ఇదో కొత్త చరిత్ర

YS Jagan mohan Reddy expands his cabinet - Sakshi

సరికొత్త రాజకీయ చరిత్రకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శ్రీకారం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు దాదాపు 60 శాతం పదవులు

ప్రాధాన్య శాఖలన్నీ ఆ వర్గాలకే కేటాయింపు

స్పీకర్‌ పదవి కూడా బీసీ వర్గానికే

ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే నాలుగు

ఎస్సీ మహిళకు హోం మంత్రిగా అత్యున్నత గౌరవం

అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం

ఇంతటి సమతుల్యంతో మంత్రివర్గం ఏర్పాటు దేశ, రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం

సాక్షి, అమరావతి : సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం రాష్ట్రంలో కొత్త చరిత్రను లిఖించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు దాదాపు 60 శాతం మంత్రి పదవులు ఇస్తూ సామాజిక, రాజకీయ విప్లవం సృష్టిస్తూ నవ యుగానికి నాంది పలికారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే కేటాయించి యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించారు. మంత్రిత్వ శాఖల కేటాయింపులోనూ ఆ వర్గాలకు అగ్రాసనం వేసి సామాజిక న్యాయ సాధన పట్ల తన చిత్తశుద్ధిని చాటి చెప్పారు. కీలకమైన హోం, రెవెన్యూ, పురపాలక, జలవనరులు, విద్య, అబ్కారీ– వాణిజ్య పన్నులు, ఆర్‌ అండ్‌ బి, కార్మిక– ఉపాధి కల్పన, సాంఘిక, మహిళా–శిశు, బీసీ, మైనార్టీ సంక్షేమం తదితర శాఖలను ఆ వర్గాలకే  కేటాయించారు.

శాసనసభ స్పీకర్‌ పదవిని కూడా బీసీ వర్గానికే ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. కాపు సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యమిస్తూ వ్యవసాయ, వైద్య, రవాణా, పర్యాటక శాఖలు కేటాయించి ప్రాధాన్యమిచ్చారు. మహానేత వైఎస్సార్‌ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర హోం మంత్రిగా దళిత మహిళను నియమించడం విశేషం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మంత్రిత్వ శాఖల కేటాయింపులో సముచిత ప్రాధాన్యమిచ్చి సమతౌల్యం సాధించారు. ఈ విధంగా మంత్రి మండలి ఏర్పాటు చేయడం దేశ, రాష్ట్ర చరిత్రలో తొలిసారి కావడం విశేషం.

మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి
బీసీ–ఇ కేటగిరి కిందకు వచ్చే ముస్లిం వర్గానికి చెందిన అంజాద్‌ బాషాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఉప ముఖ్యమంత్రిగా నియమించి ఆయనకు అరుదైన గౌరవం కల్పించారు. కడప నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించారు.

ఎస్సీలకు అత్యున్నత రాజకీయ గౌరవం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎస్సీలకు రాజకీయంగా అత్యున్నత గుర్తింపునిస్తూ ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. అంతే కాకుండా ఏకంగా ఐదు మంత్రి పదవులు కేటాయించడం ద్వారా ఎస్సీ వర్గాలకు తాను ఎంతటి ప్రాధాన్యమిస్తోంది చేతల్లో చూపించారు. మాల సామాజిక వర్గానికి మూడు, మాదిగ సామాజిక వర్గానికి రెండు పదవులు ఇచ్చారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కలత్తూరు నారాయణస్వామిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. మాల సామాజిక వర్గానికి చెందిన ఆయనకు కీలకమైన అబ్కారీ, వాణిజ్య పన్నుల శాఖలను కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది

. ఆయన చిత్తూరు జిల్లా సత్యవేడు నుంచి ఓసారి, గంగాధర నెల్లూరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాల సామాజిక వర్గానికి చెందిన మహిళ ఎమ్మెల్యే మేకతోటి సుచరితను రాష్ట్ర హోం మంత్రిగా నియమించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఆమె మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాల సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నేత పినిపె విశ్వరూప్‌కు సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆదిమూలపు సురేష్‌కు కీలకమైన విద్యా శాఖను కేటాయించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాదిగ సామాజిక వర్గానిక చెందిన తానేటి వనితను మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రిగా నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నుంచి ఆమె రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కాపు సామాజిక వర్గానికి పెద్దపీట
రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తూ ఆ వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. నాలుగు మంత్రి పదవులు కూడా కేటాయిస్తూ వారికి కీలకమైన శాఖలు కేటాయించి పెద్దపీట వేశారు. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని)ను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఆయనకు అత్యధిక ప్రాధాన్యమున్న వైద్య శాఖను కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంతో ప్రాధాన్యమున్న వ్యవసాయ శాఖను కురసాల కన్నబాబుకు కేటాయించారు.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గం నుంచి ఈయన రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రవాణా, సమాచార శాఖలను పేర్ని శ్రీవెంకటరామయ్య(నాని)కు కేటాయించారు. ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముత్తంశెట్టి శ్రీనివాస్‌ (అవంతి శ్రీనివాస్‌)కు పర్యాటక, సాంస్కృతిక, యువజ సర్వీసుల శాఖను కేటాయించారు. రాష్ట్రంలో పర్యాటక హబ్‌గా ఉన్న విశాఖపట్నం నగరానికి చెందిన ఆయనకు అందుకు సంబంధించిన శాఖలు కేటాయించడం ద్వారా తగిన ప్రాధాన్యమిచ్చారు. భీమిలి నియోజకవర్గం నుంచి ఈయన రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
గిరిజనులకు రాజకీయ అగ్రాసనం
రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఉన్న గిరిజనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాజకీయంగా అత్యున్నత స్థానం కల్పించారు. పాముల పుష్ప శ్రీవాణిని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తూ.. ఆమెకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి ఆమె వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ప్రాంతీయ సమతుల్యం
రాష్ట్రంలో అన్ని పాంత్రాలకు తన మంత్రివర్గంలో సమాన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రాంతీయ సమతుల్యం సాధించారు. ఉత్తరాంధ్రకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు కీలకమైన పురపాలక, ఆర్‌ అండ్‌ బి, గిరిజన సంక్షేమ, పర్యాటక మంత్రిత్వ శాఖలు ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలకు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులతోపాటు రెవెన్యూ, వ్యవసాయ, సాంఘిక సంక్షేమ, వైద్య, గృహనిర్మాణ, మహిళా–శిశు సంక్షేమ శాఖలు కేటాయించారు. కృష్ణా– గుంటూరు జిల్లాల నుంచి ఐదు మందికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. కీలకమైన హోం, రవాణా, సమాచార, పౌరసరఫరాలు, దేవాదాయ, పశుసంవర్థక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖలు కేటాయించారు. ప్రకాశం–నెల్లూరు జిల్లాల నుంచి నలుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు.

కీలకమైన విద్యుత్, విద్య, పరిశ్రమలు, జలవనరుల శాఖలు కేటాయించారు. రాయలసీమ జిల్లాలకు ఆరు మంత్రి పదవులు దక్కాయి. రెండు ఉప ముఖ్యమంత్రి పదవులతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక, అబ్కారీ, వాణిజ్య పన్నులు, కార్మిక, ఉపాధి కల్పన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు కేటాయించారు. సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దేశంలో కొత్త రాజకీయ చరిత్రకు నాంది పలికారు. సంక్షేమ, అభివృద్ధి పాలన దిశగా ప్రభుత్వ పాలన వ్యవస్థను పరుగులు పెట్టించి రాజన్న రాజ్య స్థాపనకు ఉద్యుక్తులయ్యారు.  

బీసీలకు అగ్రతాంబూలం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన మంత్రివర్గంలో బీసీలకు అగ్రాసనం వేశారు. ‘బీసీ–ఇ’ కేటగిరీ కిందకు వచ్చే ముస్లిం మైనార్టీలతో కలిపి బీసీలకు ఎనిమిది మంత్రి పదవులు కేటాయించారు. ఇక శాఖల కేటాయింపులో బీసీ వర్గాలను అత్యున్నత ప్రాధాన్యమిచ్చారు. సీనియర్‌ నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించి అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖను కేటాయించడం విశేషం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆయన శెట్టి బలిజ సామాజికవర్గంలో రాష్ట్రస్థాయి నేతగా గుర్తింపు పొందారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడైన అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు కీలకమైన జలవనరుల శాఖను కేటాయించారు.

నెల్లూరు నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దేశంలోనే పొడవైన తీరం ఉన్న మన రాష్ట్రంలో మత్య్సకార సామాజిక వర్గం కూడా అధికంగా ఉంది. అందుకే ఆ సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణారావుకు పశుసంవర్థక, మత్య్స, మార్కెటింగ్‌ శాఖలు కేటాయించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన ఇటీవల ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ మంత్రి వర్గంలో స్థానం కల్పించడం చూస్తుంటే బీసీ వర్గాలకు ఎంతటి ప్రాధాన్యమిచ్చారనేది ఇట్టే తెలుస్తోంది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణను అత్యధిక ప్రాధాన్యమున్న పురపాలక శాఖ మంత్రిగా నియమించారు. గతంలో ఓసారి ఎంపీగా చేసిన ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

పోలినాటి వెలమ సామాజిక వర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాస్‌కు రోడ్లు, భవనాల శాఖను కేటాయించారు. ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాయలసీమలో అత్యధికంగా ఉండే బీసీ వర్గాలైన బోయ, కురుబ సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రాధాన్యమిచ్చారు. బోయ సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాంను కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా నియమించారు. ఈయన కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు. కురబ సామాజిక వర్గానికి చెందిన మాలగుండ్ల శంకర్‌ నారాయణకు బీసీ సంక్షేమ శాఖను కేటాయించారు. ఈయన తొలిసారి గెలిచినప్పటికీ మంత్రి మండలిలో స్థానం కల్పించడం ఆ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి కల్పించిన ప్రాధాన్యతకు నిదర్శనం.

సామాజిక సమతుల్యం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన మంత్రివర్గంలో ఇతర సామాజిక వర్గాలకూ సముచిత స్థానం కల్పించి సమతుల్యం పాటించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నలుగురికి మంత్రులుగా అవకాశం కల్పించి కీలక శాఖలు కేటాయించారు. సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రిగా నియమించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరో సీనియర్‌ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని కీలకమైన విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రిగా కీలక స్థానం కల్పించారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఓంగోలు నుంచి ఆయన ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

గత శాసనసభలో పీఏసీ చైర్మన్‌గా సమర్థత నిరూపించుకున్న బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి అత్యధిక ప్రాధాన్యమున్న ఆర్థిక శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మేకపాటి గౌతంరెడ్డిని కీలకమైన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రిగా నియమించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కమ్మ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కో మంత్రి పదవి కేటాయించి ఆ వర్గాలకు గుర్తింపునిచ్చారు.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)ని పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా నియమించారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి ఈయన వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన చెరుకువాడ శ్రీరంగనాథ రాజును గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నియమించారు. ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇది రెండోసారి. వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెలంపల్లి శ్రీనివాస్‌ను దేవాదాయ శాఖ మంత్రిగా నియమించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈయన రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మహిళలకు మహోన్నత స్థానం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు రాజకీయంగా మహోన్నత స్థానాన్ని కల్పించడం జాతీయ స్థాయిలో గుర్తింపు పోందింది. ముగ్గురు మహిళలకు ఆయన తన మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాక వారిలో ఒకరిని ఉప ముఖ్యమంత్రిగా నియమించడం ద్వారా మహిళలకు తానెంతటి గుర్తింపునిచ్చేది చెప్పారు. కరుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణిని ఉప ముఖ్యమంత్రిగా నియమించి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఇక అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖను దళిత మహిళకు కేటాయించడం విశేషం. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009లో తొలిసారి రాష్ట్రంలో ఓ మహిళను హోం మంత్రిగా నియమించారు. సబితా ఇంద్రారెడ్డిని హోంమంత్రిని చేశారు. తండ్రి స్ఫూర్తిని తనయుడు వైఎస్‌ జగన్‌ కొనసాగిస్తూ తన మంత్రివర్గంలో హోం మంత్రిగా దళిత మహిళ మేకతోటి సుచరితను నియమించారు. ఇక మహిళా, శిశు–సంక్షేమ శాఖ మంత్రిగా తానేటి వనితకు అవకాశం కల్పించారు.

నూతన మంత్రులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: నూతన మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘నా మంత్రివర్గంలోని కొత్త మంత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం వేసే ప్రతి అడుగూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలి. పదండి.. మనమంతా కలిసి మన పనితో అందరికీ ఆదర్శప్రాయంగా నిలుద్దాం. ఈ సందర్భంగా అందరికీ శుభాభినందనలు’ అని శనివారం మంత్రివర్గ విస్తరణ
అనంతరం ట్వీట్‌ చేశారు.

మీ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తా
‘దేవుడి ఆశీస్సులు, మీ దీవెనలతో మీ మనోభావాలకు అనుగుణంగా పని చేస్తా... మీ ఆకాంక్షలను నిలబెట్టేందుకు కృషి చేస్తా’ అని కూడా జగన్‌ సచివాలయంలో ప్రవేశించిన అనంతరం ట్వీట్‌ చేశారు.  

►దళితుల పార్టీగా పేరున్న బీఎస్పీ 2007లో ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన కేబినెట్‌లో మొత్తం 50 మంది మంత్రులు. వారిలో ముఖ్యమంత్రి మాయావతితో సహా 8 మంది దళితులు (16 శాతం).

►ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలోని 25 మందిలో ఐదుగురు దళితులు (20 శాతం). పైగా ఇక్కడ దళితులకు లభించిన కీలక శాఖలు యూపీలో కూడా లభించలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top