నెట్‌వర్క్‌ టెస్టింగ్‌కు 90 రోజుల వ్యవధి

90 days period for network testing - Sakshi

సబ్‌స్క్రయిబర్స్‌ సంఖ్యపైనా పరిమితులు 

కొత్త టెల్కోలపై ట్రాయ్‌ సిఫార్సులు

న్యూఢిల్లీ: కొత్త టెలికం ఆపరేటర్లు పూర్తి స్థాయి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించడానికి ముం దుగా నిర్వహించే నెట్‌వర్క్‌ టెస్టింగ్‌ తదితర అంశాలపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ పలు సిఫార్సులు చేసింది. టెస్టింగ్‌ అవసరాల కోసం ఆపరేటరు సబ్‌స్క్రయిబర్స్‌ను నమోదు చేసుకోవచ్చని.. అయితే ఆయా సర్వీసు ఏరియాల్లో యూజర్ల సంఖ్య పైనా, టెస్టింగ్‌ కాలంపైనా పరిమితులు ఉండాలని పేర్కొంది.

ప్రయోగాత్మక పరీక్షలకు 90 రోజుల దాకా వ్యవధి ఉండాలని ట్రాయ్‌ సూచించింది, ఒకవేళ ఆ వ్యవధి లోగా నెట్‌వర్క్‌ టెస్టింగ్‌ పూర్తి కాకపోతే అందుకు సహేతుకమైన కారణాలు చూపగలిగితే సందర్భాన్ని బట్టి గడువు మరికొంత కాలం పొడిగించవచ్చని పేర్కొంది. పూర్తి స్థాయి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుగా టెస్టింగ్‌ దశలోనే రిలయన్స్‌ జియో ఏకంగా 15 లక్షల మంది పైగా యూజర్లను నమోదు చేసుకోవడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.

ట్రయల్‌ లాంచ్‌ పేరిట జియో ఉచిత ఆఫర్లతో పూర్తి స్థాయి మొబైల్‌ కనెక్షన్‌ సేవలు అందిస్తోందంటూ అప్పట్లో మిగతా టెల్కోలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు ఎంతకాలం పాటు నెట్‌వర్క్‌ టెస్టింగ్‌ నిర్వహించవచ్చన్న అంశంపై నిర్ధిష్ట పరిమితులేమీ లేవు. ఈ నేపథ్యంలోనే ట్రయల్‌ సర్వీసులపై ట్రాయ్‌ తాజా సిఫార్సులు ప్రకటించింది. వీటిలో మరికొన్ని కీలకమైన అంశాలు ..

ఒక సర్వీస్‌ ఏరియాలో (టెలికం సర్కిల్‌) టెస్ట్‌ సబ్‌స్క్రయిబర్స్‌ సంఖ్య..  స్థాపిత నెట్‌వర్క్‌ సామర్ధ్యంలో 5% మించకూడదు. టెస్టింగ్‌కి యూజర్లను నమోదు చేసుకోవడానికి 15 రోజుల ముందుగానే నెట్‌వర్క్‌ సామర్థ్యాలు తదితర వివరాలను టెలికం శాఖ, ట్రాయ్‌కి తెలియజేయాల్సి ఉంటుంది.
టెస్టింగ్‌ దశలో నంబర్‌ పోర్టింగ్‌ సదుపాయం కల్పించడానికి లేదు. అందజేసే సర్వీసులు, నెట్‌వర్క్‌ పనితీరు ఓ మోస్తరుగా ఉండే విషయాన్ని గురించి యూజర్లకు తెలియజేయాలి. అలాగే పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాలు ఎప్పట్నుంచీ మొదలుపెట్టేది, టెస్ట్‌ దశలో చార్జీల మినహాయింపు మొదలైనవి కూడా తెలపాలి.
పరీక్షల దశలో కూడా గోప్యత, భద్రత, కాల్‌ రికార్డుల నిర్వహణ, పర్యవేక్షణ తదితర నిబంధనలను కచ్చితంగా పాటించాలి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top