
సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై శాసన సభలో ప్రభుత్వాన్ని నిలదీసి, ప్రజలకు మేలు చేయూలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ శాసన సభాపక్షం నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రజలకు మేలు చేద్దాం : వైఎస్సార్‌సీఎల్పీ సమావేశంలో వైఎస్ జగన్
అసెంబ్లీలో ప్రతిపక్షం ‘షాడో కేబినెట్’లా వ్యవహరించాలి
వ్యవసాయ రుణాలు మాఫీ చేయూలని గట్టిగా పట్టుబట్టాలి
విద్యార్థి, యువజనుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడాలి
చంద్రబాబు హామీలపై ప్రభుత్వానిది కప్పదాటు వైఖరి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై శాసన సభలో ప్రభుత్వాన్ని నిలదీసి, ప్రజలకు మేలు చేయూలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ శాసన సభాపక్షం నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నుంచి శాసన సభ తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పార్టీ శాసన సభాపక్షం (వైఎస్సార్‌సీఎల్పీ) సమావేశానికి జగన్ అధ్యక్షత వహించారు. వ్యవసాయ, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ, రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులు, రాజధాని ఎంపిక, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు పలు ప్రజా సమస్యలపై రెండు గంటలకు పైగా చర్చించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వివిధ ప్రభుత్వ శాఖల కార్యకలాపాలను శాసన సభ్యులు పూర్తిగా అవగాహన చేసుకోవాలని, వాటిపై అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించాలని కోరారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ‘షాడో కేబినెట్’లా వ్యవహరించాలన్నారు. వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, కరువు బారిన పడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సభలో గట్టిగా డిమాండ్ చేయూలని చెప్పారు. విద్యార్థి, యువజనుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడాలన్నారు. ప్రజలు మెచ్చే విధంగా పార్టీ ఎమ్మెల్యేలందరూ ఆయా శాఖలపై జరిగే చర్చల్లో పాల్గొనాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో సమయపాలన పాటించాలని, క్రమం తప్పకుండా అందరూ హాజరై పూర్తి సమయం సభలో ఉండాలని చెప్పారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలపై ఆయన ప్రభుత్వం వ్యవహరిస్తున్న కప్పదాటు విధానాల వల్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు వివిధ శాఖలపై చంద్రబాబునాయుడు విడుదల చేసిన శ్వేతపత్రాల్లో వారికి అనుకూలంగా ఉన్న అంశాలనే నిజాలుగా పేర్కొన్నారని, మరో కోణాన్ని ఆవిష్కరించలేదని సమావేశంలో ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.
హత్యా రాజకీయాలపై నిలదీస్తాం : గడికోట
రుణాల మాఫీతో పాటు చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఈ మూడు నెలల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలు, శాంతి భద్రతలు, ఎర్ర చందనం తదితర అనేక ఇతర సమస్యలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైఎస్సార్‌సీఎల్పీ కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.
రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి
హైదరాబాద్: వ్యవసాయ, డ్వాక్రా మహిళలు, చేనేత రుణాల మాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ శాసనసభాపక్షం ఉప నేతలు జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పనతో కలసి ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పారని, ఇప్పుడు కేవలం పంట రుణాలే మాఫీ చేస్తామంటున్నారని, దానికి కూడా లక్షన్నర రూపాయల పరిమితి విధించారని విమర్శించారు. వ్యవసాయ, డ్వాక్రా, చేనేత, పవర్‌లూమ్స్ రుణాలన్నీ మాఫీ చేస్తానని టీడీపీ నేతలు తొలుత ఏవిధంగా చెప్పింది.. ఆ తరువాత పరస్పర విభిన్న ప్రకటనలు ఏవిధంగా చేసిందీ ఉమ్మారెడ్డి సవివరంగా వివరించారు. రుణమాఫీ ఎపుడు చేస్తారో స్పష్టంగా రైతులకు తెలిసేం దుకే శ్వేతపత్రం చాలా అవసరమని అన్నారు.
ప్రజలు దగాపడ్డారు: కోటంరెడ్డి
టీడీపీ ప్రభుత్వం చేతిలో రాష్ట్ర ప్రజలు దగా పడ్డారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రుణాలు రద్దవుతాయనే ఆశతో ఓట్లేసిన ప్రజలకు చంద్రబాబు నిజస్వరూపం ఏమిటో తెలిసిందన్నారు. నయవంచనకు గురయ్యామనే ఆవేదనతో ఉన్న ప్రజల గుండె చప్పుడును తాము అసెంబ్లీలో ప్రతిధ్వనిస్తామని చెప్పారు.
కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు గద్దెనెక్కి మూడు నెలలైనా ఆయన ప్రభుత్వ నిష్క్రియాపరత్వం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.