విజయవాడ గ్రేటర్ అవుతుందా?

విజయవాడ గ్రేటర్ అవుతుందా? - Sakshi


ఇప్పటికైనా విజయవాడ గ్రేటర్ నగరంగా మారుతుందా.. నగర ప్రజలను ఆలోచింపజేస్తున్న అంశమిది. ఐదేళ్లుగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ స్వార్థం కోసం విజయవాడ నగరాన్ని గ్రేటర్ కాకుండా అడ్డుకున్నారు. విజయవాడకన్నా చాలా చిన్న నగరమైన వరంగల్ కూడా గ్రేటర్‌గా మారిపోయింది. విజయవాడ మాత్రం అలాగే మిగిలిపోయింది. రాష్ట్రం విడిపోయి రాజధాని కోసం పోటీ పడుతున్న తరుణంలోనైనా గ్రేటర్ చేస్తారా.. లేదా అన్న సందేహాలు నగర ప్రజల్లో ఉన్నాయి.         

 

సాక్షి,  విజయవాడ : హైదరాబాద్, విశాఖపట్నం తర్వాత ఆ స్థాయి గుర్తింపు ఉన్న నగరం విజయవాడ. ఇప్పటికే గ్రేటర్‌గా మారిన హైదరాబాద్, విశాఖ నగరాలు మాత్రం ఎన్యూఆర్‌ఎం నిధుల్లో తన వాటాకు సరిపడా ఆర్థిక వనరులు సమకూర్చుకోగలిగాయి. విజయవాడ నగరం మాత్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని దుస్థితి. గ్రేటర్ ప్రతిపాదనను గత ఎంపీ రాజగోపాల్  తీవ్రంగా వ్యతిరేకించారు.



ప్రతిపాదిత పద్ధతిలో విజయవాడ గ్రేటర్‌గా మారితే కార్పొరేషన్‌లో తమ పట్టుపోతుందనే భయంతో కాంగ్రెస్ నాయకులు గ్రేటర్‌కు మోకాలడ్డారు. దీంతో కార్పొరేషన్‌కు ఆదాయవనరులు పరిమితంగానే ఉండిపోయాయి. మరోవైపు ఇళ్ల నిర్మాణానికి, ఆఖరికి చెత్తను డంపింగ్ చేయడానికి కూడా స్థలం చాలని పరిస్థితి విజయవాడ నగరపాలక సంస్థకు ఏర్పడింది. మొదట్లో  గ్రామపంచాయతీల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను సాకుగా చూపించారు. తర్వాత వాటి పాలకవర్గాలు రద్దయి మూడేళ్లపాటు ప్రత్యేక పాలనలో ఉన్నా నిర్ణయం తీసుకోలేదు.



మళ్లీ ఇప్పుడు పంచాయతీలకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటికి ఎన్నికలు జరిగి ఏడాది కూడా కాలేదు. ఈ నేపథ్యంలో విజయవాడను గ్రేటర్‌గా చేయడానికి కోర్టు అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. 2005 తర్వాత కౌన్సిల్‌లో రెండుసార్లు తీర్మానాలు చేసి పంపించారు.  పంచాయతీల కాలపరిమితి ముగిసిన తర్వాత గ్రేటర్ విజయవాడకు ఆమోదం తెలుపుతూ కూడా తీర్మానం చేసింది.  



ఒక దశలో కార్పొరేషన్ అధికారులు తమ భవనాలను కూడా భవిష్యత్ అవసరాలకు విస్తరించేందుకు సిద్ధం అయ్యారు. గ్రేటర్ అయితే కలిసే ప్రాంతాలను గుర్తించి మ్యాప్ కూడా సిద్ధం చేశారు. గ్రేటర్ విజయవాడ అయితే జనాభా నాలుగో వంతు పెరిగినా విస్తీర్ణం మాత్రం రెండు రెట్లు పెరుగుతుంది. విజయవాడ నగరానికి చుట్టుపక్కల ఉన్న 15 గ్రామాలను కలిపి గ్రేటర్ విజయవాడగా చేయాలని అధికార యంత్రాంగం భావించింది.  



కానూరు, యనమలకుదురు, తాడిగడప, పోరంకి, నిడమానూరు, దోనేఆత్కూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు, నున్న, పాతపాడు, ఫిర్యాది నైనవరం, అంబాపురం, జక్కంపూడి, గొల్లపూడి గ్రామాలను నగరంలో కలపాలని నిర్ణయించారు. ప్రస్తుతం విజయవాడ విస్తీర్ణం కేవలం 61,88 చదరపు కిలోమీటర్లు మాత్రమే. గ్రేటర్‌గా మారితే విజయవాడ విస్తీర్ణం 189.37 కిలోమీటర్లు అవుతుంది.  ఒక దశలో గ్రేటర్ పరిధిని 43 గ్రామాలకు పెంచి గన్నవరం, కంకిపాడు వరకూ విస్తరించడానికి కసరత్తు జరిగింది.  



ప్రస్తుతం నగర జనాభా 10.5 లక్షలు. 43 గ్రామాలతో గ్రేటర్ విజయవాడను ఏర్పాటుచేస్తే జనాభా 15 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. గన్నవరంలో ఎయిర్‌పోర్టు ఉన్న నేపథ్యంలో మహానగరంలో దాన్ని కలిపేందుకు ప్రయత్నాలు చేశారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం, పాలకపక్షం చిత్తశుద్ధితో గ్రేటర్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయవాడ నుంచి గ్రేటర్ ప్రతిపాదన ఆయన ముందు పెడతామని చెబుతున్నారు. ఆచరణలో ఎంతవరకు సాధ్యమో చూడాలి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top