మత్తులో యువత చిత్తు

Youth Addicted To Marijuana In Madanapalle Chittoor - Sakshi

మదనపల్లెలో పెరుగుతున్న మందుబాబుల సంఖ్య

చెడు స్నేహాలతో అసాంఘిక కార్యకలాపాలు

నాశనం అవుతున్న బంగారు భవిష్యత్తు

అవగాహన కల్పించని అధికారులు

బసినికొండకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతిచెందాడు. ప్రభుత్వం కారుణ్య నియామకం కింద తండ్రి ఉద్యోగం కొడుకుకు ఇచ్చింది. ఆ యువకుడు తనకు వచ్చే జీతంలో సగం ఇంట్లో మిగతా డబ్బంతా స్నేహితులతో కలిసి మద్యం, గంజా యి తాగుతూ జల్సాలకు ఖర్చు చేస్తున్నాడు. మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాడు. దీంతో అతని కుటుంబం అర్ధాకలితో అలమటిస్తూ కాలం వెళ్లదీస్తోంది.

శేషమహాల్‌ దగ్గర ఉంటున్న ఓ యువకుడు స్థానికంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తాడు. నెలకు రూ.65 వేలం జీతం వస్తుంది. ఇతనికి అమ్మానాన్నలతో పాటు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. స్నేహితులతో కలిసి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. సిగరెట్‌ కాల్చడంతోపాటు మద్యం సేవిస్తూ జీతాన్ని ఖర్చు చేస్తున్నాడు. ఆరోగ్యాన్ని గుల్ల చేసుకోవడంతోపాటు కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ఎప్పుడు ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనని ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

చిత్తూరు, మదనపల్లె టౌన్‌ : మదనపల్లె పట్టణంతో పాటు నియోజకవర్గంలో నిబంధనలు పాటించకకుండా విచ్ఛలవిడిగా మద్యం, సిగరెట్లు, గంజాయి, గుట్కా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో యువకులు మద్యం మత్తులో జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. మదనపల్లె నియోజకవర్గంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 299 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు కాగా వాటిలో మదనపల్లెలోనే 209 కేసులు ఉండడం ఇందుకు నిదర్శనం. కొంతమంది గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్నారు. కాలేజీల్లో చదువుతున్న యువకులు మూత్రశాలలు, బాత్‌ రూముల్లో రహస్యంగా గంజాయి పీల్చుతున్నారు. మద్యం, గంజాయి, డ్రగ్‌ మత్తుకు బానిసలుగా మారుతున్న వారిలో అధిక శాతం మంది ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, ఉద్యోగుల పిల్లలే ఉంటున్నారు. చెడు వ్యసనాలతో జీవితాలను నాశనం చేసుకోకుండా అవగాహన కల్పించాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో ఇరుక్కుంటున్నారు
మదనపల్లె పట్టణంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు ఎక్కువ అయ్యాయి. యువకులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు అపరాధం విధిస్తున్నారు.– చలపతి, మాజీ వైస్‌ సర్పంచి, బసినికొండ

వ్యసనాలతో జీవితం అంధకారం
వ్యసనాలతోనే యువత జీవితం అంధకారమౌతోంది. చెడు సావాసం మానుకుని భవిష్యత్తును బంగారు మయం చేసుకోవాలి. మాకు తాగేవాడు దొరికినా, అమ్మేవాడు దొరికినా కేసుపెట్టి జైలుకు పంపుతాం. పోలీసులు దేన్నీ చూస్తూ ఊరుకోరు. – చిదానందరెడ్డి, డీఎస్పీ, మదనపల్లె

యువత పెడతోవకు పాలకులేæ కారణం..
యువత పెడతోవ పట్టడానికి పాలకులే కారణం. వీధికో మద్యం షాపు పెట్టి విచ్ఛలవిడిగా విక్రయాలు సాగిస్తున్నారు. పోలీస్, ఎక్సైజ్‌ అధికారుల నిబంధనలను షాపులు, బార్ల యజమానులు బేఖాతర్‌ చేస్తునానరు. యువత మద్యం తాగడానికి క్యూకడున్నారు.              – డాక్టర్‌ ఖాన్, మదనపల్లె

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top