టాప్‌లోకి ఆపిల్‌, ఫేస్‌బుక్‌ పడిపోయింది

Apple Worlds Top Brand, Facebook Slips To 9th Spot: Interbrand - Sakshi

ప్రపంచంలో టాప్‌ బ్రాండుల జాబితాలో స్థానాలన్నీ తారుమారు అయ్యాయి. టాప్‌ బ్రాండుగా ఇన్ని రోజులు కొనసాగుతూ వచ్చిన సెర్చింజన్‌ దిగ్గజం రెండో స్థానానికివచ్చేసింది. గూగుల్‌ స్థానాన్ని ఆపిల్‌ భర్తీ చేసి టాప్‌ కొచ్చింది. అదేవిధంగా ఇటీవల డేటా స్కాండల్‌ సమస్యలతో సతమతమవుతున్న సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఏకంగా 9వ స్థానానికి పడిపోయింది. 

గ్లోబల్‌ బ్రాండ్‌ కన్సల్టెన్సీ ఇంటర్‌బ్రాండ్స్‌‘బెస్ట్‌ 100 గ్లోబల్‌ బ్రాండ్స్‌ 2018’ను జాబితాను ప్రకటించింది. దీనిలో టాప్‌ బ్రాండుగా ఆపిల్‌ చోటు దక్కించుకుంది. ఆపిల్‌ ఇటీవలే 1 ట్రిలియన్‌ డాలర్ల(రూ.73.7 లక్షల కోట్ల) మార్కెట్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్న తొలి కంపెనీగా నిలిచింది. దీంతో ఆపిల్‌ బ్రాండు విలువ ఏడాది ఏడాదికి 16 శాతం పెరిగి, 214.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఆపిల్‌ టాప్‌లోకి రావడంతో, గూగుల్‌ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. గూగుల్‌ బ్రాండ్‌ విలువ 10 శాతం పెరిగి, 155.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక ఆపిల్‌, గూగుల్‌ తర్వాత 56 శాతం వృద్దితో అమెజాన్‌ మూడో టాప్‌ బ్రాండుగా చోటు దక్కించుకుంది. 

అమెజాన్‌ తర్వాత 92.7 బిలియన్‌ డాలర్లతో మైక్రోసాఫ్ట్‌ నాలుగో స్థానాన్ని, 66.3 బిలియన్‌ డాలర్లతో కోకా కోలా ఐదో స్థానాన్ని, శాంసంగ్‌ ఆరో స్థానాన్ని సంపాదించుకున్నాయి. అయితే కేంబ్రిడ్జ్‌ అనలిటికా డేటా స్కాండల్‌ ఉదంతంతో ఫేస్‌బుక్‌ బ్రాండు విలువ 6 శాతం క్షీణించి, తొమ్మిదో స్థానంలోకి పడిపోయింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత దశాబ్దంలో బ్రాండులు చాలా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చాయని, అవి తమ కస్టమర్లను అర్థం చేసుకుంటూ.. వారికి అనుగుణంగా ఎప్పడికప్పుడు కొత్త కొత్త ప్రొడక్ట్‌లను అందజేస్తున్నాయని ఇంటర్‌బ్రాండ్‌ గ్లోబల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ చార్లెస్‌ ట్రెవిల్‌ చెప్పారు. 

తొలిసారి స్పాటిఫై, సుబరు గ్లోబల్‌ టాప్‌ 100 బ్రాండ్‌ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఎలోన్‌ మస్క్‌కు చెందిన టెస్లా గతేడాది టాప్‌ 100లో ఉంది. కానీ ఈసారి టాప్‌ 100 రేసులో నిలువలేకపోయింది. దాని బ్రాండు, భవిష్యత్తుపై వివాదాలు నెలకొనడంతో, టెస్లా టాప్‌ 100లోకి రాలేకపోయింది. బ్రాండెడ్‌ ప్రొడక్ట్‌ల, సర్వీసుల ఆర్థిక పనితీరు, కొనుగోలు నిర్ణయాలు, బ్రాండ్‌ పోటీతత్వ బలం, విశ్వసనీయతను సృష్టించే సామర్ధ్యంను ఆధారంగా చేసుకుని ఇంటర్‌బ్రాండ్‌ ఈ రిపోర్టును విడుదల చేస్తుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top