అసలైన నాయకుడు ఆయనే... | YS Jagan Request Give Way To Auto In Praja Sankalpa Yatra Public Meeting | Sakshi
Sakshi News home page

అసలైన నాయకుడు ఆయనే...

Oct 4 2018 7:54 AM | Updated on Oct 4 2018 7:54 AM

YS Jagan Request Give Way To Auto In Praja Sankalpa Yatra Public Meeting - Sakshi

ఆటోకు దారివ్వమని చెబుతున్న జగనన్న దారిచ్చి తప్పుకుంటున్న జనం

సాక్షి ప్రతినిధి, విజయనగరం:  నెల్లిమర్లలోని మొయిద జంక్షన్‌..  బుధవారం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభ జరుగుతోంది. కిక్కిరిసిన జనం.. అడుగేయడమే కష్టం.. మరో వైపు జననేత ఉద్విగ్నభరిత ప్రసంగం సాగుతోంది. అదే సమయంలో చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం ఆనందపురం గ్రామానికి చెందిన గర్భిణి యాల రాజేశ్వరి ఆటోలో ఆ దారిగుండా వెళ్ళాల్సి వచ్చింది. జనం మధ్యలోంచి ఆటో  వెళ్ళలేకపోవడాన్ని వేదిక నుంచే గమనించారు జగన్‌. వెంటనే ప్రసంగాన్ని ఆపేశారు. నిండుచూలాలి బాధ చూసి  చలించిపోయారు. వెంటనే ‘అన్నా.. ఆటోకు  దారివ్వండన్నా... ’ అంటూ పదేపదే మైక్‌లో చెప్పారు.  

జననేత అభ్యర్థనతో అప్పటి వరకూ ఆయన ప్రసంగం  వింటూ వేలాదిగా గుమిగూడిన అభిమానులు సైనికుల్లా  క్రమశిక్షణతో పక్కకు జరిగారు. కొందరు రక్షణ వలయంగా ఏర్పడి ఆటోను ముందుకు నడిపించారు. ఆ క్షణంలో  జగన్‌ మాట్లాడుతూ ‘108 రాక ఆ గర్భిణీ కనీసం ఆటోలో వెళ్తుంది. కొంచెం స్థలం ఇవ్వాలన్నా.. కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. మిమ్మల్నందరినీ కోరుతున్నా. ఇదే నెల్లిమర్లలో ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆటోలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుందంటే 108కి ఫోన్‌ కొడితే 20 నిముషాల్లో రావాల్సిన అంబులెన్స్‌  కుయ్‌.. కుయ్‌ అనే సౌండ్‌ వినపడటం లేదంటే.. ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటో వేరే చెప్పక్కర్లేదు’ అంటూ  ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జనాన్ని దాటుకుంటూ  వెళ్ళగలమా? సాయం చేసేదెవరని భయంతో ఉన్న గర్భిణి కుటుంబ సభ్యులు ఆ క్షణంలో ఆటోలోంచే జగన్‌కు అభివాదం చేశారు. ‘థ్యాంకూ.. అన్నా.. అంటూ కృతజ్ఞతలు చెప్పారు.

ఎప్పటికీ రుణపడి ఉంటాం.
నొప్పులు రావడంతో హడావుడిగా అప్పటికప్పుడు నా భర్త శివాజీ ఆటో తెప్పించారు. మా అమ్మ కృష్ణమ్మ నన్ను ఆటోలో ఆస్పత్రికి తీసుకువెళుతుంటే దారిలో జగన్‌ బహిరంగ సభ జరుగుతోంది. ఏం చేయాలో పాలుపోలేదు. ఎలా వెళ్లాలో తెలియలేదు. కానీ మా పరిస్థితి గమనించిన జగనన్న స్వయంగా కల్పించుకున్నారు. మా ఆటోకు దారివ్వాల్సిందిగా అక్కడున్నవారందరినీ కోరారు. మైకులో ఆయన చెబుతుంటే అంత భారీ సంఖ్యలో ఉన్న జనం ఒక్కసారిగా బాట ఏర్పరిచారు. పక్కకు జరిగి మా ఆటోకు దారిచ్చారు. వెంటనే ఆస్పత్రికి చేరుకున్నాం. జగనన్న చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అసలు సిసలైన నాయకుడు జగన్‌లా ఉంటారనిపించింది. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.– యాల రాజేశ్వరి, ఆనందపురం

ఆయన చెప్పబట్టే మేం ఆస్పత్రికి రాగలిగాం
సాయంత్రం నాలుగు గంటల సమయంలో మా అమ్మాయి రాజేశ్వరికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఆటోలో నెల్లిమర్ల పట్టణంలోని ఆస్పత్రికి హుటాహుటిన బయలుదేరాం. మొయిద జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి జగన్‌గారి బహిరంగ సభ జరుగుతోంది. ఆస్పత్రికి ఎలా చేర్చాలోనని చాలా భయమేసింది. ఇంతలో జగన్‌ మా ఆటోకు దారి ఇవ్వాలంటూ మైకులో పదే పదే చెప్పారు. అందుకే నా కూతుర్ని క్షేమంగా, సకాలంలో ఆస్పత్రిలో చేర్పించగలిగాం.’’– రాజేశ్వరి తల్లి కృష్ణమ్మ, ఆనందపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement