
గన్నవరం: డెల్టా ప్రాంత రైతులకు ఏలూరు కాలువ ద్వారా సాగునీరు ఇవ్వాలని కోరుతూ ధర్నా చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పార్టీ నాయకులు, రైతులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. మండలంలోని పెరికీడు గ్రామంలో ఏలూరు కాలువ వంతెన వద్ద రోడ్డుపై శుక్రవారం శాంతియుతంగా దుట్టా రామచంద్రరావు చేస్తున్న ఆందోళనను భగ్నం చేసేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతుల పక్షాన పోరాడుతున్న దుట్టాతో పాటు పలువురు నాయకులను పోలీసులు రోడ్డుపై ఈడ్చుకెళ్లి జీపులోకి తోశారు. నియోజకవర్గంలోని డెల్టా ప్రాంత రైతులకు ప్రధాన సాగునీటి వనరైన ఏలూరు కాలువకు కృష్ణానది నుంచి 13 రోజుల క్రితం నీటి విడుదల నిలిపివేశారు. వరిపైరు పొట్టదశలో ఉండగా సాగునీటి విడుదల నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ శ్రేణులు రోడ్డు ఎక్కాయి. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు నేతృత్వంలో భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, మండల రైతులు రోడ్డుపై బైఠాయించి సాగునీరు విడుదల చేయాలని నినా దాలు చేశారు. ఆందోళన ప్రారంభమైన పది నిమిషాలకే తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్న హనుమాన్‌జంక్షన్ సీఐ జయకుమార్ ఆందోళన విరమించాల్సిందిగా కోరారు. రైతుల సమస్యపై ప్రభుత్వంలో కదలిక తెచ్చేందుకు చేపట్టిన నిరసనకు సహకరించాలని దుట్టా కోరారు. అయితే సీఐ విజయ్‌కుమార్, ఎస్‌ఐ విజయకుమార్ దురుసుగా ప్రవర్తించారు. ఒకదశలో దుట్టాను సీఐ, ఎస్‌ఐ బలవంతంగా ఈడ్చుకెళ్లడంతో పార్టీ నాయకులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి, సీఎం డౌన్...డౌన్, జలవనరుల మంత్రి వెంటనే నీటిని విడుదల చేయాలి అంటూ నినాదాలుచేశారు.
పోలీసులు పట్టించుకోకుండా దుట్టాతో పాటు పలువురు నాయకులను బలవంతంగా జీపులోకి ఎక్కించారు. పార్టీ జిల్లా నాయకుడు నక్కా గాంధీ, కార్యకర్తలు జీపును ముందుకు కదలనీయకుండా రోడ్డుపై అడ్డుగా పడుకున్నారు. పోలీసులు వారిని పక్కకు లాగేసి దుట్టాను, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెలగపల్లి ప్రదీప్, జిల్లా కార్యదర్శి కోడేబోయిన బాబీని హనుమాన్‌జంక్షన్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తీరుపై దుట్టా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి తర్వాత వారిని పోలీసులు విడుదల చేశారు. ఆందోళనలతో పార్టీ నాయకులు యనమదల సాంబశివరావు, పడకల కోటేశ్వరరావు, చిన్నాల లక్ష్మీనారాయణ, నత్తా సురేష్, కర్రా విజయపాల్, జోజి, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.