అనిశ్చితితో తగ్గిన వ్యాపారం | Sakshi
Sakshi News home page

అనిశ్చితితో తగ్గిన వ్యాపారం

Published Sun, Feb 2 2014 2:36 AM

అనిశ్చితితో తగ్గిన వ్యాపారం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్ర విభజన నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి  కారణంగా వ్యాపారం 10-20 శాతం మేర దెబ్బతిందని ఆంధ్రా బ్యాంక్ సీఎండీ సివీఆర్ రాజేంద్రన్ చెప్పారు. దీనికి తోడు విద్యుత్, ఇన్‌ఫ్రా కంపెనీలకు ఇచ్చిన రుణాలు కూడా రీస్ట్రక్చర్ చేయాల్సి వస్తుండటం తదితర అంశాల  మూలంగా కూడా బ్యాంక్ ప్రస్తుతం కష్టకాలాన్ని ఎదుర్కొంటోందన్నారు. అయితే, ఎన్నికలు ముగిశాక .. వచ్చే ఆరు నెలల్లో పరిస్థితులు మెరుగుపడగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ ఆంధ్రా బ్యాంక్ కార్పొరేట్ బ్యాంకింగ్ బ్రాంచీని కొత్త ఆవరణలో ప్రారంభించిన సందర్భంగా రాజేంద్రన్ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్ వ్యాపారం రూ. 2,35,000 కోట్ల స్థాయిలో ఉండగా..ఇందులో దాదాపు 50 శాతం వాటా ఆంధ్రప్రదేశ్‌దే ఉందన్నారు. హైదరాబాద్ విభాగం నుంచే రూ. 45,000 కోట్ల వ్యాపారం వస్తోందని వివరించారు. ప్రస్తుతం రిటైల్ లోన్ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని రాజేంద్రన్ ఈ సందర్భంగా వివరించారు.
 
 డీసీ రుణాలు..: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ సంస్థ రుణాలకు సంబంధించి స్వాధీనం చేసుకున్న ఆస్తులను వేలం వేసినా పూర్తి విలువ రాబట్టుకోగలిగే అవకాశం లేదని రాజేంద్రన్ చెప్పారు. ఒకవేళ రుణాల తిరిగి చెల్లింపునకు డీసీ సరైన ప్రణాళికతో కంపెనీ గానీ ముందుకొస్తే.. సానుకూలంగా పరిశీలించేందుకు ఆస్కారం ఉందన్నారు.
 
 వడ్డీ రేట్లపై కామెంట్..: ఆర్‌బీఐ రెపో రేటు పెంపునకు అనుగుణంగా ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు పెంచే యోచనేదీ లేదని.. మిగతా పెద్ద బ్యాంకులేమైనా ఆ దిశగా చర్యలు తీసుకుంటే తామూ నిర్ణయం తీసుకుంటామని రాజేంద్రన్ పేర్కొన్నారు.
 
 ప్రత్యేకంగా లాకర్ సెంటర్లు..
 
 లాకర్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో వీటికోసం ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు రాజేంద్రన్ చెప్పారు. ఆయా ప్రాంతాల్లో డిమాండ్‌ను బట్టి వీటిని నెలకొల్పుతామని రాజేంద్రన్ ఈ సందర్భంగా తెలిపారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement