
సాక్షి, కర్నూలు : ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పుట్లూరు సమీపంలో ముస్లింల ఆత్మీయ సదస్సుకు హాజరయ్యారు. ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే వైఎస్‌ఆర్ పాలన కొనసాగించాలని వైఎస్ జగన్‌కు మైనార్టీలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘ ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మోసం చేశాడు. ఎనిమిది శాతం రిజర్వేషన్లు అంటూ ముస్లింలను నిలువునా ముంచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి వస్తే మసీదు, చర్చి, దేవాలయాల నిర్వహణ ఖర్చుల కోసం రూ.15 వేలు, మసీద్ ఇమమ్‌లకు నెలకు రూ.10వేల వేతనం ఇస్తాం.’ అని హామీ ఇచ్చారు.