రీసైక్లింగ్‌ షిప్స్‌ బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు

YSRCP supports to recycling ships bill - Sakshi

ఎంపీ తలారి రంగయ్య

సాక్షి, న్యూఢిల్లీ: రీసైక్లింగ్‌ షిప్స్‌ బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ ఎంపీ తలారి రంగయ్య పేర్కొన్నారు. మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడారు. ‘రీసైక్లింగ్‌ పరిశ్రమలో మన దేశం అగ్రశ్రేణిలో ఉంది. దాదాపు 30 శాతం మార్కెట్‌ ఇండియాదే. అందువల్ల అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పరిశ్రమను నిర్వహించుకోవడం మంచిది. భద్రత, ఆరోగ్యం, పర్యావరణ ప్రమాణాలు తదితర అంశాలతో కూడిన షిప్‌ బ్రేకింగ్‌ కోడ్‌ 2013 ఇప్పుడు ఉనికిలో ఉంది. అయితే ఈ కోడ్‌ను ఉల్లంఘించేవారికి జరిమానా విధించే అవకాశం గానీ, నౌకల్లో ప్రమాదకర వస్తువుల వినియోగం వంటి వాటి విషయంలో నియంత్రణ నిబంధనలు గానీ లేవు. అందువల్ల షిప్‌ బ్రేకింగ్‌ పరిశ్రమ వల్ల మానవాళికి, పర్యావరణానికి ఇబ్బందులు ఉండరాదు. ముఖ్యంగా తీరప్రాంతం మత్స్యకారులకు జీవనోపాధి ఇస్తుంది. అందువల్ల అంతర్జాతీయ ప్రమాణాలతో తాజా బిల్లు రావడం స్వాగతించదగిన అంశం..’ అని పేర్కొన్నారు.

విశాఖలో సూపర్‌ స్పెషాలిటీ క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్మించాలి
దేశంలో క్యాన్సర్ల బారిన పడ్డ వారి సంఖ్య పెరిగిపోతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్‌ భీశెట్టి వెంకట సత్యవతి ఆందోళన వ్యక్తం చేశారు. జీరో అవర్‌లో ఆమె మాట్లాడారు. ‘20 లక్షల మంది దేశంలో క్యాన్సర్లతో సతమతమవుతున్నారు. ఏటా 10 లక్షల కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విశాఖలో అధునాతన సూపర్‌ స్పెషాలిటీ క్యాన్సర్‌ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి..’ అని కోరారు.

మదాసి కురువ, మదారి కురువలను ఎస్సీ జాబితాలో చేర్చాలి
మదాసి కురువ, మదారి కురువలను ఎస్సీ జాబితాలో చేర్చాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ కేంద్రాన్ని కోరారు. మంగళవారం ఆయన జీరోఅవర్‌లో మాట్లాడారు. ‘బోయ కులస్తులకు ఎస్టీ రిజర్వేషన్‌ ఇవ్వాలని గత సెషన్‌లో నివేదించాను. మదాసి కురువ, మదారి కురువ కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నా. ఎస్సీ, ఎస్టీ జాబితాలో ఉన్న కులాలపై ప్రభావం చూపకుండా జాగ్రత్త తీసుకోవాలి. కురువలను మదాసి కురువ, మదారి కురువలుగా గుర్తించి వారికి సర్టిఫికెట్లు జారీ చేయాలి.’ అని పేర్కొన్నారు.

పదవీ విరమణకు ముందు ఆప్షన్లను మన్నించాలి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణకు ముందు వారు ఇచ్చే ఆప్షన్లకు అనుగుణంగా వారిని బదిలీ చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ చింతా అనురాధ పేర్కొన్నారు. ఆమె జీరో అవర్‌లో మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు ముందు మూడు నాలుగేళ్లు వారు కోరిన చోట ప్రశాంతంగా పని చేసేలా అవకాశం కల్పిస్తూ కేంద్రం తగిన ఆదేశాలు ఇవ్వాలి. వారి ఆరోగ్యం, సేవలు దృష్టిలో పెట్టుకోవాలి..’ అని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top