
గుంటూరు: తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన మహా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డి అంటే సంక్షేమం.. సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి అని కొనియాడాడు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 2వ తేదీ) గుంటూరు లోని వైఎస్సారసీపీ జిల్లా కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి అంబటి రాంబాబు నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, వైఎస్సార్‌సీపీ సిటీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా పాల్గొన్నారు. దీనిలో భాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన మహా నాయకుడు వైఎస్సార్. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప వ్యక్తి వైఎస్సార్. ఆయన అమలు చేసిన పథకాలను దేశంలో ఎన్నో రాష్ట్రాలు అమలు చేశాయి. పోలవరాన్ని ప్రారంభించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి
రాజశేఖర్ రెడ్డి భౌతికంగా ప్రజలకు దూరమైనా ప్రజల గుండెల్లో ఆయన కొలువై ఉన్నారు. కుప్పంకి నీళ్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది’ అని అంబటి తెలిపారు.
నూరి ఫాతిమా మాట్లాడుతూ.. ‘ పేదల కోసం ఆరోగ్యశ్రీ ,ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి వైఎస్సార్. సంక్షేమానికి సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన ప్రజలకు దూరమై 16 సంవత్సరాలు గడిచినా ప్రజల గుండెల్లో మాత్రం ఆయన కొలువై ఉన్నారు’ అని కొనియాడారు.
చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ.. ‘దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల పాలిట దేవుడు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి జల యజ్ఞాన్ని ప్రారంభించారు. ఉచిత విద్యుత్ సృష్టికర్త వైఎస్సార్’ అని అన్నారు.