చింతమనేని చెప్పాడని..నవవరుడి అరెస్ట్‌

A young man who has sent a Chintamaneni video to another person is arrested  - Sakshi

దళితులను దూషించిన చింతమనేనిపై ఈగ కూడా వాలనివ్వని ప్రభుత్వం 

చింతమనేని మాట్లాడిన వీడియోను మరొకరికి పంపిన యువకుడి అరెస్టు 

పెళ్లి జరిగి 12 గంటలైనా కాకముందే కామిరెడ్డి నానీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: దళితులను కించపరుస్తూ మాట్లా డితే అందులో ఎలాంటి తప్పు లేదని రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం ఎలుగెత్తి చాటుతోంది. కానీ, దాన్ని బయటపెట్టిన వారికి మాత్రం శిక్ష తప్పదని హెచ్చరి స్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ (టీడీపీ) ప్రసంగ వీడియోలను షేర్‌ చేసిన వారిపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చింతమనేని మాట్లాడిన వీడియోను మరొకరికి పంపించాడంటూ కామిరెడ్డి వెంకట నరసింహారావు(నానీ) అనే యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నానీకి శుక్రవారం రాత్రి పెళ్లి జరగ్గా, శనివారం మధ్యాహ్నం తన స్వగ్రామం దెందులూరు మండలం శ్రీరామవరంలో రిసెప్షన్‌ జరిగింది. రిసెప్షన్‌ ముగిసి అత్తగారింటికి వెళ్లిన నానీని పోలీసులు అరెస్టు చేశారు. చింతమనేని ప్రభాకర్‌ ఒత్తిడి మేరకే నానీ అరెస్టు చేసినట్లు సమాచారం. చింతమనేని శనివారం ఉదయం ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసు ఉన్నతాధికారితో గంటసేపు సమాలోచనలు జరిపిన తర్వాత ఈ అరెస్టు జరగడం గమనార్హం. 

వైఎస్సార్‌సీపీపై సీఎం చంద్రబాబు అక్కసు 
రెండు నెలల క్రితం శ్రీరామపురంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ‘‘మీరు దళితులు, మీరు వెనుకబడిన వారు, మీరు షెడ్యూల్‌ క్యాస్ట్‌ వారు. రాజకీయాలు మాకుంటాయి.. మాకు పదవులు.. మీకెందుకురా పిచ్చముం..కొడకల్లారా..’’ అంటూ దూషించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. చింతమనేని వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దళితులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీసుస్టేషన్లలో చింతమనేనిపై ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఆ వీడియోను మార్ఫింగ్‌ చేసి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారంటూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేశారు. అయితే, పోలీసులు మాత్రం రిమాండ్‌ రిపోర్టులో ఎక్కడా మార్ఫింగ్‌ అన్న పదాన్ని వాడలేదు. ఆ వీడియోను వెబ్‌లో పోస్టు చేసిన కత్తుల రవికుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ వీడియోను కత్తుల రవికి పంపించాడంటూ శ్రీరామవరం గ్రామానికి చెందిన కామిరెడ్డి నానీని ఈ కేసులో ఎ–2గా చేర్చారు. 

త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌ వద్ద ఉద్రిక్తత 
కామిరెడ్డి నానీకి ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి 12.16 గంటలకు పెళ్లయ్యింది. 23వ తేదీ మధ్యాహ్నం తన స్వగృహంలో రిసెప్షన్‌ ముగించుకుని, సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ద్వారకాతిరుమల మండలం వెంకటకృష్ణాపురంలోని అత్తగారింటికి వెళ్లాడు. ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు శనివారం మూడు కార్లలో వచ్చి నానీని బలవంతంగా అరెస్టు చేసి తొలుత ద్వారకాతిరుమల స్టేషన్‌కు, ఆ తర్వాత త్రీటౌన్‌ స్టేషన్‌కు తరలించారు. జీపులో అతడిపై చెయ్యి చేసుకున్నట్టు సమాచారం. నానీ అరెస్టు వార్త తెలిసిన వెంటనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. నానీని అరెస్టు చేసి తీసుకొచ్చిన జీపును చుట్టుముట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ అక్కడికి చేరుకున్న దెందులూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరితో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చే కేసులో కూడా పోలీసులు చేస్తున్న ఓవరాక్షన్‌ విమర్శలకు దారితీస్తోంది. 

వివాహమై 12 గంటలు కాకముందే.. 
వివాహమై 12 గంటలైనా కాకముందే తన కుమారుడిని అరెస్టు చేయడం పట్ల నానీ తండ్రి ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను బూతులు తిట్టిన వారిని వదిలేసి,  తన కుమారుడిని అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చింతమనేని కక్షగట్టి తన కుమారుడిని అరెస్టు చేయించారని ఆనంద్‌బాబు ఆరోపించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top