భారత్‌తో వాణిజ్యం.. చైనాను దాటేసిన అమెరికా

AMerica Crossed China in Trade With India - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో చైనాను వెనక్కి నెట్టేసి అమెరికా మరింత ముందుకు వచ్చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ వివరాల ప్రకారం 2018–19లో అమెరికాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 87.95 బిలియన్‌ డాలర్ల స్థాయికి వృద్ధి చెందింది. అదే ఏడాది చైనాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 87.07 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2019–20లో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు చూసుకున్నా.. అమెరికా–భారత్‌ మధ్య 68 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లావాదేవీలు చోటు చేసుకున్నాయి.

ఇదే కాలంలో చైనాతో వాణిజ్యం 64.96 బిలియన్‌ డాలర్లు కావడం గమనార్హం. అమెరికా– భారత్‌ తమ వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుండడంతో, ఇదే పరిస్థితి ఇక ముందూ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అమెరికా–భారత్‌ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) వస్తే అప్పుడు ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని నిపుణులు భావిస్తున్నారు. మనదేశ వస్తు సేవలకు అమెరికా పెద్ద మార్కెట్‌గా ఉన్నందున ఎఫ్‌టీఏ మనకే ఎక్కువ ప్రయోజనకరమని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ పేర్కొన్నారు. 2018–19లో అమెరికాతో మన దేశానికి వాణిజ్య మిగులు 16.85 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, చైనాతో 53.56 బిలియన్‌ డాలర్ల లోటు ఉండడం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top