చనిపోతుంటే పట్టించుకోరా.. ?: వైఎస్‌ జగన్‌




కాకినాడ/రంపచోడవరం: మరణాలు సంభవిస్తున్నా గిరిజన ప్రాంతాలను పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేకుండా పోయిందని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లప్పుడు మాత్రమే వారిని గుర్తు చేసుకుంటారా అని మండిపడ్డారు. పదుల సంఖ్యలో గిరిజనులు రోగాల బారిన పడుతున్నా వారివైపు 108గానీ, 104గానీ వచ్చే దిక్కు లేకుండా పోయిందని, కనీసం ఏఎన్‌ఎం సౌకర్యాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చాపరాయి గిరిజన గ్రామ విష జ్వర బాధితులను వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.



ఈ సందర్భంగా వారికి పౌష్టికాహార లోపం వల్లే జ్వరం బారిన పడ్డారని వైద్యులు వైఎస్‌ జగన్‌కు తెలిపారు. ఉదయం కొంతమందిని ఉన్నపలంగా డిశ్చార్జి చేయడంపై ప్రశ్నించగా వారికి జ్వరం తగ్గిందని అందుకే పంపించామని ప్రస్తుతం ఉన్నవారు కాస్త నీరసంగా ఉండటంతో పౌష్టికాహారం అందిస్తూ వైద్యం చేస్తున్నామని తెలిపారు. అనంతరం జ‍్వర బాధితులను వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తూ వారి జీవన పరిస్ధితులు, ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెలుసుకున్నారు. ముఖ్యంగా మౌళిక సదుపాయాలైన విద్య, వైద్యం, విద్యుత్‌, రోడ్డు సౌకర్యం, ఆహారంవంటి అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయగా బాధితులు బోరుమన్నారు. తమకు విద్యుత్‌ సౌకర్యం లేదని, రోడ్లు కూడా లేవని, సాగునీరు లేక, ఆహారం కూడా సరిగా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గతంలో (వైఎస్‌ హయాంలో) ఉచితంగా బియ్యం ఇచ్చేవారని ఇప్పుడు వాటిని కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.



ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికే పదిమందికి పైగా తమ గిరిజన ప్రాంతాల్లో చనిపోయారని, పలువురు రోగాల బారిన పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వారు వైఎస్‌ జగన్‌కు ఏకరువు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు తాను అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే గిరిజనులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను వైఎస్‌ జగన్‌ పరామర్శించిన విషయం తెలిసిందే. అక్కడ జరిగిన సంఘటనల పర్వాన్ని తెలుసుకున్న ఆయన వివాద పరిష్కారానికి వైఎస్సార్‌ సీపీ తరపున కమిటీ ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరిన వైఎస్‌ జగన్‌ సాయంత్రం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి విషజ్వర బాధితులను పరామర్శించారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top