బ్యాంకింగ్‌పై బంద్‌ ప్రభావం పాక్షికం

The bandh effect on banking is partial - Sakshi

న్యూఢిల్లీ: ట్రేడ్‌ యూనియన్లు నిర్వహిస్తున్న రెండు రోజుల బంద్‌తో మంగళవారం బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై పాక్షికంగా ప్రభావం పడింది. ఒక వర్గం ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ), బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఈఎఫ్‌ఐ) ప్రాబల్యం ఉన్న బ్యాంకుల్లో బంద్‌ ప్రభావం కనిపించింది. అయితే, బ్యాంకింగ్‌ రంగంలోని మిగతా ఏడు యూనియన్లు బంద్‌లో పాల్గొనకపోవడంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు ప్రైవేట్‌ రంగ బ్యాంకుల కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగాయి.

ఏఐబీఈఏ, బీఈఎఫ్‌ఐల్లో సభ్యత్వమున్న ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండటంతో వాటి ప్రాబల్యమున్న పలు బ్యాంకు శాఖల్లో డిపాజిట్లు, విత్‌డ్రాయల్, చెక్కుల క్లియరెన్సులు మొదలైన కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు పాటిస్తోందని ఆరోపిస్తూ 10 కార్మిక సంఘాలు రెండు రోజుల పాటు (మంగళ, బుధవారాల్లో) బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలను వ్యతిరేకిస్తూ, జీతభత్యాల పెంపు డిమాండ్‌ చేస్తూ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు గత నెల 21న, 26న సమ్మెకు దిగాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top