మూడో విడత..నిధులు మడత

Womens Problems In TDP Government - Sakshi

సాక్షి కడప : పోలింగ్‌కు ముందు ఓట్ల కోసం ఎన్నో ఫీట్లు చేసిన టీడీపీ సర్కార్‌ తర్వాత దాని గురించి మరిచిపోయింది. మహిళలు పదేపదే తిరుగుతున్నా పట్టించుకునే వారు లేరు. సాంకేతిక కారణాలైనా...ఆధార్‌ సమస్య అయినా.. బ్యాంకుల్లో వడ్డీ కింద జమ చేసుకుంటున్నా అడిగేవారు లేకపోవడంతో వారి వేదన అరణ్య రోదనగా మారింది. పోలింగ్‌  ముగిసి నెల రోజులయినా మూడో విడత పసుపు–కుంకుమ నిధుల విషయంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. మహిళలు నిలదీస్తున్నా స్పందించేవారు లేరు. పోలింగ్‌కు ముందు కూడా నగదు విషయమై మైదుకూరులో మహిళలు బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. పసుపు–కుంకుమ పేరుతో ఒక్కో డ్వాక్రా సభ్యురాలికి రూ.10 వేలు ప్రకటించి మూడు విడతలుగా అందజేస్తున్న సొమ్ము కు సంబం ధించి మహిళలు సవాలక్ష ఆంక్షలు అధిగమించి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ముప్పతిప్పలు
జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖతోపాటు మున్సి పాలిటీలలో పట్టణాభివృద్ధి్ద శాఖ ఆధ్వర్యంలో సుమారు 49 వేల స్వయం సహాయక గ్రూపులు ఉండగా, అందులో దాదాపు 4.90 లక్షల మంది వరకు సభ్యులు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం పసుపు–కుంకుమ కింద మూడు విడతల్లో రూ. 450 కోట్ల మేర నిధులను కేటాయించింది. అందుకు సంబంధించి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కేటాయించిన తేదీల్లో చెక్కులను అందించారు. అప్పటికప్పుడు చాలామందికి అందకపోవడం.... అందినా మొత్తాలు పడకపోవడం తదితర సమస్యలతో  ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికీ పసుపు–కుంకుమ మూడవ విడతకు సంబంధించి     స్థానిక వెలుగు కార్యాలయాలతోపాటు జిల్లా కేంద్రమైన కడపలోని డీఆర్‌డీఏ కార్యాలయానికి కూడా వచ్చి డబ్బుల విషయమై ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక ప్రాంతం నుంచి వచ్చి నిధుల విషయం అడుగుతున్న సందర్భాలు కనిపిస్తూనే ఉన్నాయి. మూడవ విడతకు మహిళలకు సంబంధించి ముప్పుతిప్పలు తప్పడం లేదు.

సాంకేతిక కారణాలు....ఆధార్‌ సమస్యలు
మూడవ విడత పసుపు–కుంకుమకు సంబంధించి సాంకేతిక కారణాలతోపాటు ఇతర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిసింది. కొందరు మహిళలు గ్రూపుల నుంచి తప్పుకోగా, కొత్తవారు గ్రూపులో చేరుంటారు. అలాంటి గ్రూపుల్లో సమస్యలు ఏర్పడుతుండగా....మరికొందరు మహిళలకు రెండుచోట్ల ఆధార్‌కార్డుల సమస్య...కొన్నిచోట్ల అప్‌డేట్‌ కాకపోవడం...ఇతర అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పసుపు–కుంకుమ నిధుల కోసం నిరీక్షించే మహిళా సభ్యులు దాదాపు 400 నుంచి 500 మంది ఎదురుచూస్తున్నారు. సమస్యలను అధిగమించిన తర్వాత ఎప్పుడు సొమ్ములు వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

అధికారుల వద్దకు మహిళలు
మైదుకూరు నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి పలు సమస్యలు ఎదురు కావడంతో అధికారుల వద్దకు వచ్చి గట్టిగా నిలదీశారు.  ఇటీవల చాపాడు మండలంలోని అనంతపురం గ్రామానికి చెందిన పలువురు డ్వాక్రా మహిళలు వచ్చి పసుపు–కుంకుమ సొమ్ములు ఎందుకు వేయలేదంటూ అధికారులను ప్రశ్నించారు. సుమారు ఎనిమిది గ్రూపులకు పడలేదంటూ వారు అధికారులతో వాదించారు. దీంతో అప్పటికప్పుడు చెక్కులను అధికారులు అందించారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లోని కొంతమందికి ఇంకా మూడవ విడత సొమ్ములు అందలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల తంతు ముగిసినా...ముందస్తే అందాల్సిన సొమ్ములు ఇప్పటికీ పడకపోవడంతో ముప్పుతిప్పలు తప్పడం లేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top