అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ కాస్మొటిక్స్‌ అమ్మకాలు : షాకింగ్‌ న్యూస్‌

Amazon, Flipkart Get Notice For Allegedly Selling Fake Cosmetics - Sakshi

 నకిలీ, కల్తీ ఉత్పత్తులను అంటగడుతున్న సంస్థలు

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా పలు సంస్థలకు డీసీజీఐ నోటీసులు

10రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలో సౌందర్య ఉత్పత్తులను కొంటున్నారా? అయితే మీకో విభ్రాంతికర వార్త. ముఖ్యంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి దిగ్గజ ఈ కామర్స్‌సంస్థలు నకిలీ, కల్తీ కాస్మొటిక్‌ ఉత్పత్తులను వినియోగదారులకు అంటకడుతున్నాయి. ఈ విషయాలను దేశీయ డ్రగ్‌ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) స్వయంగా ప్రకటించింది. ఈ మేరకు పలు ఇ-కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. దిగుమతి చేసుకున్న బ్రాండ్లతో సహా, పలు సౌందర్య ఉత్పతులను నకిలీవి, కల్తీవి విక్రయిస్తున్నారని మండిపడింది. తమ నోటీసులపై స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

అక్టోబర్ 5-6 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు నిర్వహించిన దాడుల్లో ఈ షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. దేశీయంగా తయారు చేసిన  ​ కాస్మొటిక్స్‌ను చెల్లుబాటు అయ్యే ఉత్పత్తి లైసెన్స్ లేకుండానే, అవసరమైన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు లేకుండా దిగుమతి చేసుకున్న వాటిని ఇ-కామర్స్ వేదికలపై విక్రయిస్తున్నారని అధికారులు తేల్చారు. 1940 డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్‌ యాక్ట్‌ ప్రకారం లైసెన్స్‌లేని ఉత‍్పత్తులను విక్రయంచడం నేరమని, తమ నోటీసులపై పదిరోజుల్లోగా సమాధానాలు ఇవ్వాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని డిసిజిఐ ఎస్ ఈశ్వర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు.

చట్ట ప్రకారం, భారతదేశంలో సౌందర్య సాధనాల దిగుమతి కోసం నమోదు సర్టిఫికేట్ పొందటం తప్పనిసరి, దేశంలో తయారయ్యే అన్ని సౌందర్య సాధనాలు విక్రయానికి సరైన లైసెన్స్ కలిగి ఉండాలి. అంతే కాకుండా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) రూపొందించిన ప్రమాణాలకు అనుగుణంగా కాస్మెటిక్స్  ఉండాలి, దాని ప్రతికూల జాబితాలో పేర్కొన్న ఏ  ఒక్క పదార్ధాన్ని కలిగి ఉండకూడదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top