జలయజ్ఞ ప్రదాత రాజన్న  

YS Rajasekhara Reddy 71th Birth Anniversary Irrigation Special Story - Sakshi

సాక్షి, విజయనగరం: భూమి ఉన్నా నీరు లేక... అదను దాటిపోతున్నా దున్నుకోలేక.. సొంత పొలమున్నా సాగులేక... బతుకు తెరువు కోసం పరాయి పంచన కూలీలై కష్టాలు పడుతున్న  జిల్లా రైతుల పాలిట రాజశేఖరరెడ్డి అపర భగీరథుడయ్యారు. ఆసియాలోనే తొలి రబ్బరు డ్యామ్‌ను జంఝావతి నదిపై నిర్మించారు. పెద్దగెడ్డ నుంచి పంట చేలకు సాగునీరందేలా రిజర్వాయర్‌ కట్టించారు. తోటపల్లి ప్రాజెక్టును తొంభైశాతం పూర్తి చేశారు. సాగు, తాగునీరు ఇబ్బందుల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు పూర్తిస్థాయిలో చేయూతనందించి ఇక్కడి అన్నదాతలకు దేవుడయ్యారు. ఆ మహనీయుని 71వ జయంతి నేడు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాలను కలుపుతూ తోటపల్లి సాగునీటి కాలువ ఏర్పడింది. రూ. 84 కోట్లతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ, సుజలధార తాగునీటి పథకాన్ని చీపురుపల్లి నియోజకవర్గానికి మంజూరు చేశారు. వేపాడ మండలంలో విజయరామసాగర్‌ను మినీరిజర్వాయర్‌గా తీర్చిదిద్దాలని నిధులు మంజూరు చేశారు. మక్కువ మండలంలో సురాపాడు ప్రాజెక్టు నిర్మించారు. వెంగళరాయ సాగర్‌ రిజర్వాయర్‌కు సంబంధించిన కాలువలు అభివృద్ధి పనులు చేశారు.  

అరుదైన రబ్బర్‌ డ్యామ్‌ 
కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద 1976లో జంఝావతి డ్యామ్‌నకు శ్రీకారం చుట్టారు. కానీ పూర్తిస్థాయిలో భూ సమీకరణ చేపట్టకపోవడంతో ఒడిశాతో వివాదం ఏర్పడింది. ఈ వివాదాన్ని తొలగించేందుకు అటు ఒడిశా, ఇటు ఏపీ ప్రభుత్వాలు పలు మార్లు చర్చలు జరిపినప్పటికీ ఒడిశా ప్రభుత్వం ముంపు గ్రామాలను వదులు కోవడానికి ససేమిరా అనడంతో అక్కడ డ్యామ్‌ రివర్‌ గ్యాప్‌ మూసివేయకుండా వదిలేశారు. దీనివల్ల నదిగుండా ప్రవహించే నీరు వృథాగా పోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆవేదన గమనించిన మహానేత 2006లో ఆ్రస్టియా టెక్నాలజీతో రూ.5 కోట్లతో ఆసియాలోనే మొట్టమొదటి సారిగా రబ్బరు డ్యామ్‌ను నిర్మించారు. రబ్బరు డ్యామ్‌ ద్వారా నీటిని నిల్వచేసి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా పొలాలకు సాగునీటిని అందించే అవకాశం కలిగింది. డ్యామ్‌ లోపలి భాగంలో 0.03 టీఎంసీల నీరు నిల్వ ఉండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు అనుకూలమైంది. దీని ద్వారా 12వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. 

తోటపల్లితో మారిన దశ 
గరుగుబిల్లి మండలంలో తోటపల్లి ప్రాజెక్టుకు రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. సింహభాగం పనులు టీడీపీ అధికారం చేపట్టకముందే జరిగాయి. తోటపల్లి చానల్‌ ద్వారా సుమా రు 3వేల ఎకరాలకు నీరందించేందుకు పైలాన్‌ ప్రారంభోత్సవాన్ని వైఎస్‌ అప్పట్లో చేశారు. పార్వతీపురం మండలం అడారుగెడ్డ నిర్మాణానికి కూడా రాజశేఖరరెడ్డి హయాంలోనే నిధులు కేటాయించారు. విజయనగరం పట్టణానికి తాగునీటి కోసం నిర్మించతలపెట్టిన తారకరామతీర్థసాగర్‌కు 2007లో సుమారు రూ.187 కోట్లను విడుదల చేశారు. నెల్లిమర్ల పట్టణంతో పాటు గుర్ల, గరివిడి మండలాలకు తాగునీటిని అందించేందుకు రామతీర్థం మంచినీటి పధకాన్ని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. 

తొలి జలయజ్ఞ ఫలం పెద్దగెడ్డ 
పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ రిజర్వాయర్‌ పేరు చెప్పగానే అక్కడి ప్రజలకు గుర్తుకొచ్చేది వైఎస్సార్‌. జలయజ్ఞంలో భాగంగా సుమారు రూ.100 కోట్లతో పెద్దగెడ్డ రిజ ర్వాయర్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్‌ను  2006లో ఆయనే ప్రారంభించారు. ఈ సమయంలోనే సమీపంలోని అరుకు–పాచిపెంట ప్రాంతాల్లో హెలికాఫ్టర్‌ ద్వారా ఏరి యల్‌ సర్వే నిర్వహించారు. ఇక్కడ అందాలను చూసి అబ్బురపడ్డారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమాలోచనలు చేశారు. అప్పుడే సుమారు 2 ఎకరాల పా ర్క్‌ ఏర్పాటయ్యింది. రిజర్వాయర్‌లో ఉండే నాటు పడవల స్థానంలో విశాఖపట్నం నుంచి మిషన్‌బోట్లు తీసుకువచ్చా రు. ఇవే గాకుండా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయనే రూపకల్పన చేసి వాటి ఫలాలను జిల్లాకు అందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top