హామీలపై నిలదీస్తారనే భయంతో సభను పక్కదారి పట్టిస్తున్నారు | Sakshi
Sakshi News home page

హామీలపై నిలదీస్తారనే భయంతో సభను పక్కదారి పట్టిస్తున్నారు

Published Sun, Aug 24 2014 1:55 AM

With the fear of misleading the House unsecured niladistarane

హనుమాన్ జంక్షన్ రూరల్  : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై చర్చకు వస్తే ఇరుకున పడతామనే భయంతోనే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు శాసనసభను పక్కదారి పట్టిస్తున్నారని వైఎస్సార్ సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిపై అర్థంలేని ఆరోపణలు చేస్తూ సభా సమయాన్ని వృథా చేస్తున్నారని, ఈ కుట్రను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. మూడు నెలలుగా ప్రభుత్వ ప్రోత్సాహంతో జరిగిన 11 హత్యలపై విచారణ చేపట్టాలని, హత్యకు గురైన వ్యక్తుల కుటుంబాలను ఆదుకోవాలని జగన్‌మోహన్‌రెడ్డి సభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. ఈ విషయంపై చర్చ జరుగుతుండగానే గుంటూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒక వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హత్యకు గురవడం విచారకరమన్నారు.

ఇంత జరగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సమర్థించాలని అధికారులకు ఆదేశాలివ్వడం దారుణమన్నారు. వంగవీటి మోహనరంగా హత్య అనంతరం వేలాది మంది కాపులపై దాడులు చేసి హత్యలకు పాల్పడటంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలైన విషయం వాస్తవం కాదా.. అని దుట్టా ప్రశ్నించారు. అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే హత్యలపై కేసులు నమోదుచేసి విచారించే అవకాశం ఉన్నప్పుడు అనవసర రాద్దాంతం చేయడం ఎందుకుని నిలదీశారు.

గొట్టుముక్కలలో ఆలోకం కృష్ణారావు హత్య ఉదంతం వెనుకు మంత్రి దేవినేని ఉమ హస్తం ఉందని ఆరోపించారు. పోలీసులు కూడా ఆ కేసు విచారణలో మీనమేషాలు లెక్కించడం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతిపక్ష నాయకుడికి సభలో మాట్లాడే హక్కు కల్పించకపోవడంతోనే వాకౌట్ చేయాల్సి వచ్చిందని వివరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి హత్యలపై విచారణ చేపట్టి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని దుట్టా రామచంద్రరావు కోరారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement