‘భూమా ఆకస్మిక మరణం నన్నెంతో బాధించింది'

‘భూమా ఆకస్మిక మరణం నన్నెంతో బాధించింది' - Sakshi


ఒంగోలు : నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం తనను ఎంతో బాధించిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన మృతితో తమ కుటుంబసభ్యులను కోల్పోయినంతగా కలత చెందానని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. నాగిరెడ్డి పిల్లలకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కాగా గుండెపోటుతో భూమా నాగిరెడ్డి నిన్న మరణించిన విషయం తెలిసిందే.



ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. 2018కల్లా వలిగొండ పూర్తి చేస్తామన్న చంద్రబాబు మాటలను రైతులు నమ్మడం లేదన్నారు. ఇప్పటికైనా ఈ బడ్జెట్‌లో వలిగొండ ప్రాజెక్ట్‌ కు రూ.1000 కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసి 2018 డిసెంబర్‌కల్లా తాగు,సాగునీటిని అందించాలన్నారు. లేకుంటే రైతాంగాన్ని కూడగట్టి వైఎస్‌ఆర్‌ సీపీ ఆందోళనకు సిద్ధమవుతుందని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.


మూడేళ్లపాటు వరుస కరువుతో ప్రకాశం జిల్లా రైతాంగం కకావికలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కంది, మిర్చి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలేక పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారన్నారు. ప్రభుత్వం మిర్చికి కనీసం రూ.10వేలు, కందికి రూ.6వేలు ధర ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పొగాకు రైతుల ఆత్మహత్యలు నిరోధించాలంటే తక్షణమే కిలోకు సగటు ధర రూ.160 తగ్గకుండా కోనుగోలు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రైతులకు నిబంధనలు విధించడం మాని దళారులను, బయ్యర్లను ప్రభుత్వం అదుపులో పెట్టాలని ఆయన సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top