‘మాఫీ’ జాప్యానికి మేం కారణం కాదు

‘మాఫీ’ జాప్యానికి మేం కారణం కాదు - Sakshi


- ఏపీలో రైతు రుణ మాఫీ అమలుపై ఆంధ్రాబ్యాంక్ సీఎండీ రాజేంద్రన్

- అడిగిన డేటా ఇవ్వడానికి సిబ్బంది 24 గంటలు పని చేస్తున్నారు

- ప్రభుత్వం తరచూ రుణమాఫీ నిబంధనలు మార్పు చేస్తోంది

- దీనికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉన్నాం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకులు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లే రుణ మాఫీ పథకాన్ని అమలు చేయలేకపోతున్నామన్న ప్రభుత్వ వాదనను ఆంధ్రప్రదేశ్ బ్యాంకర్ల సమితి కన్వీనర్, ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్. రాజేంద్రన్ ఖండించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న సమాచారాన్ని ఇవ్వడానికి తమ సిబ్బంది 24 గంటలూ కృషిచేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణ మాఫీ నిబంధనలను తరచూ మార్పు చేస్తోందని, దీనికి తగ్గట్టుగా కొత్త డేటాను సమీకరించి ఇవ్వాల్సి వస్తోందన్నారు. అమలు చేయాలనుకుంటున్న రుణ పరిమితికి సంబంధించి తుది ఫార్మాట్‌తో వస్తే నిర్దేశిత సమయంకంటే ముందుగానే సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కొంత మంది కలెక్టర్లు అదనపు సమాచారాన్ని కూడా అడుగుతున్నారని, వీటిని ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయన్నారు.



ఆంధ్రప్రదేశ్‌లో రుణ మాఫీ అమలు ఆలస్యానికి బ్యాంకులు కారణం కాదని రాజేంద్రన్ స్పష్టం చేశారు. హైదరాబాద్, పంజాగుట్ట సర్కిల్‌లో ఏర్పాటు చేసిన 2,000వ ఏటీఎంను ప్రారంభించిన అనంతరం రాజేంద్రన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ రుణాల రెన్యువల్స్‌పై ప్రధానంగా దృష్టిసారించామ ని, కానీ స్పందన అంతంతమాత్రంగానే ఉందన్నారు. కొంతమంది రైతులు స్వచ్ఛందంగా రుణాలు చెల్లించడానికి ముందుకు వస్తున్నా స్థానిక రాజకీయ నాయ కులు వారిని అడ్డుకుంటున్నారన్నారు. దీంతో గత త్రైమాసికంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో వ్యవసాయ రుణాల మొండి బకాయి(ఎన్‌పీఏ)లు మరో రూ. 200-300 కోట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. తొలి త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంక్ వ్యయసాయ రుణాల్లో రూ.1,078 కోట్లు ఎన్‌పీఏలుగా మారడం తెలిసిందే.

 

తెలంగాణపై అధికారిక సమాచారం లేదు

తెలంగాణలో రైతు రుణమాఫీ అమలుపై ఇంత వరకు ఎటువంటి అధికారిక సమాచారం బ్యాంకులకు అందలేదని రాజేంద్రన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బ్యాంకుల నుంచి వివిధ సమాచారాన్ని కోరుతోందన్నారు. రాజేంద్రన్ ఈ విషయం పేర్కొన్న తర్వాత తొలి దశకింద రుణ మాఫీ కోసం రూ. 4,250 కోట్లు మంజూరు చేయడానికి తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకోవడం విశేషం. దీనిపై వివరణ కోసం బ్యాంకు ప్రతినిధులను సంప్రదించగా అధికారికంగా ఇంత వరకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు.

 

ఏటీఎం లావాదేవీలపై పరిమితుల్లేవు: సొంత ఏటీఎం లావాదేవీల పరిమితులపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రాజేంద్రన్ తెలిపారు. మిగిలిన బ్యాంకుల బాటలోనే తామూ నడుస్తామన్నారు. సొంత ఏటీఎం లావాదేవీలను నెలకు ఐదుకు పరిమితం చేసుకోవడానికి ఆర్‌బీఐ అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆంధ్రాబ్యాంక్ 2,200 శాఖలను కలిగిఉందని.. ఈ ఏడాది కొత్తగా 450 శాఖలు.. సుమారు 500 ఏటీఎంలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top