ప్యాసింజర్‌ జోరు.. | April auto sales rose 7.5 percent | Sakshi
Sakshi News home page

ప్యాసింజర్‌ జోరు..

May 11 2018 1:07 AM | Updated on May 11 2018 1:07 AM

April auto sales rose 7.5 percent - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు ఏప్రిల్‌ నెలలో 7.5 శాతంమేర పెరిగాయి. యుటిలిటీ వెహికల్స్, కార్లు, వ్యాన్ల అమ్మకాల్లో బలమైన డిమాండ్‌ దీనికి ప్రధాన కారణం. ఇండియన్‌ ఆటోమొబైల్‌ తయారీ సంఘం (సియామ్‌) తాజా  గణాంకాల ప్రకారం.. 
►ప్యాసింజర్‌ వాహన (పీవీ) విక్రయాలు గత నెలలో 7.5 శాతం వృద్ధితో 2,98,504 యూనిట్లకు పెరిగాయి. గతేడాది ఇదే నెలలో అమ్మకాలు 2,77,683 యూనిట్లుగా ఉన్నాయి.
►దేశీ కార్ల అమ్మకాల్లో 4.89 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 1,90,854 యూనిట్ల నుంచి 2,00,183 యూనిట్లకు ఎగశాయి. 
►యుటిలిటీ వెహికల్స్‌ విక్రయాలు 11.92 శాతం పెరుగుదలతో 79,136 యూనిట్లకు, వ్యాన్ల అమ్మకాలు 18.99 శాతం వృద్ధితో 19,185 యూనిట్లకు పెరిగాయి. 

ఎగుమతులు డీలా..
ప్యాసింజర్‌ వాహన విభాగంలోని కార్లు, యుటిలిటీ వెహికల్స్, వ్యాన్లు అన్ని విభాగాల విక్రయాల్లోనూ జోరు కనిపించిందని సియామ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సుగతో సేన్‌ తెలిపారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం శుభారంభానిచ్చింది. మిగిలి ఉన్న నెలల్లోనూ ఇదే ట్రెండ్‌ను అంచనా వేస్తున్నాం’ అని పేర్కొన్నారు. అయితే ఎగుమతుల్లో మాత్రం క్షీణత నమోదయ్యిందని తెలిపారు. గతేడాది ఏప్రిల్‌లో 60,538 యూనిట్లుగా ఉన్న ప్యాసింజర్‌ వాహన ఎగుమతులు ఈ ఏప్రిల్‌లో 15.89 శాతం క్షీణతతో 50,921 యూనిట్లకు తగ్గాయని వివరించారు.  

మారుతీ అమ్మకాలు@ 1,63,434 యూనిట్లు
మారుతీ సుజుకీ ఇండియా దేశీ ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 13.43 శాతం పెరుగుదలతో 1,63,434 యూనిట్లకు చేరాయి. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా విక్రయాలు 4.42 శాతం వృద్ధితో 46,735 యూనిట్లకు పెరిగాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు 12.94 శాతం వృద్ధితో 21,826 యూనిట్లకు, టాటా మోటార్స్‌ పీవీ విక్రయాలు 36.19 శాతం వృద్ధితో 19,157 యూనిట్లకు ఎగశాయి. 

టూవీలర్‌ స్పీడ్‌..
టూవీలర్‌ అమ్మకాలు 16.92 శాతం వృద్ధితో 19,58,241 యూనిట్లకు చేరాయి. మోటార్‌సైకిల్‌ విక్రయాల్లో 19.38 శాతం వృద్ధి కనిపించింది. ఇవి 12,29,526 యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్‌ లీడర్‌ హీరో మోటొకార్ప్‌ దేశీ మోటార్‌సైకిల్‌ అమ్మకాలు 16.44 శాతం వృద్ధితో 6,07,720 యూనిట్లకు చేరాయి. హోండా మోటార్‌సైకిల్‌ విక్రయాలు 2,12,292 యూనిట్లుగా, బజాజ్‌ ఆటో మోటార్‌సైకిల్‌ విక్రయాలు 2,00,742 యూనిట్లుగా ఉన్నాయి. స్కూటర్ల విభాగానికి వస్తే.. మార్కెట్‌ లీడర్‌ హోండా దేశీ స్కూటర్ల అమ్మకాలు 12.98 శాతం వృద్ధితో 4,23,532 యూనిట్లకు పెరిగాయి. ఇక వాణిజ్య వాహన విక్రయాలు ఏకంగా 75.95 శాతం వృద్ధితో 72,993 యూనిట్లకు ఎగశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement