రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 28 నుండి అక్టోబర్‌ 4 వరకు)

Weekly Horoscope in Telugu - Sakshi

జన్మనక్షత్రం తెలియదా?నో ప్రాబ్లమ్‌!మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (సెప్టెంబర్‌ 28 నుండి అక్టోబర్‌ 4 వరకు) మీ రాశి ఫలితాలు-డా‘‘ మైలవరపు శ్రీనివాసరావు జ్యోతిష్య పండితులు

మేషం(మార్చి 21 –ఏప్రిల్‌ 19)
కుటుంబ సభ్యులందరి ఆరోగ్యాలూ బాగుండే కారణంగా చెప్పలేని సంతోషం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉండని కారణంగా మనశ్శాంతికరంగా గడుస్తుంది ఈ వారం. ఎప్పుడో వస్తాయనుకున్న లేదా అసలు రానేరావేమో అనుకున్న పాతబకాయిలు లేదా ఇతరులు తీసుకున్న రుణాలూ అనుకోని విధంగా వసూలు అవుతాయి. కొద్దిగా తగ్గించవలసిందని రుణాన్ని తీసుకున్న వారడిగే అవకాశముంది. అంగీకరించి ఆ వ్యవహారాన్ని పరిష్కరించేసుకోవడం ఉత్తమం.

ప్రభుత్వం వారినుండి రావలసిన సొమ్ము కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశముందిగాని తప్పక రాగలదు. ఆ సొమ్ము రాకకోసం ఖర్చు చేసుకోవడం అనవసరం. ధనంతో ధనవ్యాపారాన్ని చేసే చిట్‌ఫండ్లు– లాటరీలు– షేర్లు వంటి వాటిలో అప్రమత్తత అవసరం. అనుభవజ్ఞులతో సంప్రదింపులు చేయడం మంచిది. అయినా కూడా అనుకున్నంత లాభాలు రావడం సాధ్యపడక పోవచ్చు. అలాగే మీరు వారి నుండి సొమ్ముల్ని వసూలు చేయడం అనేది కూడా కష్టతరం కావచ్చు.

వీలయినంతవరకు వాదవివాదాలతో సమస్యల పరిష్కారం మంచిది తప్ప న్యాయస్థానానికి వెళ్లడం సరికాదు. పెద్దమనుషుల ఒప్పందాలు మంచివే. అయితే జరిగిన ఒప్పందాన్ని మౌఖికంగా కాకుండా రాతపూర్వకంగా చేసుకోవడం తప్పనిసరి.

ఈ దశలో ఎదుటివారు రాతకోతలకి అంగీకరించకపోవచ్చు కాబట్టి ముందుకి ముందే మధ్యవర్తులతో ఈ మాటని చెప్పి ఒప్పించేలా చేయవలసిందనడం సముచితం. ఒకవేళ న్యాయస్థానం దాకా వెళ్తామని శత్రుపక్షం వారు బెదిరించినా భయపడకండి. వాళ్లది కేవలం బెదిరింపు మాత్రమేనని గ్రహించండి.

లౌకిక పరిహారం: ఒప్పందాలు రాతపూర్వకంగా ఉండడం మంచిది.
అలౌకిక పరిహారం: అమ్మవారికి ఇంట్లో అఖండ దీపారాధనం చేసి పూజించండి అవకాశమున్నంతలో.

వృషభం (ఏప్రిల్‌ 20 –మే 20)
మాట్లాడితే చాలు ఎదుటివారికది పోట్లాటగా అనిపించవచ్చు కాబట్టి ఆచితూచి మాట్లాడడం సముచితం. బాగా దగ్గరైన వారిలో కూడా మీ గురించిన అపోహలు ఇతరుల చాడీల కారణంగా కలగచ్చు కాబట్టి దాపరికం లేకుండా ఉన్నదున్నట్టుగా చెప్పెయ్యండి ఎవరైనా అడిగితే. మీ మాటకి ఉన్న విలువ పెరిగేది మీలో దాపరికం లేనప్పుడే. ఏ ఒక్కరికి ఈ అభిప్రాయాన్ని మీరు కలిగించినా చాలు మీ మీద సంపూర్ణ విశ్వాసం అందరికీ కలిగి తీరుతుంది. వివాహాది శుభకార్యాల్లో మధ్యవర్తిగా ఉండడం గాని, ఆ భారాన్ని తలకెత్తుకోవడం గాని ఈ వారంలో చేయద్దు. కాలం అనుకూలంగా లేని కారణంగా పని సకాలంలో జరక్క నిందని మోయవలసి రావచ్చు. కొన్ని  చిన్నపాటి వ్యవహారాల్లో చికాకులు రావచ్చు. మనసు గాయపడచ్చు కాబట్టి వ్యవహారాలకి దూరంగా ఉండడం మంచిది. తగినంత సమయం లేదనడం గాని ప్రస్తుతం నా పరిస్థితే సక్రమంగా లేదని చెప్పుకోవడం గాని మంచిది. ఆది నిష్ఠురం ఎప్పుడూ ఉత్తమమే.  పిత్రార్జితమైన ద్రవ్యాన్ని మీకుగా వాటాలు చేయవలసిందిగా అడక్కండి. మిగిలిన అందరూ కలిసి విభాగం చేసుకోవలసిందేనని సూచిస్తే కాదనకండి. ఆలోచన అయితే రావచ్చు గాని ఈ సంవత్సరంలో పంపకాలు రాకపోవచ్చును. ఈలోగా మీకంటూ ఓ అవగాహనని పిత్రార్జితమైన ఆస్తిని గురించి కలిగించుకోండి. పిల్లల చదువు బాగానే ఉండచ్చునేమోగాని, ప్రవర్తన విషయంలో ఒకింత మార్పుండే అవకాశముంది కాబట్టి గమనించి ఉండండి. వాళ్లకిష్టం కాని ఏదైనా విషయం చెప్పాల్సి ఉంటే తాత, బామ్మ, అమ్మమ్మల ద్వారా వాళ్లకి అర్థమయ్యేలా చెప్పి ఇష్టపూర్వకంగా వాళ్లు ఒప్పుకునేలా చేసుకోండి. వ్యతిరేకత ఏమాత్రం ఉండదు.

లౌకిక పరిహారం: అనవసర విషయాల్లో తలదూర్చకండి. మీ పనులని వాయిదా వేసుకోకండి.
అలౌకిక పరిహారం: ఇంట్లో అమ్మవారి భజనని ఏర్పాటు చేసుకోండి.

మిథునం(మే 21 –జూన్‌ 20)
దాదాపుగా మీరు చేయాలనుకున్న అన్ని పనుల్లోనూ ఏదో ఓ తీరు ఆటంకం వచ్చే అవకాశముంది. ఇది ఒకందుకు మంచిదే. అలా విఘ్నం వచ్చిన కారణంగా ఆ సాధించవలసిన పనిని గూర్చి మరింత లోతుగా మీరు ఆలోచిస్తారు. అనుభవజ్ఞుల్ని కలుస్తారు. సలహా సంప్రదింపుల్ని చేసి అంతకంటె పెద్ద ఆటంకం వచ్చినా భయపడకుండా నిలబడగల శక్తిని పెంపొందించుకుంటారు. గురువు 6వ ఇంట ఉన్న కారణంగా కుటుంబ సభ్యులతో తాత్కాలిక అభిప్రాయ భేదాలు కలిగి కొంత ముభావంగా ఉండే పరిస్థితి గోచరించవచ్చు. పరిస్థితులు మరింత తీవ్రతరం కానే కావుగాని బంధువుల ప్రవేశం కారణంగా మనశ్శాంతి లోపించవచ్చు. వయసులో ఉన్న మీ సంతానం విషయంలో మీరే దిగి రావడం మంచిది. మీ పెద్దరికాన్ని నిలుపుకోవడం మంచిది. తర్వాత వాళ్లూ పశ్చాత్తాప పడతారు ఖాయంగా.  శని సప్తమంలో ఉన్న కారణంగా ఏది తిన్నా వెంటనే జీర్ణం కాకపోవడం, అలాగే తప్పనిసరిగా మీ ఒంటికి పడనివే తినవలసి రావడం, తగిన ఔషధమేదో మీకు తెలిసినా అది సకాలంలో లభ్యపడకపోవడం వంటివన్నీ తప్పక జరిగే అవకాశముంది. అయితే ఆరోగ్యం తాత్కాలికంగా మందకొడిగా ఉండచ్చునేమోగాని, వైద్యశాలా ప్రవేశం జరిగే స్థాయి అనారోగ్యం మాత్రం రాదు. అలాగే శని సప్తమంలో ఉండి ఇద్దరి మధ్యా ఏదో విభేదాన్ని ఏర్పాటు చేయాలనే గట్టి పట్టుదలతో ఉంటాడు కాబట్టి ఎవరి మాటనీ పట్టించుకోకుండా ఉండడం మంచిది. ఎక్కువెక్కువ వ్యయాన్ని చేయడాన్ని నిరోధించుకోవడం కూడా మంచిదే. గడ్డిపరక కంటె దూదీ దానికంటే అప్పు అడిగేందుకై చేయి చాపేవాడూ చులకన అని శాస్త్రం చెప్పిన మాట కాబట్టి పొరపాటున కూడా చేతిని చాపి యాచించకండి. ఉన్నంతలో సర్దుకుపోవడాన్ని అలవాటు చేసుకోండి.

లౌకిక పరిహారం: ఆరోగ్యం పట్ల శ్రద్ధ తప్పనిసరి.
అలౌకిక పరిహారం: అమ్మవారి శక్తి పీఠాల్లో ఒకదాన్ని దర్శించే ప్రయత్నం చేయండి ఈ నవరాత్రుల్లో.

కర్కాటకం(జూన్‌ 21 –జూలై 22)
రాహువు 12 ఇంట ఉన్న కారణంగా శరీరంలో మాంసానికి గాని, నేత్రాలకి గాని అనారోగ్యం కలవచ్చు. మాంసం అనేది శరీరం నిండుగా వ్యాపించి ఉంటుంది కాబట్టి, గడ్డలు, దద్దుర్లు... వంటి చర్మవ్యాధులన్నీ విచ్చలవిడిగా విడుదల అవుతూ వ్యక్తిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తతో ఉండడం సర్వదా శ్రేయస్కరం.
విదేశాల వారు మీ ప్రతిభని గుర్తించి మిమ్మల్ని విదేశాలకి రావలసిందిగా ఆహ్వానించే అవకాశం ఉంది. అంతేగాక ప్రత్యేక సభల్లో గొప్పగా సంమానించే అరుదైన అవకాశం కూడా లభిస్తుంది. అయితే చివరి క్షణంలో మీ కుటుంబ సభ్యుల సమస్యా పరిష్కారం నిమిత్తం విదేశీ ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఇక్కడే ఉండిపోతారు. నిరాశ పడాల్సిన అవసరం లేదు. విదేశీయానం కంటె– చిరకాలంగా అపరిష్కృతమైన ఓ సమస్య విడిపోవడమనేది ఎంత అదృష్టకరమైన విషయం! మీ గురించిన ఆందోళన మీకు లేకపోవచ్చునేమోగాని మీ కటుంబ సభ్యుల ఐకమత్య లోపం కారణఃగా కొంతలో కొంత సహాయ పడవచ్చును గదా! అనే తీరు మాటతో తప్పనిసరిగా వాళ్లకి సహాయపడే ఉద్దేశ్యంతో మీరు వెళ్లవచ్చు. వెళ్లే అవసరం– వెళ్లాల్సిన పరిస్థితీ అప్పటికప్పుడు ఏర్పడచ్చు.
వెళ్లడానికి సిద్ధపడి ఉండండి. వైద్యం, న్యాయం పరిశ్రమల రంగం వారికి పరిస్థితి అంతగా సుముఖంగా లేకపోవచ్చు ఈ వారమంతా కూడా. అలాగే అధికారంలో ఉన్న పై అధికారులక్కూడ నోటి దురుసుతనం ఉన్న పక్షంలో, అలా మాట్లాడిన పక్షంలో పెద్ద చిక్కులే రావచ్చు కూడా. ఆచితూచి మాట్లాడటం లేదా మౌనంగా అంటే తక్కువగా మాట్లాడడం ఎంతైనా సత్ఫలితాలనిస్తుంది.

లౌకిక పరిహారం: కుటుంబ శ్రేయస్సుకి ప్రాధాన్యాన్నియ్యండి సొంత ప్రయోజనాలకంటె.
అలౌకిక పరిహారం: అమ్మవారి పూజల్ని యథాశక్తి ఇంట్లో చేసుకోండి.

సింహం(జూలై 23 –ఆగస్ట్‌ 22)
మీరెంత జాగ్రత్తగా ఉండదలచి కుటుంబం బయటపడకుండా ఉండడం కోసం ఎంతెంత తీవ్రంగా శ్రమిస్తారో, ఆ ఫలితం మీకు లభించకుండా ఉండేలా కొందరు బంధువులు మీ మార్గానికి అడ్డొస్తూ మీ కటుంబం గురించి వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించవచ్చు. అలాంటి అందర్నీ ముందుగా ఎందుకు పిలిచారో చెప్తూ గట్టిగా వివరించి చెప్పండి– మా కుటుంబంలో జోక్యం మీకొద్దు అని. దాంతో మీ కుటుంబ గోప్యత పాటించబడుతుంది. నిజాన్ని నిజంగా అనుకుంటే ఆ బంధువులు కూడా మీ కుటుంబాన్ని అప్రతిష్ఠపాలు చేద్దామానే దురాలోచనతో అలా ప్రచారాన్ని ప్రారంభించి ఉండకపోవచ్చు. మీరెప్పుడూ ప్రతిఘటించకపోవడం కారణంగా అలా కుటుంబ రహస్యాన్ని చెప్పేసి ఉండచ్చు. బంధుత్వాన్ని దూరం చేసుకోకుండా వాళ్లని అదుపు చేయండి చాలు.
కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన కొనుగోళ్ళు అమ్మకాల లావాదేవీల్లో జరిగిన అవకతవకల గురించిన విశేషాలని తిరిగి తోడుతూ ఎవరైనా ఆ వివాదాన్ని తెరమీదకు తేదలిస్తే భయపడకండి. దానిక్కారణం దాదాపుగా అవన్నీ న్యాయస్థానాల్లోనో పెద్దమనుషుల ఒప్పందాల్లోనో పరిష్కరింపబడి ఉండడమూ, ఈ కొత్త వ్యక్తికి ఆ విషయం తెలియకపోవడమున్నూ. సంతానం చదువు బాగానే ఉన్నప్పటికీ, వాళ్లకి చదువుకంటె వ్యాపారం మీద దృష్టి బాగా ఉండచ్చు. అయితే వ్యాపార ప్రారంభాన్ని చేయడానిక్కావలసిన వనరుల్ని ఇప్పటికిప్పుడే పరిశీలించడం, ప్రారంభించే ఉద్దేశ్యాన్ని బలంగా వాళ్లకి కలిగించడం మంచిది కాదు. చదువు మధ్యలో ఉన్న ఈ సమయంలో ఈ వ్యాపార రంగంలోకి దింపితే వాళ్లు ‘రెంటికీ చెడ్డ రేవడు’లౌతూ అటు వ్యాపారం ఇటు చదువూ అనే రెంటికీ పని చేయని వాళ్లుగా అయ్యే ప్రమాదం ఉంది. పిల్లల్ని పట్టించుకోండి. గమనిస్తూ ఉండండి.

లౌకిక పరిహారం: బంధువులకి చెప్పండి– మీ కుటుంబ విషయాలు వాళ్లకి అనవసరమని.
అలౌకిక పరిహారం: అమ్మవారికి యథాశక్తి ద్రవ్యంతో ఎర్రని వస్త్రాలని సమర్పించుకోండి.

కన్య (ఆగస్ట్‌ 23 –సెప్టెంబర్‌ 22)
ఆర్థికంగానైతే మిశ్రమ వాతావరణం కనిపిస్తూ దాదాపుగా వచ్చిన ఆదాయమంతా ఏదో ఒక తీరుగా వ్యయం అయిపోతూ ఉంటుంది. అయితే ఈ వ్యయం మాత్రం సద్‌ వ్యయమే. అంటే ఇల్లు లేదా స్థలం లేదా వాహనం వంటి వాటిని కొనేందుకై తెచ్చిన రుణాలని వడ్డీతో సహా తీర్చేందుకు వినియోగించబడడ మన్నమాట. ఏ పనిని చేపట్టినా ఎవరితో సత్సంబంధాలని కొనసాగించుకోవాలన్నా అది ఒక పెద్ద శ్రమతో కూడిన పనిగా మీకు అనిపిస్తూ ఉండవచ్చు. ఇతరమైన పనులకి సంబంధించిన ఒత్తిడి ఉన్న కారణంగానో లేక కుటుంబ వాతావరణంలో కొద్ది అనుబంధం అప్పుడప్పుడు సరిగా ఉండని కారణంగానో పనిని సకాలంలో చేసుకునే వీలు లేక అది మీకు శ్రమగా అనిపించవచ్చు.

రుణం ఎంత ఉందో దానిమీద చెల్లించవలసి ఉన్న వడ్డీతో సహా ఎంతయిందో లెక్కించుకుని మీకుగా స్వతంత్రమైన ఆస్తి ఎంతుందో లెక్కించుకుని దానిలో ఒక భాగాన్ని అమ్మి మొత్తం రుణాన్ని తొలగించి వేయడం ఎంతో మంచిపని. రుణం పుట్టాలంటే వ్యక్తుల దగ్గర ‘నమ్మకం’ అవసరం. ఇవన్నీ దాదాపుగా వ్యక్తుల వద్ద చేసిన రుణాలే కాబట్టి వాళ్లలో విశ్వాసం పుట్టడం కోసం రుణాన్ని తీర్చేయడం మంచిది. తీర్చేసినా మీకు దిగులు లేదు. ఆస్తి అంతకుమించే ఉందనేది యథార్థం. గురుగ్రహం 4వ ఇంట ఉన్న కారణంగా విదేశీ ప్రయాణాల మీద ఆలోచనలూ సంపాదన మీద మోజూ ఎక్కువ అవుతూ ఉండచ్చు. అయితే అదే గురుగ్రహం వ్యయాన్ని కూడా పెంచుతాడనే విషయాన్ని గ్రహించి తగినంత పరిధిలోనే వ్యయాన్ని కట్టడి చేసుకోవాలని గ్రహించుకోగలగాలి.

లౌకిక పరిహారం: రుణాన్ని తీర్చేసి ఎప్పుడైనా అప్పు కావలసి వస్తే కావలసిన నమ్మకాన్ని పొందండి.
అలౌకిక పరిహారం: అమ్మవారి లలితా సహస్ర నామాలని సామూహికంగా పఠించుకోండి.

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
దైవం విశేషంగా అనుకూలిస్తున్న కాలం. ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా మీరనుకున్నట్టుగా నడిచే కాలం మీకిది ప్రస్తుతం. ఆ కారణంగానే మీ ప్రతిపక్షుల్ని పరాజయం పొందేలా చేయగలిగారు. అయితే గమనించాల్సిందొకటే. ‘ఈ సాధించిన విజయం మీకు ఎంతవరకూ లాభించిందని. అలాగని మీది విజయం కాదనేది దీనర్థం కాదు. అర్ధ విజయం మాత్రమే. ఈ దశలో శత్రుత్వాన్ని రాజీ ధోరణిలో మంచిగా తొలగించుకుందామా? లేక కొనసాగిద్దామా? అనేది నిర్ణయించుకోవలసి ఉంది. ఆలోచించుకోండి. అవసరానికి కాదు– అవసరాలకి ధనం విశేషంగా వచ్చి పడుతూ ఉంటుంది. పాత వాహనాలని తెగనమ్మి కొత్తవి కొనుక్కుంటారు. ఇంట్లో వయసొచ్చిన పిల్లలందరికీ దాదాపుగా ఉద్యోగాలు లభించిన కారణంగా ఆర్థిక రంగానికి లోటు లేదు. అయితే వాళ్ల వివాహాదుల విషయం మాత్రం సంపూర్ణం అయ్యుండకపోవచ్చు. దృష్టిని ఈ వైపుగా సారించి తీరాలి.  రాహు గ్రహం 9వ ఇంట ఉన్న కారణఃగా పనుల్లో ఆలస్యం ఉద్యోగపు ఒత్తిడి ద్వారాగాని– ప్రయాణాలు చేయలేని నిస్సత్తువ కారణంగా గాని లేదా మే కారణం వల్ల గాని జరుగుతూ ఉండచ్చు. ఒక్కోసారి ఈ రాహుదృష్టి కారణంగా వెళ్లిన అంత ప్రయాణమూ– ఆ అనుకున్న వ్యక్తి దొరకని కారణంగా– వృథా కావచ్చు కూడా. అందుకు సిద్ధపడి ఉండాల్సిందే.  కేతువు తృతీయంలో ఉన్న కారణంగా ఆరోగ్యం అయితే ఇంటిపెద్దకి చక్కగా ఉంటుంది. శారీరక అనారోగ్యానికి మించి మానసికంగా దృఢంగా కూడా ఉండచ్చు. అయితే పరిష్కరింపబడవలసి ఉన్న సమస్య మీదికి దృష్టిని కేవలం విరోధ– ప్రతీకార దృష్టులతో కాకుండా రాజీ ధోరణిలో ప్రసరింపజేస్తే తప్పక సమస్య విడిపోతుంది. అంతేగాక మనశ్శాంతి లభిస్తుంది కూడా.

లౌకిక పరిహారం: రాజీ ధోరణిలో మనశ్శాంతికి కృషి చేయడం మంచిది.
అలౌకిక పరిహారం: అమ్మవారి పూజకి 5 తీరుల పుష్పాలని ఆలయానికి సమర్పించండి.

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
గురుగ్రహం జన్మ (1వ ఇల్లు)లో ఉన్న కారణంగా మీరెంత వినయ విధేయతలతోనూ అంకితభావంతోనూ శ్రద్ధతోనూ పనిని చేసినా మీ పై అధికారి అంతగా మెచ్చుకోకపోవచ్చు. గ్రహ ప్రభావమని అనుకుంటూ మనసులోనే నవ్వుకోండి. అయితే చేసే పనిలో నిబద్ధత లేకుండా మాత్రం చేయద్దు. గురుగ్రహం మీ నుండి శ్రద్ధని తొలగించడుగాని మీరాశించిన ప్రశంసని ఇప్పించడు. ఏలిన నాటి శని కారణంగానూ, శని 2వ ఇంట ఉండి తీవ్ర దృష్టితో చూస్తున్న కారణంగానూ– ఈ సమస్య తీరిందనుకుంటుండగానే మరొకటి సిద్ధంగా కనిపిస్తూ ఉండచ్చు. ఏ చిత్రమేమంటే శనిగ్రహం మంచివాడు కాబట్టి ఇబ్బందిని కలిగించనూ కలిగిస్తాడు– నెత్తిమీది దాకా ఆ కష్టం వచ్చేసింది– ఇక అయిపోయా–మనుకునే క్షణంలో పెద్దగాలికి మేఘంలా చెదరగొట్టేసి నిండు సంతోషాన్ని కలిగిస్తాడు. ఏమైనా ఈ లోపులో పడే మానసిక క్షోభ ఎంతదో దాన్ని అనుభవించే మీకే తెలుస్తుంది. దీన్నే వేదాంత పరిభాషలో– పూర్వజన్మ పాపం తొలగిపోవడం (పాపక్షయం) అంటారు. అయితే ఎంతటి కష్టానికైనా ఎదురు నిలిచి గట్టిగా ఉండడాన్నీ నేర్పుతాడు పరోక్షంగా శని. పర స్త్రీ– ద్యూతం– మద్యపానం వంటి వ్యసనానికి లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. అదేగాని జరిగితే మీ పరిస్థితి పెనం మీదినుండి పొయ్యిలో పడ్డట్టుగా అవుతుంది. ఎవరూ రక్షించలేని పరిస్థితికి వెళ్లిపోతారు. బాగా ఆలోచించుకోగలగాలి. రాహుగ్రహం అష్టమంలో ఉన్న కారణంగా పర స్త్రీ పరిచయమనేది దొంగచాటు వివాహపు ఒత్తిడి దాకా వెళ్లచ్చు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. చిత్రమేమంటే ఇటు ఈ ఈ మానసిక ఆందోళన విచారమూ ఒకపక్క కలుగుతుంటే అటుపక్క మీ పై అధికారి మీ పని నైపుణ్యానికి ఎంతగానో ముచ్చట పడిపోతూ ప్రశంసిస్తూ కనిపిస్తాడు.

లౌకిక పరిహారం: వ్యసనం జోలికి పోయినట్లయితే ఏ దైవమూ అండగా ఉండడు.
అలౌకిక పరిహారం: అమ్మవారికి చందనజలంతో అభిషేకాన్ని చేసుకోండి.

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
గోతిలోకి దిగాల్సిన అవసరమే వస్తే మన శరీరాన్ని పడిపోకుండా కాళ్లతో బలంగా ఆధారం ఉండేలా చూసుకుని మరీ దిగుతాం. ప్రస్తుతపు పరిస్థితి అది కాదు. అకస్మాత్తుగా జారడం. ఆ కారణంగా రోజూ చేస్తున్న పనిని కూడ అప్రమత్తంగా ఉంటూ నిర్వర్తించుకోవాలి. వ్యాపారస్థులైతే నిషిద్ధ వస్తువుల కొనుగోళ్లూ అమ్మకాలూ లేకుండా, వృత్తిదారులైతే తగిన పత్రాలు లేకుండా, ఉద్యోగస్థులయితే ఈ కాలనియమాన్ని పాటించకుండా.. ఉండే ధోరణిని పూర్తిగా మానుకోవాలి. లేని పక్షంలో తినే దెబ్బ సామాన్యస్థాయిలో ఉండనియ్యడు ఒకటవ యింట ఉన్న శని. ఇలా చెప్పడమనేది భయపడవలసిందని చెప్పడానిక్కాదు. మీ జాగ్రత్తలో మీరుండండని నచ్చజెప్పడం గుర్తుచేయడం మాత్రమే. ఏలిననాటి ప్రారంభదశలో ఉంది కాబట్టి ఆర్థికమైన నియంత్రణ లేక తోచిన విధంగా మీరు వ్యయం చేస్తూ ఉండచ్చు. లేదా ఎవరికిస్తే ఒక సొమ్ము తిరిగి రానే రాదో వాళ్లకే ఇవ్వడం జరగచ్చు. ఆలోచనలో జడత్వం (ఆలోచించలేని స్తబ్దత) కలిగీ, అవతలివారు తొందరపెట్టడంతోనూ మీరు అనాలోచితంగా చేయరాని పనిని చేసే అవకాశముంది. కాబట్టి తొందరపడనే కూడదు. ఫలాని రోజున ఇస్తానని చెప్పినా వాయిదా వేసేందుకు సిద్ధంగా ఉండండి తప్ప ‘మాట పోతుందేమో!’ అనుకుని గోతిలో పడకండి. శరి ప్రతాపాన్ని రుచి చూడ ప్రయత్నించకండి. రాహువు 7వ యింట ఉన్న కారణంగా లాభాలు స్వల్పంగా ఉంటాయి. నష్టం ఉండదు. ఏదో పేరాసతో దూరభార ప్రయాణాలని ఆస్తి లాభం కోసం చేయచ్చుగాని అది ఫలించకపోవచ్చు. దాన్ని నష్టంగా భావించకండి. సంతోలో కూరగాయల్ని కొనేప్పుడు కూడ పరిశీలించుకునే కొన్నట్లు కొనబోయేదాని వివరాలు తెలియడానికి ప్రయాణం తప్పనిసరి కదా చూసిన ప్రతి ఆస్తినీ కొనేస్తామా? కాబట్టి దీన్ని వృథా ప్రయాణమనీ అదృష్టం లేదనీ అనుకోకండి. అదృష్టం బాగుంది కాబట్టే అది మనకి దక్క(డం)లేదని అనుకోండి.

లౌకిక పరిహారం: వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో నిబద్ధత సమయపాలన అవసరం.
అలౌకిక పరిహారం: అమ్మవారికి పసుపు జలంతో అభిషేకం చేయండి.

మకరం(డిసెంబర్‌ 22 – జనవరి 19)
మీకు మీరుగా మిమ్మల్ని ప్రశంసించుకోవడాన్ని విడనాడాలి. సాధించిన ప్రతి విజయాన్నీ అందరికీ వివరించుకుంటూ ఉంటే ఆత్మానందం కలగొచ్చేమో గాని, భవిష్యత్‌ ప్రణాళికని వేసుకునే అవకాశం లేకపోవచ్చు. వ్యాపారస్థుని స్థాయి కాదు ప్రధానం – నిత్యం వ్యాపారస్థలం వినియోగదారులతో ఉంటూ కొనుగోళ్లు, అమ్మకాలు బాగా సాగుతూండడం మాత్రమే ప్రధానం. కేతువు 12వ ఇంట ఉన్న కారణంగా మీకు వ్యాపారనష్టాన్ని కలిగించేలా ప్రయత్నిస్తాడు. శని ద్వాదశంలో (12వ ఇంట) ఉన్న కారణంగా వేగంగానూ అనాలోచితంగా మాట్లాడేలానూ చేయడమే కాక తొందరగా వాగ్దానాన్ని ఇప్పించేసి, ఆ మీదట వాగ్దానాన్ని చెల్లించుకోలేని పరిస్థితిని రప్పించి అపకీర్తిని అంటగడతాడు. ఆ కారణంగా ఆచితూచి మాట్లాడడం, హామీ వాగ్దానం వంటి వాటి జాడకి పోకపోవడం మంచిది. కంటికి ఏదైనా చిన్న తేడా అన్పించినా – తగ్గిపోతుందనే భరోసాని మాని వైద్యుణ్ణి సంప్రదించడం అవసరం.

ఎవరినో మీ శత్రువు భయపెట్టాడని వినడం కాకుండా, అదే తీరుగా మీ విషయంలో కూడ అదే శత్రువు లేదా మరొకరు రావచ్చునే జాగ్రతతో ఉండడం అవసరం. తప్పనిసరీ! ధనమనేది నష్టపోయినట్లయితే శరీరశక్తితోనో, బుద్ధి శక్తితోనో తిరిగి సంపాదించుకోవచ్చు. ఒక రోజు ఆలస్యం కావచ్చునేమో గాని సంపాదన మాత్రం ఆగిపోదు – సంపాదించాలనే తాపత్రయమే గాని ఉంటే, ఇక్కడే గమనించుకోవాలి. శని ద్వారం (12)లో ఉన్న కారణంగా అనవసర పరిచయాలు ఏర్పడచ్చు. 

లౌకిక పరిహారం: హామీలూ వాగ్దానాలూ వద్దు. కంటి విషయంలో జాగ్రత్త అవసరం.
అలౌకిక పరిహారం: అమ్మవారిని పసుపు జలంతో అభిషేకించండి.

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
గురుగ్రహం 10వ ఇంట ఉన్న కారణంగా మీ మీద మీకు ఎంతో నమ్మకం పెరిగిపోతూ ఉండచ్చు. ఎప్పుడూ ఎదురుగాలే ఎప్పుడూ వాలుగానే ఉండనట్లుగా సర్వకాలమూ ఎవరికీ ఎక్కడా అనుకూలం కాకపోవచ్చు కాబట్టి, ఎంత అవసరమో అంతే వస్తువుని అమ్మకానికి తెచ్చుకోవడం మంచిది తప్ప జోరుగా వ్యాపారం సాగుతుందనే నమ్మకంతో ఇతోధికంగా వస్తువుని తెచ్చుకోవడం సరికాదు. మీ స్వభావాన్ని బట్టి మీరు ఈ మాటల్ని విని కూడ మీకు తోచిందే మీరు చేయచ్చు. చేస్తారు కూడ. రావలసిన బకాయిలు రాకపోవడం, మీరు ఈయవలసిన రుణదాతల నుండి ఒత్తిడుల ప్రారంభం కావడం తప్పనిసరి కావచ్చు. సమయాన్ని మరికొంత అడిగి ఆ లోపులోనే తీర్చుకునే ప్రయత్నాన్ని చేస్తారు. మాటపడరు. అయితే వ్యాపార నిమిత్తం అలాగే మరోచోట వ్యాపారాన్ని ప్రారంభించే నిమిత్తంగా గాని కొత్త రుణాన్ని చేయదలచడం ప్రస్తుతం ఏ మాత్రం సరికాదు. ఆప్తులూ మిత్రులూ బంధువులూ ఏవేవో శుభకార్యాలంటూ మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానించే కారణంగా తప్పనిసరిగా ప్రయాణాలని చేయవలసి రావచ్చు. ఆ కారణంగా కొంత సొమ్ము ఉండాల్సిందే వ్యయం నిమిత్తం. మీ సంతానానికి సంబంధించిన శుభకార్యక్రమాల ఆలోచనలు కూడ ఈ సందర్భంగా మీకు కలగచ్చు. ఇతరుల మీద ద్వేషం, పగ, ప్రతీకారబుద్ధి అనేవి లేకుండా జాగ్రతగా ఉండడం మంచిది. శత్రువని తెలిసినా లోపల వ్యతిరేకత ఉన్నా మౌనంగా నమస్కరిస్తూ చిరునవ్వు నవ్వడాన్ని మరువద్దు. శని ఏకాదశం (11)వ ఇంట కారణంగా తాత్కాలికంగా మనస్తాపాన్ని కల్గించవచ్చు. అదో పెద్ద లెక్కించదగినది కాదు. వెంటనే ఎవరెవరి మాటల్నో విని పెద్ద ఎత్తున హోమాలు పూజలు దానాలు ధర్మాలు – అంత అవసరం లేదు.

లౌకిక పరిహారం: కొత్తగా రుణం చేయద్దు. రుణదాతల్లో నమ్మకాన్ని సడిలిపోనీయకూడదు.
అలౌకిక పరిహారం: అమ్మవారికి సుగంధవస్తువులనుంచి పరిమళజలంతో అభిషేకాన్ని చేయండి.

మీనం(ఫిబ్రవరి 19 – మార్చి 20)
ప్రస్తుతం మీ దశ చక్కగా ఉన్న కారణంగా ఆర్థికంగా బలంగా ఉంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. చేస్తున్న వ్యాపారం కూడ అనుకోనంతటి లాభాన్ని ఇస్తున్న కారణంగా నల్లేరు మీద బండిలా సాగించుకుంటూ వెళ్లిపోతుంటారు. సంతానం లేనివారికి సంతానలాభం, నిరుద్యోగులకి ఉద్యోగ లాభం ఉంది. మళ్లీ మాటాడితే ఒకటి రెండు ఉద్యోగాలొచ్చిన కారణంగా దేంట్లో చేరాలా? అనే ఆలోచన కలుగుతుంది కూడ. స్థిరమైన ఆస్తుల పంపకాలు ప్రస్తావన వచ్చినట్లయితే ధర్మబద్ధంగానే వ్యవహరించండి. ఏ ఆస్తి మీకు సంక్రమించే అవకాశముందని తెలిసిందో ఆ పిత్రార్జిత ధనాన్నీ లేదా ఆస్తినీ అలాగే భద్రపరచండి తప్ప, దాన్ని అమ్మి మరికొంత దానికి కలిపి మరేదో ఇంద్రభవనాన్ని కట్టాలనీ, మేరు పర్వతమంతగా చేద్దామనీ ప్రయత్నించకండి. రాహుగ్రహం 4వ యింట ఉన్నకారణంగా చేసుకున్న ఓ నిర్ణయాన్ని అలాగే ఉంచుకోవాలి తప్ప ఆలోచనని సడలనీయకూడదు. పైగా సవరణలని అస్సలు చేసుకోకూడదు. కుటుంబం చక్కని ఐకమత్య భావంతో ఉండే కారణంగా పొరపొచ్చాలుండవు. విద్యాపరంగా ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా... ఇలా అన్నిటా ఎలా ఎదగాలా? అనే చక్కని ఊహలతోనే ఉంటారు కూడ. శత్రువులని ఎలాగైనా దెబ్బతీయాల్సిందే ననే పట్టుదల, పగ, ప్రతీకారంతో ఉండే ఆలోచనలు వద్దు. ప్రస్తుతం మిమ్మల్ని శత్రువులెవరూ ఎదుర్కొనే పరిస్థితీ ఆలోచనల్లో లేరు. కుటుంబంలోకి విలాస వినోద వస్తు గృహోపకరణాలు కొనే అవకాశముంది. రెండు మూడు కుటుంబాలు కలిసి వినోద విహారయాత్రలకో తీర్థయాత్రలకో లేదా రెండూ కలిసిన యాత్రలకో వెళ్లే ఆలోచన ఉంది. తప్పక అలా యాత్ర చేస్తే నూతనోత్సాహం వస్తుంది.

లౌకిక పరిహారం: మీ అభివృద్ధికి ఈర్ష్యపడేవారుంటారు కాబట్టి ఎవరితోనూ శత్రుబుద్ధితో ఉండకండి.
అలౌకిక పరిహారం: అమ్మవారికి పంచపల్లవజలంతో అభిషేకించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top