
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత బలిరెడ్డి సత్యారావు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: విశాఖపట్నం బీచ్‌రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత బలిరెడ్డి సత్యారావు (83) మృతి చెందారు. సాయంత్రం వాకింగ్ చేసేందుకు వెళుతుండగా వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ సత్యారావును స్థానికులు మహారాణిపేటలోని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. సత్యారావుకు భార్య, నలుగురు కుమార్తెలున్నారు. ఆయన మృతితో విశాఖ జిల్లా చోడవరం మండలం పీఎస్‌పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
1962లో పంచాయతీ వార్డుమెంబర్‌గా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1981–86 వరకు రావికమతం సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో మొదటిసారి చోడవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున శాసనసభకు ఎన్నికై.. రాష్ట్ర మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో రెండోసారి శాసన సభకు, 2005లో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2012లో వైఎస్సార్‌సీపీలో చేరి పార్టీకి ఎనలేని సేవలందించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మృతి పట్ల సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజలకు సత్యారావు ఎనలేని సేవలందించారని కొనియాడారు. విశాఖ జిల్లాకు.. ముఖ్యంగా చోడవరం నియోజకవర్గానికి ఆయన మృతి తీరని లోటన్నారు. కాగా, సీఎం శనివారం విశాఖలో సత్యారావు భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు.