సీఎస్‌కు విజయసాయి రెడ్డి లేఖ

YSRCP MP Vijaysai Reddy writes letter to AP CS  - Sakshi

ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై వైఎస్సార్ సీపీ అభ్యంతరం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై వైఎస్సార్ కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకు లేఖ రాశారు. లేఖలో సారాంశం... ‘విజయవాడకు చెందిన హోటల్ యజమాని ఐలాపురం రాజాను ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమించటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలియజేస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ప్రైవేటు సెక్రటరీగా ఉన్న ఇ.శ్రీరాంమూర్తి, ఐలాపురం రాజాలు టీడీపీ పార్టీ యాక్టివిస్టులు. ఇలాంటి వారిని ఆర్టీఐ కమిషనర్లుగా ఎలా నియమిస్తారు. ఆర్టీఐ యాక్ట్ 2005, సెక్షన్ 15 ప్రకారం నియామకాలు చేపట్టాలి. ఆర్టీఐ యాక్ట్ 2005 సబ్ సెక్షన్ 5 ప్రకారం స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టేవారికి తగిన అర్హతలు ఉండాలని తెలియజేస్తోంది. 

ఆర్టీఐ యాక్ట్ ప్రకారం చూస్తే..లా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్, మేనేజ్‌మెంట్, జర్నలిజం, మాస్ మీడియాలో అనుభవం ఉన్న వ్యక్తులనే ఆ పదవులకు ఎంపిక చేయాలి. దానికి భిన్నంగా టీడీపీ యాక్టివిస్టులను ఆర్టీఐ కమిషనర్లుగా నియమించారు. అంతేకాకుండా ఈ పదవులకు ఎంపిక అయ్యే వ్యక్తులు ఎంపీలు కానీ, రాష్ట్ర శాసనసభల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో, ఆదాయం వచ్చే పదవుల్లో, వ్యాపారాల్లోనూ ఉండకూడదు. ఎలాంటి పార్టీలతోనూ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండకూడదని ఆర్టీఐ యాక్ట్ తెలియజేస్తోంది.

అయితే, ఓ హోటల్ యజమాని, మంత్రికి ప్రైవేటు సెక్రటరీగా ఉన్న వ్యక్తులను ఎలా ఎంపిక చేశారు. ఏ ప్రాతిపధికన సీఎం, సీనియర్ కేబినెట్ మినిస్టర్ వీళ్ల పేర్లు సిఫార్సు చేయటం జరిగింది?. వీరిలో ఐలాపురం రాజా పేరును గవర్నర్ ఆమోదించారు. శ్రీరాంమూర్తి పేరును గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీరాంమూర్తికి సామాజిక సేవతో సంబంధాలు ఉన్నాయా?. ఎన్నికల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బిజీగా ఉన్న సమయంలో కమిటీని ఏర్పాటు చేసి సిఫార్సు చేశారు.

ఈ ఆర్టీఐ కమిషనర్ నియామకాలు అన్నీ రాజకీయ దురుద్దేశంతో కూడినవి. 4 ఏళ్ల పాటు సాగదీసి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ నియామకాలు చేయటంలో ఆంతర్యం ఏమిటి?.  2017లో ఆరుగురును ఆర్టీఐ కమిషనర్లుగా నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండటంతో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికైనా ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో పారదర్శకత పాటించాలి’ అని విజయసాయి రెడ్డి కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top