ఈ నీళ్లు తాగి ఇదిగో రోగాలొస్తున్నాయయ్యా..ఆది వెనకబడిన ప్రాంతాల్లో మహిళల ఆవేదన. పిం ఛన్ కూడా అందడం లేదు సామీ..
ఆత్మకూరు, న్యూస్‌లైన్: ఈ నీళ్లు తాగి ఇదిగో రోగాలొస్తున్నాయయ్యా..ఆది వెనకబడిన ప్రాంతాల్లో మహిళల ఆవేదన. పిం ఛన్ కూడా అందడం లేదు సామీ.. మీరైనా మా గోడు ఆలకించడయ్యా.. ఓ వృద్ధురాలి వేడుకోలు. గ్రామస్థాయిలో ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూస్తూ ఆత్మకూరు సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి పాదయాత్ర ముందుకు సాగుతోంది. గురువారం నాటికి గౌతమ్‌రెడ్డి పాదయాత్ర 250 కిలోమీటర్ల మైలురాయిని దాటింది.
ఏఎస్‌పేట మండలం హసనాపురం నుంచి గత నెల 22న మేకపాటి గౌతమ్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. ఏఎస్‌పేట, ఆత్మకూరు మండలంలోని ఆరవీడు, వెన్నవాడలో గౌతమ్‌రెడ్డి పాదయాత్ర పూర్తయింది. మర్రిపాడు మండలంలో పాదయాత్ర కొనసాగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఆయన దృష్టికి వస్తున్నాయి.
పింఛన్లు అందని వృద్ధుల అవస్థలు చూసి చలించిపోయారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ ఓ వైపు అధికార పార్టీ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. గ్రామ స్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటుండటం చూసి ఇదేనా అభివృద్ధి అంటూ ప్రశ్నించి ప్రజల నుంచే సమాధానాలు రాబడుతున్నారు. దీంతో గ్రామస్థాయిలో పాదయాత్రకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు.300 కిలోమీటర్లకు పాదయాత్ర చేరువవుతోంది. రాత్రి పూట గ్రామాల సమీపంలోనే టెంట్లు వేసుకుని నిద్రించడం, ఉదయాన్నే స్థానికులతో కాసేపు ముచ్చట్లు సాగిస్తూ గౌతమ్‌రెడ్డి ఆకట్టుకుంటున్నారు. పాదయాత్రలో అనుభవాలు ఆయన ‘న్యూస్‌లైన్’తో పంచుకున్నారు.
ఆ అనుభవాలు ఆయన మాటల్లోనే..
80 శాతం ప్రజలు పల్లెల్లోనే జీవిస్తున్నారు. వారు బాగుంటేనే దేశం బాగుంటుంది. 250 కిలోమీటర్ల పాద యాత్రలో ముఖ్యంగా నాలుగు సమస్యలు గుర్తించా. తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, మరో ముఖ్యమైన సమస్య మరుగుదొడ్లు. ఆ నాలుగు సమస్యలు పరిష్కారం అయితేనే ఒక గ్రామం అభివృద్ధి సాధించినట్లు. అయితే నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా ఈ నాలుగు సమస్యలే ప్రముఖంగా కన్పిస్తున్నాయి. సొంత నిధులు వెచ్చించి నియోజకవర్గంలో అక్కడక్కడా శుద్ధిజలప్లాంట్లు ఏర్పాటు చేశాం. ఏఎస్‌పేట మండలం కొత్తపల్లి, మర్రిపాడు మండలం ఇస్కపల్లిలో ఇప్పటికే శుద్ధిజలప్లాంట్లు ఏర్పాటు చేశాం. ఇంకా మరికొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడంలేదు. ప్రజాసేవ చేసేందుకు కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు. పాదయాత్రతో చాలా పాఠాలే నేర్చుకున్నా. సహనం అలవడింది. ఏ పల్లె కెళ్లినా ప్రజలు తమ బిడ్డలా ఆదరిస్తున్నారు. వారి ఆదరణ చూస్తే ఒళ్లు పులకించిపోతోంది. కాళ్లకు బొబ్బ లెక్కినా ప్రజాదరణ ముందు అదేమీ సమస్య అనిపించడంలేదు. పాదయాత్ర ప్రారంభించినప్పుడు రకరకాల మాటలన్నవారున్నారు. ఇప్పుడు వారే అభినందిస్తున్నారు.
ఎన్ని సమస్యలు ఎదురైనా షెడ్యూల్ ప్రకారం పాద యాత్ర పూర్తి చేస్తా. పాదయాత్రకు జగనన్నే స్ఫూర్తి. ప్రజల ఆదరణ, ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. వారి ఆశీర్వాదంతోనే ముందుకు కదులుతున్నా. ఒక విధంగా వైఎస్సార్‌కాంగ్రెస్ అధినేత నాకు గురువు. ఆయన అడుగు జాడల్లోనే నడుచుకుంటా. పార్టీ ఆశయాలు కొనసాగిస్తా అంటూ ఆయన పాదయాత్ర సాగించారు.