ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.4,670 కోట్లు

4,670 Crore Profits To ICICI Bank - Sakshi

రెండు రెట్లు వృద్ధి

కలసివచ్చిన ఎస్సార్‌ స్టీల్‌ రుణ రికవరీ

నిర్వహణ లాభం 23 శాతం అప్‌

ముంబై: ప్రైవేట్‌ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) మూడో త్రైమాసిక కాలంలో రెండు రెట్లు పెరిగింది. గత క్యూ3లో రూ.1,874 కోట్లుగా  ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌)ఈ క్యూ3లో రూ.4,670 కోట్లకు పెరిగిందని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. ఎస్సార్‌ స్టీల్‌ రుణాలు రికవరీ కావడం, కీలక ఆదాయం పెరగడం దీనికి కారణమని వివరించింది. స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, నికర లాభం రూ.1,605 కోట్ల నుంచి రూ.4,146 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరిన్ని వివరాలు.... 

నికర వడ్డీ ఆదాయం 24 శాతం అప్‌... 
ఈ క్యూ3లో బ్యాంక్‌ 16 శాతం రుణ వృద్ధిని సాధించింది. నికర వడ్డీ మార్జిన్‌(ఎన్‌ఐఎం) 3.77 శాతానికి పెరిగింది. దీంతో నికర వడ్డీ ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.8,545 కోట్లకు ఎగబాకింది. ఇక ఇతర ఆదాయం 19 శాతం పెరిగి రూ.4,043 కోట్లకు చేరింది. ఫీజు ఆదాయం 17 శాతం వృద్ధి చెందింది. నిర్వహణ లాభం 23 శాతం వృద్ధితో రూ.7,017 కోట్లకు పెరిగింది.

తగ్గిన మొండి బకాయిలు.... 
గత క్యూ3లో 7.75 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 5.95 శాతానికి తగ్గాయి. ఈ క్యూ3లో తాజా మొండి బకాయిలు రూ.4,363 కోట్లకు ఎగిశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధికం. అయితే ఎస్సార్‌ స్టీల్‌ రుణాలు రూ.2,000 కోట్ల మేర రికవరీ అయ్యాయి. దీంతో నికరంగా చూస్తే, తాజా మొండి బకాయిల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ఇక కేటాయింపులు 51 శాతం తగ్గి రూ.2,083 కోట్లకు చేరాయి.  ఐసీఐసీఐ బ్యాంక్‌ క్యూ3 ఆర్థిక ఫలితాలను శనివారం వెల్లడించింది. ఫలితాలపై సానుకూల అంచనాలతో గత శుక్రవారం 1.1 శాతం లాభంతో రూ.533.95 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top