సీబీఐ ఎంక్వైరీ వేయాలి: వైఎస్‌ జగన్‌ | ys jagan mohan reddy demand for cbi enquiry into tenth question paper leakage | Sakshi
Sakshi News home page

సీబీఐ ఎంక్వైరీ వేయాలి: వైఎస్‌ జగన్‌

Mar 28 2017 4:26 PM | Updated on Aug 18 2018 5:15 PM

సీబీఐ ఎంక్వైరీ వేయాలి: వైఎస్‌ జగన్‌ - Sakshi

సీబీఐ ఎంక్వైరీ వేయాలి: వైఎస్‌ జగన్‌

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.

అమరావతి:  పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.  ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ సందర్భంగా ...‘ఈ రోజు ఆరున్నర లక్షల కుటుంబాలకి సంబంధించిన అంశంలో ఏమాత్రం లెక్కలేనితనం ఈ ప్రభుత్వానిది. దాన్ని ఎంతసేపూ కవర్ చేసే ప్రయత్నమే తప్ప పరిష్కరించే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చెయ్యడం లేదు. ఈ ప్రశ్నా పత్రాల లీకేజీ ఇష్యూ లో తప్పు జరిగింది అని విద్యాశాఖే ఒప్పుకుంటుంది. మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే ఢిల్లీ నుండి మాట్లాడుతూ అటెండర్ ఫోన్ ద్వారా లీక్ అయింది అని చెబుతున్నారు.

ఆ అటెండర్ ఏ కాలేజీకి చెందిన వాడో అందరికీ తెలుసు. ఆ కాలేజీ ఎవరిదో ఎఫ్‌ఐఆర్‌ కాపీయే చెబుతుంది. ఇలా ఇష్టమొచ్చినట్టు ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తే కష్టపడి చదివిన విద్యార్థులకు కనీసం 100వ రాంకైనా వస్తుందా? ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు. అది వేస్తేనే కదా మిగిలిన ఎన్ని కాలేజీలలో ఇలాంటి భాగోతాలు జరుగుతున్నాయో తెలుస్తాయి. చంద్రబాబుకి మంత్రి నారాయణ బినామీ అని చెబుతారు. నారాయణ కాలేజీలో చంద్రబాబుకి వాటాలున్నాయని పుకార్లు ఉన్నాయి.

స్కామ్ జరిగిన కాలేజీ ఒకమంత్రికి చెందినది.. దానిపై విచారణ జరిపించాల్సిన మరొక మంత్రి ఆయన వియ్యంకుడు. ఇది చాలదా ఈ కేసు ఎంత బాగా నడుస్తోంది అని చెప్పడానికి? చిన్న చిన్న అధికారుల పైనో..అటెండర్ల పైకో ఈ కేసు గెంటేసే ప్రయత్నం జరుగుతుంది. అసలు ఈ కేసుపై చంద్రబాబు ఎందుకు స్పందించరు? చంద్రబాబు తరువాత ఎప్పుడో దీనిపై స్పందిస్తాననడం రోమ్ తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు ఉంది. బహుశా కాపీలు కొట్టిన నారాయణ విద్యార్థులకు ఫస్ట్‌  రాంకు వచ్చాక స్పందిస్తారేమో’ అని ఎద్దేవా చేశారు.

మంత్రి నారాయణ కారణంగా విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయిందని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. నారాయణ యాజమాన్యంపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన ప్రశ్నించారు. తాము ఏ విషయాన్ని ప్రస్తావించినా చర్చకు అనుమతించడం లేదని, ప్రశ్నపత్రాల లీక్‌ గురించి ప్రశ్నిస్తే దాన్ని పక్కనపెట్టి ల్యాండ్‌ బిల్లును ఆమోదించారని అన్నారు. ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని, గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై వేసిన విచారణకు ఇప్పటికీ అతీగతి లేదని, ఏ విషయం అయినా దాటవేత ధోరణే అవలంభిస్తోందన్నారు. తాము అన్ని ఆధారాలు చూపించినా ప్రభుత్వం స్పందించడం లేదని, రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని వైఎస్‌ జగన్‌ అన్నారు.

మరోవైపు టెన్త్‌ పేపర్ల లీకేజీపై ఏపీ అసెంబ్లీ మంగళవారం అట్టుడుకిపోయింది. ప్రశ్నాపత్రాల లీకేజీపై వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్ఆర్‌సిపి .. చర్చకు పట్టుబట్టింది. స్పీకర్‌ తిరస్కరించడంతో సభను స్తంభింపజేసింది. సభ ప్రారంభం కాగానే.. ఈ అంశాన్ని ప్రస్తావించిన విపక్షం.. వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని కోరింది. లక్షలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు ఏం సమాధానం చెబుతారని మండిపడింది.

టెన్త్‌ క్లాస్‌ పేపర్ల లీకేజీపై ఏపీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఇచ్చిన నివేదికను విపక్ష నేత వైఎస్‌ జగన్‌ సభలో బయటపెట్టారు. నారాయణ విద్యాసంస్థల్లో పేపర్‌ లీకైందని నివేదికలో తేలిందనీ..దీని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో వైఎస్‌ జగన్‌ మైక్ కట్‌ చేయడంతో వైఎస్ఆర్‌ సిపి ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పలుమార్లు సభ వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement