీ తెలిపింది.
ఆర్‌కామ్ ప్రస్తుతం రిజల్యూషన్ ప్రొఫెషనల్ అనీష్ నిరంజన్ నానావతి నియంత్రణలో ఉంది. అనిల్ అంబానీ ఇప్పుడు ఈ కంపెనీకి డైరెక్టర్ కాదు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆరోపణలను అనిల్ అంబానీ ఖండిస్తున్నట్లు ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. అనిల్ అంబానీ ఆర్ కామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లేదా కీలక మేనేజీరియల్ పర్సన్ కాదని, కంపెనీ రోజువారీ కార్యకలాపాలు లేదా నిర్ణయాలు తీసుకోవడంలో తన పాత్ర లేదని, ఈ విషయం 2013కు సంబంధించినదని వివరించారు.
అంతకుముందు జూన్ దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆర్‌కామ్ రుణ ఖాతాలను ఫ్రాడ్‌గా ట్యాగ్ చేసింది. ఆగస్టు 24న బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆర్ కామ్ రుణ ఖాతాను మోసపూరితమైనదిగా వర్గీకరించి, నిధుల మళ్లింపు, రుణ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో దాని మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీ పేరును చేర్చింది.