
సాక్షి, అమరాతి : ప్రజలకిచ్చిన ఒక్కో మాటను నిలబెట్టుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి రహిత పాలన కోసం నేడు మరో కీలకమైన అడుగు వేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌ను సీఎం వైఎస్ జగన్ కలిశారు. మంగళవారం సాయంత్రం ఉండవల్లిలోని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. కాంట్రాక్టుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతను పాటించడం కోసం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసే విషయంపై ఏసీజేతో చర్చించారు. సీఎం వైఎస్ జగన్ వెంట ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం, అడ్వకేట్ జనరల్ శ్రీరాం, పొన్నవోలు సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం చేసిన అనంతరం అశేష జనవాహినిని ఉద్దేశించి అవినీతి రహిత పాలన అందించే దిశగా కాంట్రాక్టుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతను పాటిస్తానని ప్రకటించారు. దాని కోసం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసే విషయంపై ఏసీజేను కలిసి కోరతానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సీఎం జగన్ ఏసీజేను కలిశారు. కమిషన్ ఏర్పాటు కోసం ఓ సిట్టింగ్ న్యాయమూర్తిని కేటాయించాలని కోరారు. న్యాయమూర్తిని కేటాయిస్తే ఇకపై జరగబోయే టెండర్ల ప్రక్రియ మొత్తం ఈ న్యాయమూర్తి ఇచ్చే సూచనలు, సలహాలు, మార్గదర్శకాల ఆధారంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ జ్యుడీషియల్ కమిషన్‌తో ప్రజా ప్రయోజనాలు రక్షించవచ్చని నూత సీఎం ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.