గజరాజులు జనావాసాల్లోకి వచ్చి ఆస్తి, ప్రాణ నష్టం కలగజేస్తున్నా.. వాటి తరలింపునకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు.
హిరమండలం: గజరాజులు జనావాసాల్లోకి వచ్చి ఆస్తి, ప్రాణ నష్టం కలగజేస్తున్నా.. వాటి తరలింపునకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఒడిశాలోని లఖేరి అడవుల నుంచి శ్రీకాకుళం జిల్లాలోకి ఏనుగులు ప్రవేశించి గిరిజనులను భయాందోళనలకు గురిచేస్తున్నాయన్నారు. సీతంపేట, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు, భామిని మండలాల్లో ఏనుగుల కదలికలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.
గిరిజనుల పంటలు, తోటలను ధ్వంసం చేసి తీవ్ర నష్టాన్ని కల్గిస్తున్నాయని, ఇంత జరుగుతున్నా వాటిని తరలించే చర్యలను తీసుకోవడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. ఇప్పటి వరకు 14మందిని ఏనుగులు పొట్టన పెట్టుకున్నా.. ప్రభుత్వ సహాయం అంతంత మాత్రంగానే ఉందన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎమ్మెల్యే కలమట వెంకరమణమూర్తి గాని, అధికారులుగానీ చర్యలు తీసుకోకపోవడం శోఛనీయమన్నారు. తక్షణమే ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.