రైతుల ఆత్మహత్యాయత్నంపై చలించిన జగన్‌

YS Jagan Phone call to farmers  - Sakshi

రైతులతో ఫోనులో మాట్లాడిన వైఎస్‌ జగన్‌

రైతులెవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు..

సాక్షి, వెల్దుర్తి : కృష్ణాజిల్లా నున్న పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో రైతుల ఆత్మహత్యాయత్నం ఘటన అంశంపై ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చలించిపోయారు. ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన గురువారం ఫోన్‌లో పరామర్శించారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని రైతులకు ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు. వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం తరఫున రూ.2.30 కోట్లు చెల్లిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. ఆ చెల్లింపులన్నీ వెంటనే చేస్తాం అని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని తన మాటగా నష్టపోయిన రైతులకు చెప్పాలన్నారు. అఘాయిత్యాలకు పాల్పడి కుటుంబాల్లో కన్నీళ్లు నింపొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే...  రైతులను కాపాడాల్సిన ప్రభుత్వం వారిని వేధింపులకు గురిచేయడంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రైతుల తమ వేదనను రాజన్న తనయుడికి వెలిబుచ్చారు...దాదాపు ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నామని, నకిలీ నార కారణంగా పంట నష్టపోయామని అప్పట్లో ధర్నా చేశామని, నార నకిలీదని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారని అన్నారు. ఎకరాకు రూ.91వేలు చెల్లించేలా కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారని, కాని చెల్లింపులు జరగలేదన్నారు. కంపెనీల యజమానులు కోర్టుకు వెళ్లి కలెక్టర్‌ ఉత్తర్వులు కొట్టేయించుకున్నారని, ఈ విషయాన్ని మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డికి నాలుగుసార్లు నివేదించామని, మరో మంత్రి దేవినేని ఉమకి రెండుసార్లు విన్నవించామని, గత ఏడాది అసెంబ్లీకి వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేదుని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఇప్పుడు చలో అసెంబ్లీకి నిర్ణయించుకున్నామన్నారు. అయితే తమపై రౌడీషీట్లు తెరిచారంటూ వైఎస్‌ జగన్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. కేసులు పెట్టి పత్రాలు రాయించుకుని నానా ఇబ్బందులకు గురి చేశారని గోడు వెళ్లబోసుకున్నారు. రూ.2.30 కోట్ల చెల్లింపుల కోసం అలుపెరగని పోరాటం చేశామని, ఎవ్వరూ కనికరించకపోవడంతో ఆత్మహత్యే శరణ్యం అనుకున్నామని ఆ రైతులు వాపోయారు.

నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే చెల్లించాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. అవసరం అయితే విత్తన కంపెనీల నుంచి ప్రభుత్వం రికవరీ చేసుకోవచ్చని అన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని అన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే అధికారంలోకి రాగానే రైతులకు చెల్లించాల్సిన పరిహారం ఇస్తామని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top