ఏపీలో మిన్నంటిన నిరసనలు..

YSRCP Protest Against Chandrababu - Sakshi

విశాఖ జిల్లా: మూడు రాజధానులపై టీడీపీ వైఖరికి నిరసనగా ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో చింతపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామాల నుంచి భారీ సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, గిరిజనులు దహనం చేశారు.  పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని..ఎన్ని అవరోధాలు సృష్టించినా  విశాఖ,కర్నూలు, అమరావతి కేంద్రాలుగా పాలన తథ్యమన్నారు.

విశాఖ నగరంలో: వికేంద్రీకరణపై చంద్రబాబు తీరుకు నిరసనగా విశాఖ నగరంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించాయి. మద్దిలపాలెం వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమయింది. ఈ నిరసన ర్యాలీలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్‌, తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ  శ్రీనివాస్‌, కన్వీనర్లు మళ్ల విజయప్రసాద్‌, అక్కరమాని విజయనిర్మల పాల్గొన్నారు.

గుంటూరు: వికేంద్రీకరణపై చంద్రబాబు తీరు పట్ల వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు మండిపడ్డారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మతో విద్యార్థులు శవయాత్ర చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

అనంతపురం: వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం భారీ ర్యాలీ నిర్వహించింది. తాడిపత్రి యల్లనూరు కూడలిలో చంద్రబాబు దిష్టిబొమ్మను విద్యార్థి విభాగం నేతలు దహనం చేశారు. చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.

పశ్చిమగోదావరి: తన స్వార్థ ప్రయోజనాలు కోసం రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం డిఎన్‌ఆర్‌ కళాశాల గ్రౌండ్‌లో మూడు రాజధానులు కావాలంటూ విద్యార్థులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌, గోకరాజు నరసింహరాజు, రామరాజు పాల్గొన్నారు.

నల్లజర్లలో: మూడు రాజధానులపై చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ నల్లజర్లలో రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన యువజన విభాగంనేతలు..ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే తలారి వెంకట్రావు రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్, వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.

తణుకులో: చంద్రబాబు వైఖరికి నిరసనగా తణుకు నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో దళిత సంఘాలు, ప్రజలు భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సుమారు 45 అంబేద్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. నిడదవోలులో మహిళా కళాశాల విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నచంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన విద్యార్థులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

చిత్తూరు: వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంటున్న చంద్రబాబుపై కుప్పం ద్రవిడ యూనివర్శిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఖరికి నిరసనగా ఆయన దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top