
అన్నవరం(ప్రత్తిపాడు): ఆ కుటుంబ సభ్యులు సత్యదేవుని దర్శనానికి వచ్చారు. వ్రతమాచరించి, స్వామి వారిని దర్శించుకున్నారు. రత్నగిరిపై సరదాగా గడిపారు. అనంతరం తిరుగు ప్రయాణంలో అన్నవరం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. త్వరగా ప్లా్లట్‌ఫాంకు చేరుకోవాలనే ఆత్రుతతో పట్టాలు దాటే ప్రయత్నంలో ఆ కుటుంబంలోని ఓ మహిళను రైలు ఢీకొట్టింది. అన్నవరం రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు జరిగిన ఈ దుర్ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన గాదె కిరణ్‌కుమార్, విజయరాజ్యలక్ష్మి(42) దంపతులు తమ ఇద్దరు పిల్లలు, అత్తా మామతో కలిసి శుక్రవారం సాయంత్రం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో అన్నవరంలో దిగి రత్నగిరి సత్యదేవుని ఆలయానికి చేరుకున్నారు.
వారు కుటుంబ సమేతంగా శనివారం స్వామివారి వ్రతమాచరించి, దర్శనం చేసుకున్నారు. శనివారమంతా వారందరూ రత్నగిరిపైనే గడిపి ఆదివారం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి తమ స్వగ్రామం వెళ్లేందుకు అన్నవరం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. చిన్న పిల్లలు ఇద్దరు, అత్తా మామ ఫ్లైఓవర్ బ్రిడ్జి ద్వారా మూడో నంబర్ ప్లాట్‌ఫాంకు చేరుకున్నారు. కిరణ్‌కుమార్, విజయరాజ్యలక్ష్మి మాత్రం పట్టాలు దాటి మూడో నెంబర్ ఫ్లాట్‌ఫాం ఎక్కడానికి ప్రయత్నించారు. ముందు కిరణ్‌కుమార్ ప్లాట్‌ఫాం ఎక్కగా, ఆయన వెనుక విజయరాజ్యలక్ష్మి ఎక్కే ప్రయత్నం చేసింది. అయితే విశాఖపట్నం వైపు వెళుతున్న లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా దూసుకువచ్చి ఆమెను ఢీ కొట్టడంతో, ఆమె శరీరం ఛిద్రమై అక్కడి కక్కడే మృతి చెందింది. దీంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. విజయరాజ్యలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తుని రైల్వే ఎస్సై రోహిణీపతి ఆదివారం సాయంత్రం తెలిపారు.