సంక్షేమ సంతకం.. చెరగని జ్ఞాపకం..

YS Rajasekhar Reddy Developments In Prakasam - Sakshi

చరిత్ర సృష్టించే వాడు ఎప్పుడూ మాటలు చెప్పడు. చేతల్లో చేసి చూపుతాడు. ప్రజల గుండెల్లో నిలుస్తాడు. జనం మెచ్చే నాయకుడవుతాడు. వైఎస్‌ రాజశేఖరరెడ్డిలా.. అభివృద్ధి పరుగులిడిన ఆ రోజులను ప్రజలింకా మరువలేదు. మరువబోరు కూడా!! సంక్షేమానికి గీటురాయిగా నిలిచిన వైఎస్సార్‌ ఐదేళ్ల మూడు నెలల పరిపాలన ప్రకాశం జిల్లానూ ప్రగతి పథంలో నడిపింది. వైఎస్సార్‌ దూరదృష్టి వెలిగొండకు పునాదిరాళ్లు వేసింది. అన్నదాతలపై ఆయనకున్న ప్రేమ గుండ్లకమ్మై సాగునీరందించింది. ప్ర‘జల’ సమస్యపై చలించినహృదయం రామతీర్థమై గొంతు తడిపింది. ఠంఛనుగా పింఛను అందుకున్న అవ్వాతాతలకు వైఎస్సార్‌ పెద్దకొడుకయ్యారు. తెలుగింటి ఆడపడుచులకు అన్నై అండగా నిలిచారు. నిరుపేదల గుండెల్లో ‘గూడు’ కట్టుకున్నారు. నిన్న వైఎస్సార్‌ పదో వర్ధంతి.. ఈ సందర్భంగా జిల్లాకు వైఎస్సార్‌ అందించిన అభివృద్ధి ఫలాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

రూ.480 కోట్ల రుణమాఫీ
వ్యవసాయంలో నష్టాలు వచ్చి, ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించని కారణంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులను వైఎస్సార్‌ ఆదుకున్నారు. ఆయన సీఎంగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత జిల్లాలో 2.6 లక్షల మంది రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.480 కోట్లు రద్దు చేశారు. ఇందులో 2.17 లక్షల మంది చిన్న సన్నకారు రైతులు లాభపడ్డారు. ఇవి కాకుండా వ్యవసాయంలో నష్టపోయి బ్యాంకర్ల నుంచి అప్పు కట్టమని ఒత్తిడి గురవుతున్న 43,572 మంది రైతులకు వారు తీసుకున్న రుణాలను ఒకే మొత్తంలో పరిష్కరించుకునే(ఒన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌) విధానాన్ని అమలు చేశారు. రైతులు రూ.97 కోట్ల మేరకు లబ్ధి పొందారు. తీవ్ర కరువుతో అల్లాడిన రైతులు 1,23,147 మందికి ఒక్కొక్కరికి రూ.5 వేల లెక్కన రూ.62 కోట్లు డెట్‌ రిలీఫ్‌ స్కీమ్‌ కింద లబ్ధి కలిగేలా చర్యలు తీసుకున్నారు.

అపర భగీరథుడు రాజన్న
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే అభివృద్ధి సాధ్యమని వైఎస్‌ రాజశేఖర రెడ్డి బావించారు. వెలిగొండ ప్రాజెక్టు కలను సాకారం చేసే దిశగా అడుగులు వేశారు. 3.36 లక్షల ఎకరాలకు సాగునీరు, 16 లక్షల మందికి తాగునీరు అందించేందుకు రూ.4,500 కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించారు. రూ.46 కోట్లతో పునరావాస కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వెలిగొండ సొరంగం పనులు వైఎస్సార్‌ పాలనలో చకచకా సాగాయి. అనంతర కాలంలో పనులు నెమ్మదించాయి. వైఎస్సార్‌ తనయుడు, ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏడాదిలోగా మొదటి సొరంగం నుంచి సాగు నీరు ఇవ్వడానికి కార్యాచరణ రూపొందించారు.

రామతీర్ధం జాతికి అంకితం
తాగునీరు, సాగుకు నీరు అందించే రామతీర్ధం ప్రాజెక్టు నిర్మించి జాతికి అంకితం చేశారు. 72,874 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, ఒంగోలు నగర పాలక సంస్ధ, కందుకూరు మున్సిపాలిటీల్లో తాగునీటి కొరతను ఈ ప్రాజెక్టు తీరుస్తోంది. మొత్తం 56 తాగునీటి వనరులకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతోంది.

గూడు లేని వారికి పక్కాఇళ్లు
జిల్లాలో ఐదేళ్లల్లో 3,22,630 ఇళ్లు కట్టించారు. నివేశన స్థలాలకు రూ.7 కోట్లు ఖర్చు చేశారు. 19,904 మందికి 31,734 ఎకరాల భూమిని ఏడు విడతల్లో పంపిణీ చేశారు. 

లేని వారందరికీ పింఛన్లు
జిల్లాలో 2004 వరకు 2,86,189 పింఛన్లు ఉన్నాయి. ఇందిరమ్మ మూడు దశల కార్యక్రమాల కింద 1,78,659 మందికి నూతన పింఛన్లు మంజూరు చేశారు. ఏటా అదనంగా రూ.69 కోట్లను పింఛన్ల రూపంలో చెల్లించారు. పావలా వడ్డీ కింద రూ.20 కోట్ల వరకు పొదుపు గ్రూపులకు రీయింబర్సుమెంట్‌ ఇప్పించారు. బ్యాంకు లింకేజి రుణాలు ఐదేళ్లల్లో రూ.853 కోట్లు మంజూరు చేశారు.

వైద్యో నారాయణో ‘వైఎస్సార్‌’
జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008 ఏప్రిల్‌లో ప్రారంభించారు. 7.19 లక్షల మందికి హెల్త్‌కార్డులు అందించారు. 10,366 మందికి గుండె ఆపరేషన్లు చేయించారు. ఆరోగ్యశ్రీ ప్రారంభం సందర్భంగా జిల్లాలో మెగా మెడికల్‌ క్యాంపు నిర్వహించి 70 వేల మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు. వీరిలో శస్త్రచికిత్సలు అవసరమైన వారికి రిఫరల్‌ ఆసుపత్రుల్లో వైద్యం అందించారు. వెనుకబడిన జిల్లా అభివృద్ధిలో భాగంగా ఒంగోలుకు రిమ్స్‌ మెడికల్‌ కళాశాల మంజూరు చేశారు. ఇందుకు రూ.125 కోట్లు నిధులు ఇచ్చారు. 37.46 ఎకరాల్లో ఈ వైద్య కళాశాల నిర్మాణం జరిగింది. 1358 మంది కార్మికులకు ఉచిత బీమా కింద రూ.68 కోట్ల క్లెయిమ్‌లు పరిష్కరించారు.

జిల్లాలో 26 పర్యాయాలు వైఎస్సార్‌ పర్యటన
జిల్లా ప్రజలతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఎంతగానో అనుబంధం ఉంది. ఆయన 26 పర్యాయాలు జిల్లాలో పర్యటించడమే అందుకు నిదర్శనం. వరదలు, రైతు సదస్సులు ఇతర కార్యక్రమాలతో పాటు వివిధ సందర్భాల్లో ఆయన జిల్లా పర్యటనకు వచ్చారు. జిల్లాకు ఆయన వచ్చారంటే పండగే. ఒక పర్యాయం ఒక పనిపై వచ్చిన వారు తిరిగి అదే పనిపై కలిస్తే నేరుగా సంబంధిత అధికారితో మాట్లాడి ఎందుకు పని కాలేదో అడిగే వారు. ఈ క్రమంలోనే వివిధ రంగాల వారితో వైఎస్సార్‌కు అనుబంధం పెరిగింది.

విద్యార్థులకు వరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌
జిల్లాలో 63,346 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులకు రూ.30 కోట్ల ఫీజు రీయింబర్సుమెంట్‌ ఇచ్చారు. రూ.75 కోట్లు పోస్టు మెట్రిక్‌ ఉపకార వేతనాలు అందించారు. కార్పొరేట్‌ విద్యా పథకంలో భాగంగా 300 మంది విద్యార్థులకు కార్పొరేట్‌ తరహా విద్య అందించడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువకులు 8,410 మందిని గుర్తించారు. వీరికి రూ.5.5 కోట్లతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకున్నారు. 

ఐదేళ్లల్లో ప్రాజెక్టులకు భారీగా నిధులు
వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఐదేళ్లల్లో ప్రాజెక్టులకు నిధులు భారీగా విడుదల చేశారు. జిల్లాలో 24.37 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారు. గ్యాప్‌ ఆయకట్టుగా ఉన్న 11.11 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా చర్యలు తీసుకున్నారు. ఐదేళ్లల్లో అన్ని ప్రాజెక్టులకు కలిపి రూ.6,280.11 కోట్లు ఖర్చు చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు ఇంత మొత్తంలో కేటాయించిన సీఎంలు వైఎస్సార్‌కు సాటిరారు.

ఉచిత విద్యుత్తుతో వెలుగు
వైఎస్సార్‌ అధికారం చేపట్టగానే రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చారు. 2004 మే నెలకు ముందు జిల్లాలో 63,559 మంది రైతుల కరెంటు బకాయిలు 59.5 కోట్లు రద్దు చేశారు. అప్పటికే ఉన్న 71,321 మంది రైతులకు ఉచిత విద్యుత్‌ అందజేశారు. ఐదేళ్లల్లో మొత్తం 86,207 మంది రైతులు ఉచిత విద్యుత్‌ పొందారు. ఇందుకోసం రూ.65 కోట్ల వరకు ఖర్చు చేశారు. 25 మండలాల్లో భూగర్భ జలాలపైనే ఆధారపడి జీవించే రైతులకు ఉచిత విద్యుత్తు వెలుగు నింపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top