ఇక్కడెలా పని చేస్తావో చూస్తా..!

Women Estate Officer Harassment On AMC chairman - Sakshi

మహిళ ఎస్టేట్‌ అధికారిపై ఏఎంసీ చైర్మన్‌ చిందులు

సాక్షి ప్రతినిధి,ఏలూరు  : ఇక్కడ ఎలా పని చేస్తావో.. త్వరలోనే నీ అంతు చూస్తా.. అంటూ  ఎస్టేట్‌ మహిళా అధికారిపై ఏఎంసీ చైర్మన్‌  చిందులు వేశాడు. ఆదివారం స్థానిక ఫత్తేబాద్‌ రైతు బజారులో రైతులు, ఎస్టేట్‌ అధికారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.  దాంతో కొందరు రైతులు  ఏఎంసీ చైర్మన్‌ పూజారి నిరంజన్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకున్నారు. రైతులతో తరచూ గొడవలు ఎందుకు పడుతున్నావంటూ ఎస్టేట్‌ అధి కారిని గట్టిగా నిలదీశారు.

 ఏఎంసీ చైర్మన్, రైతుబజారులో కొందరు కలిసి తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఎస్టేట్‌ అధికారి శ్రీలత ఆరోపించారు. తనపై దౌర్జన్యం చేసేందుకు ఏఎంసీ చైర్మన్‌ నిరంజన్‌  సొంత మనుషులతో వచ్చారన్నారు. ఆమె టూటౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఎస్టేట్‌ అధికారి శ్రీలత మాట్లాడుతూ  తనను కావాలని వేధింపులకు గురి చేస్తున్నారని, రైతు బజారులో ఓ సామాజిక వర్గానికి చెందిన వారికి నచ్చిన చోట కూరగాయల విక్రయానికి షాపులు ఇవ్వాలని తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, నిబంధనల ప్రకారం పని చేస్తున్నందుకు తనను బదిలీ చేయించాలని తప్పుడు సంతకాలతో ఉన్నతాధికారులకు  ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. 

హోల్‌సేల్‌ వ్యాపారి అయిన ఆ ప్రజాప్రతినిధి  దగ్గర బంధువు చెప్పినట్టుగా  ధరల పట్టిక పెట్టాలని  ఒత్తిడి చేస్తున్నారని, దానివలన వినియోగదారులు నష్టపోతారని తాను నిరాకరించడంతో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు.  ఓ మహిళ అధికారితో మాట్లాడాల్సినట్టుగా ఏఎంసీ చైర్మన్‌ మాట్లాడడం లేదని, తన అంతూ చూస్తానంటూ హెచ్చరించారని  ఆమె వాపోయారు.  రైతుబజారులో కొందరు ఓ వర్గంగా ఏర్పడి  తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎస్టేట్‌ అధికారి శ్రీలత పేర్కొన్నారు. 

రైతు సంక్షేమం కోసం రైతు బజారు 
దళారి వ్యవస్థను రూపుమాపేందుకు , రైతు సంక్షేమం కోసమే రైతుబజార్లు ఏర్పాటు చేశారని ఏఎంసీ చైర్మన్‌ పూజారి నిరంజన్‌ అన్నారు.  ఎస్టేట్‌  అధికారి తమను  వేధింపులకు గురి చేస్తున్నారని రైతులు తనకు ఫిర్యాదు చేశారని, దీనిపై అధికారిని వివరణ కోరానని, విచారణ చేసి రైతులను వేధింపులకు గురి చేసినట్లుగా రుజువైతే  సదరు అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top