
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కస్టమర్లకు త్వరితగతిన ఉత్పత్తులను అందించేందుకు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ పెద్ద ఎత్తున గిడ్డంగులను (ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు) ఏర్పాటు చేస్తోంది. తాజాగా 6 ప్రత్యేక గిడ్డంగులు, 25 డెలివరీ స్టేషన్లను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే సంస్థకు 9 ప్రత్యేక గిడ్డంగులు, 35 డెలివరీ స్టేషన్లున్నాయి. వీటికితోడు 41 గిడ్డంగులను సంస్థ నిర్వహిస్తోంది.
పెద్ద ఉపకరణాలైన టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, ఫర్నిచర్ వంటివి స్పెషల్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల ద్వారా వినియోగదార్లకు సరఫరా చేస్తారు. తాజా విస్తరణతో 30 నగరాల్లో ఆర్డరు ఇచ్చిన తదుపరి రోజులోపే డెలివరీ చేస్తున్నట్టు అమెజాన్ ఇండియా కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు.
అప్లయాన్సెస్ కేటగిరీ లీడర్ సుచిత్ సుభాష్‌తో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌తోసహా ఇతర నగరాల్లోని ప్రత్యేక గిడ్డంగుల సామర్థ్యాన్ని విస్తరిస్తున్నట్టు చెప్పారు. స్పెషల్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల ద్వారా 5,000 రకాల విస్తృత శ్రేణి ఉత్పాదనలను విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. వీటిలో 200 ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్టులు ఉన్నాయన్నారు.