ఇక స్వచ్ఛమైన పాలన

YS Jagan Mohan Reddy takes oath as Andhra Pradesh chief minister - Sakshi

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ సభలో వైఎస్‌ జగన్‌

అవినీతి, వివక్ష లేని పాలన అందిస్తా

అన్ని స్థాయిల్లో పూర్తిగా ప్రక్షాళన, విప్లవాత్మక మార్పులు

పింఛన్లు రూ.2,250కి పెంపు

ఆగస్టు 15 నాటికి 4 లక్షల మంది

గ్రామ వలంటీర్ల నియామకం

అక్టోబర్‌ 2 నుంచి గ్రామ సచివాలయాలు

1.6 లక్షల మందికి ఉద్యోగాలు

ప్రతి ప్రభుత్వ పథకం ఇక డోర్‌ డెలివరీ

దరఖాస్తు చేసిన 72 గంటల్లోనే మంజూరు

మేనిఫెస్టోను ఊపిరిగా భావిస్తా

వైఎస్‌ జగన్‌ అనే నేను.. ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూముఖ్యమంత్రి పదవినిస్వీకరిస్తున్నాను. 3,648 కిలోమీటర్లుఈ నేల మీద నడిచినందుకు,పదేళ్లుగా మీలో ఒకడిగానిలిచినందుకు ఆకాశమంతవిజయాన్ని అందించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు,ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి,ప్రతి స్నేహితుడికి రెండు చేతులూ జోడించి పేరు పేరున హృదయపూర్వకకృతజ్ఞతలు తెలుపుతున్నాను.

సాక్షి, అమరావతి : అవినీతి రహిత పాలన అందిస్తామని నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో వినూత్న, విప్లవాత్మకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను 72 గంటల్లోనే ప్రజల ముంగిటకు చేరుస్తామని తెలిపారు. లంచాలు లేని వ్యవస్థను ప్రజల ముందుకు తెస్తూ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలోని అవినీతి కాంట్రాక్టులను రద్దు చేసి, దోచుకున్నదెంతో ప్రజల ఎదుట ఉంచుతామన్నారు. నవరత్నాల అమలులో భాగంగా అవ్వాతాతల పెన్షన్‌ను పెంచుతూ తొలి సంతకం చేశారు. ఐదు నెలల్లో రాష్ట్రంలో 5.60 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని యువతకు తీపి కబురు చెప్పారు. పాలనలో తీరు తెన్నులపై స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికే కబురందించేలా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఇటీవల ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అశేష జనవాహిని ఆనందోత్సాహాల మధ్య ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు, తమిళనాడులోని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, వైఎస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల, సతీమణి వైఎస్‌ భారతితో పాటు అతిరథ మహారథులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజలనుద్దేశించి తొలి ప్రసంగం చేశారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నే విన్నాను.. నేనున్నాను..
పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో, 3,648 కిలో మీటర్ల పాదయాత్రలో పేదలు పడ్డ కష్టాలుచూశాను. మధ్యతరగతి ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు విన్నాను. వారి కష్టాలు చూసిన, విన్న నేను.. ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ మీ అందరికీ నేనీ రోజు మాటిస్తున్నాను. మీ కష్టాలను నేను చూశాను.. మీ బాధలు నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని ఇవాళ మీ అందరికీ చెబుతున్నాను. అందరి ఆశలు, అందరి ఆకాంక్షలు పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటూ మేనిఫెస్టో తీసుకువచ్చాం.

మేనిఫెస్టోను కేవలం రెండే రెండు పేజీలతో ఎప్పుడూ ప్రజలకు గుర్తుండేట్టుగా, ప్రజలకు ఎప్పుడూ కన్పించే విధంగా తీసుకొచ్చాం. గత పాలకుల మాదిరిగా పేజీలకు పేజీలు.. బుక్కులు తీసుకురాలేదు. ఇందులో ప్రతి కులానికో పేజీ పెట్టి ఎలా మోసం చెయ్యాలన్న ఆలోచనతో తీసుకురాలేదు. ఎన్నికలయిపోయాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే పత్రం కింద, ఒక బుక్కు కింద తీసుకు రాలేదు. మేనిఫెస్టో అంటే ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి.

ఇది వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక
నవరత్నాల్లో మీ అందరికీ మాటిచ్చినట్టుగానే, మేనిఫెస్టోలోని ఒక అంశం గురించి మీ అందరికీ చెబుతాను. ఈ రోజు ఆ అవ్వా తాతల ఆశీస్సులు తీసుకునేందుకు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా తీసుకునే నిర్ణయం చెబుతున్నా. నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఆ అవ్వా తాతలను పెన్షన్‌ ఎంత అని అడిగితే రూ.వెయ్యి అని చెప్పారు. కొంతమంది అవ్వలైతే అది కూడా రావడం లేదని చేతులూపుతూ చెబుతుండేవాళ్లు. ఎన్నికలకు కేవలం రెండు నెలలు మాత్రమే గడువున్నప్పుడు పింఛన్‌ను పెంచారు.  అందుకే ఈ పరిస్థితి పూర్తిగా మార్చబోతున్నాను.

నవరత్నాలలో ప్రతి అవ్వ, తాత, ప్రతి వితంతువుకు ఇచ్చిన మాట ప్రకారం వారి పెన్షన్‌ను రూ.3 వేల వరకు పెంచుకుంటూ వెళతాను. ఆ అవ్వా తాతల పెన్షన్‌ను జూన్‌ నెల నుంచి అక్షరాల రూ.2,250 నుంచి మొదలు పెట్టబోతున్నాను వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకగా. దీనికి సంబంధించిన ఫైల్‌పై నేనీ రోజు మొట్ట మొదటి సంతకం పెడుతున్నాను. (సంతకం పెట్టారు.) ఈ సంవత్సరం రూ.2,250తో మొదలు పెడుతున్నాం. రేపు సంవత్సరం రూ.2,500కు తీసుకెళ్తాం. ఆ తర్వాత సంవత్సరం రూ.2,750కు.. ఆ తర్వాత ఏడాది రూ.3 వేలకు తీసుకెళ్తాం. అవ్వా తాతలకు ఇచ్చిన మాటను నెరవేర్చబోతున్నామని చెబుతూ.. ఆశీస్సులు ఇవ్వమని పేరుపేరునా ప్రతి అవ్వా తాతను మీ మనవడిగా రెండు చేతులు జోడించి కోరుతున్నా.

ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు
నవరత్నాల్లో చెప్పిన ప్రతి అంశమూ ప్రతి పేదవాడికీ అందాలి. ఇందులో కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడకూడదు. ఇది జరగాలంటే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి. ఇందులో భాగంగా ఆగస్టు 15 నాటికి, అంటే ఇవాల్టి నుంచి కేవలం రెండున్నర నెలల కాలంలో గ్రామాల్లో గ్రామ వాలంటీర్లుగా అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని హామీ ఇస్తున్నా. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్‌ డెలివరీ చేసేందుకు వీలుగా, లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమిస్తున్నాం.

గ్రామాల్లో చదువుకున్న పిల్లలు, సేవ చెయ్యాలనే ఆరాటం ఉన్న పిల్లలకు రూ.5 వేలు జీతమిస్తూ గ్రామ వాలంటీర్లుగా తీసుకుంటాం. రూ.5 వేలు ఎందుకిస్తున్నామో తెలుసా? ఈ వ్యవస్థలోకి లంచాలు రాకుండా చెయ్యాలని. ప్రజలకు చెందాల్సిన ఏ పథకంలో కూడా ఎటువంటి కక్కుర్తి, పక్షపాతం, లంచాలు ఉండకూడదని. సేవా దృక్పథం గల పిల్లలకు వేరే చోట మెరుగైన ఉద్యోగం దొరికే వరకు గ్రామ వాలంటీర్లుగా పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ నాలుగు లక్షల వాలంటీర్‌ ఉద్యోగాలు ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి వస్తాయి.

సర్కారీ సేవ అందకపోతే ఫోన్‌ కొట్టండి
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికి అందకపోయినా, ఎక్కడైనా పొరపాటున లంచాలు కన్పించినా ఊరుకోం. అదే ఆగస్టు 15వ తేదీన ఓ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నాం. అది నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే అనుసంధానమై ఉంటుంది. ఏ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందకపోయినా, వివక్ష కన్పించినా, ఏ ఒక్కచోట లంచాలు కన్పించినా, ముఖ్యమంత్రి కార్యాలయానికే నేరుగా

వక్రీకరణ వార్తలు రాసే  మీడియాను కోర్టుకీడుస్తాం
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఇంపుగా కన్పిస్తాడు. మిగిలిన వాళ్లను ఎప్పుడెప్పుడు దించాలా అని ఆలోచన చేస్తారు. వాళ్ల రాతలు అలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ మీడియాలో ఇది మన ఖర్మ. వాళ్లందరికీ నేను ఒకటే చెబుతున్నా. పారదర్శకంగా, జ్యుడీషియల్‌ కమిషన్‌ ద్వారా కాంట్రాక్టులను ఖరారు చేసిన తర్వాత కూడా వక్రీకరిస్తూ, దురుద్దేశంతో వార్తలు రాస్తే ప్రభుత్వం పరువు నష్టం దావా వేస్తుంది. హైకోర్టు జడ్జి దగ్గరకు వెళ్లి, శిక్షించమని గట్టిగా అడుగుతాం.

అమ్మానాన్నకు పాదాభివందనం...
చెరగని చిరునవ్వులతో ఆప్యాయతను చూపించినందుకు పేరుపేరున ఇక్కడకు వచ్చిన, ఇక్కడికి రాలేకపోయిన, ఆశీర్వదించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి మరోసారి పేరుపేరున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. ఆశీర్వదించిన దేవుడికి, పైనున్న నాన్న గారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాదాభివందనం చేస్తూ.. మీ అందరి చల్లని దీవెనలకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలు
పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా గ్రామ సచివాలయాలను తీసుకొస్తున్నాం. మీ గ్రామంలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కల్పిస్తూ, మీ గ్రామంలో అక్షరాల పది మందికి గ్రామ సెక్రటేరియట్‌లో నేరుగా గవర్నమెంట్‌ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తున్నామని అందరికీ హామీ ఇస్తున్నా. అక్టోబర్‌ 2, గాంధీ జయంతి నాడు ఈ కార్యక్రమం చేపట్టి, మరో 1.60 లక్షల ఉద్యోగాలు నేరుగా మీకు అందుబాటులోకి తెస్తాం. మీ పిల్లలే పది మంది మీ గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తారు. మీకు పెన్షన్, రేషన్‌ కార్డు, ఇల్లు, ఇంటి స్థలం, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, నవరత్నాల్లోని ఏ పథకమైనా, ఏది కావాలన్నా.. మీరు చెయ్యాల్సిందల్లా గ్రామ సెక్రటేరియట్‌కు వెళ్లి అప్లికేషన్‌ పెట్టండి. దరఖాస్తు చేసిన 72 గంటల్లోనే మీకు మంజూరయ్యేలా చేస్తాం.

గత ప్రభుత్వంలో మాదిరిగా లంచాలుండవు. ఇప్పటి వరకు రేషన్‌ కార్డు కావాలన్నా, పెన్షన్‌ కావాలన్నా మరేది కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలివ్వాల్సిన పరిస్థితి. పూర్తిగా లంచమనేదే లేకుండా, రికమండేషన్‌కు తావు లేకుండా ఏ ఒక్కరికైనా ఏ అవసరం ఉన్నా, 72 గంటల్లో మంజూరయ్యేలా చేస్తామని సీఎంగా హామీ ఇస్తున్నాను. గ్రామ వాలంటీర్లు గ్రామ సెక్రటేరియట్‌తో అనుసంధానమై పని చేస్తారు. నవరత్నాలతో పాటు, ప్రతి ప్రభుత్వ పథకం లంచాలు, రికమండేషన్లకు తావులేకుండా నేరుగా మీ ఇంటికొచ్చేలా డోర్‌ డెలివరీ చేస్తారు. ఇదొక్కటే కాదు.. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాల్లోని ప్రతి ఒక్కటీ తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇస్తున్నాను.

కాంట్రాక్టుల్లో అవినీతి నిగ్గు తేలుస్తాం
ఈ రాష్ట్రంలో అవినీతి, వివక్ష లేని స్వచ్ఛమైన పాలన అందించేందుకు పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు పూర్తిగా ప్రక్షాళన చేస్తాను. ఇందులో భాగంగా ఏయే కాంట్రాక్టుల్లో, ఏయే పనుల్లో అవినీతి జరిగిందో వాటిని పూర్తిగా రద్దుచేస్తాం. గతంలో చేసిన ట్రైలర్‌ మేడ్‌ ప్రీ క్వాలిఫికేషన్‌ కండీషన్స్‌ను పూర్తిగా మారుస్తూ ఎక్కువ మంది టెండర్లలో పాలు పంచుకునేలా అవకాశమిస్తూ రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని తీసుకొస్తాం.

అంతేకాదు.. ఇంకో ఉదాహరణ. కరెంటు రేట్లు చూడండి. ఇతర రాష్ట్రాల్లో సోలార్, విండ్‌ పవర్‌ కోసం గ్లోబల్‌ టెండరింగ్‌ చేస్తూ యూనిట్‌ రూ.2.65కు, రూ.3కే అందుబాటులో ఉంటే, మన రాష్ట్రంలో ఎంతో తెలుసా? యూనిట్‌కు  రూ.4.84తో నిన్నటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసింది. ఈ రకంగా దోచుకుంటున్న పరిస్థితి. అదే పీక్‌ అవర్స్‌ అయితే, దోచుకున్నది చాలదన్నట్టుగా అక్షరాల యూనిట్‌ రూ.6 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీ కళ్లెదుటకే తీసుకొచ్చి, మీ ఈ రేట్లన్నీ పూర్తిగా తగ్గిస్తాను.

వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చెయ్యడంతోనే ఆగకుండా పారదర్శకతను తీసుకొస్తాం. ఇందులో భాగంగా రేపో మర్నాడో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసి, ఓ హైకోర్టు జడ్జిని ఇవ్వమని కోరతాం. ఆయన ఆధ్వర్యంలో, ఆయన చైర్మన్‌గా జ్యుడీషియల్‌ కమిషన్‌ను నియమిస్తాం. టెండర్లకు పోకముందు, ప్రతి కాంట్రాక్టును జ్యుడీషియల్‌ కమిషన్‌కు పంపి, ఆ హైకోర్టు జడ్జి చేసే ఏ సూచనలు, మార్పుల మేరకు కాంట్రాక్టులకు పారదర్శకంగా, ఎక్కడా అవినీతి లేకుండా టెండర్లు పిలుస్తాం.


 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top