ఓ భార్య - ప్రియుడు - భర్త హత్య | Wife kills husband with lover's help | Sakshi
Sakshi News home page

ఓ భార్య - ప్రియుడు - భర్త హత్య

Oct 12 2013 3:03 AM | Updated on Sep 1 2017 11:34 PM

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి చంపించింది. అనంతరం అతడితో కలిసి పరారైంది.

మొయినాబాద్ (హైదరాబాద్), న్యూస్‌లైన్ :వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి చంపించింది. అనంతరం అతడితో కలిసి పరారైంది. గత నెలలో జరిగిన ఈ హత్య మిస్టరీని మొయినాబాద్ పోలీసులు ఛేదించారు. శుక్రవారం స్థానిక ఠాణాలో రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డి, సీఐ రవిచంద్ర విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు.
 
తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరం మండలం నల్లచెరువు పుంతకి చెందిన రాయుడు సోమరాజు(30), కనకదుర్గాదేవి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి రాజేంద్రనగర్ మండలం మణికొండకు ఏడాది క్రితం వలస వచ్చారు. పంచవటి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సోమరాజు వాచ్‌మన్‌గా పని చేస్తుండగా, కనకదుర్గాదేవి అదే అపార్ట్‌మెంట్‌లోని కొన్ని ఇళ్లల్లో పనిచేస్తోంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే ఓ న్యాయవాది కారును రాజేంద్రనగర్ మండలంలోని సన్‌సిటీకి చెందిన గౌతంకుమార్ నడుపుతున్నాడు. ఈక్రమంలో కనకదుర్గాదేవి, గౌతంకుమార్ మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం సోమరాజుకు తెలిసి కొన్నిసార్లు భార్యను మందలించినా ఫలితం లేకుండా పోయింది.
 
అడ్డుగా ఉన్నాడని..
తమకు సోమరాజు అడ్డుగా ఉన్నాడని కనకదుర్గాదేవి ప్రియుడు గౌతంకుమార్‌కు చెప్పింది. దీంతో ఎలాగైనా సోమరాజు అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన తుప్పుడు గోపాల్(50) తన భార్యాపిల్లలతో హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని జ్యోతినగర్‌లో ఉంటున్నాడు. గోపాల్ భార్య సన్‌సిటీలో ఉండే గౌతంకుమార్ ఇంట్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో గోపాల్‌తో గౌతంకుమార్‌కు పరిచయం ఏర్పడింది. గతనెల సెప్టెంబర్ 2న గౌతంకుమార్ రూ.3 వేలు గోపాల్‌కు ఇచ్చి సోమరాజు హత్యకు సహకరించాలని కోరాడు. అదే రోజు మద్యం తాగుదామని ఇద్దరూ కలిసి సోమరాజును సన్‌సిటీకి తీసుకొచ్చారు. బండ్లగూడ సమీపంలో కూర్చుని మద్యం తాగారు. అనంతరం మొయినాబాద్ వైపు తీసుకొచ్చి అజీజ్‌నగర్ వద్ద తిరిగి మద్యం తీసుకుని ముర్తూజగూడ సమీపంలో సురంగల్ రెవెన్యూలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. మద్యం తాగిన తర్వాత గౌతంకుమార్.. సోమరాజు గొంతు నులమడంతో అతడు కిందపడిపోయాడు. వెంటనే గోపాల్ ఓ రాయితో సోమరాజు తలపై మోదాడు. ఆ తర్వాత గౌతంకుమార్ రాయితో బాది సోమరాజును హతమార్చాడు.
 
హత్య తర్వాత.. భర్త హత్య జరిగాక గౌతంకుమార్‌తో కలిసి కనకదుర్గాదేవి విశాఖపట్నం పరారైంది. అదే రోజు స్థానికుల సమాచారంతో సెప్టెంబర్ 2న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. తన కుమారుడు కనిపించడం లేదని అదే రోజు సోమరాజు తండ్రి వెంకటేశ్వరరావు రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. రెండు చోట్ల కేసులు నమోదు కావడంతో హతుడు సోమరాజేనని పోలీసులు గుర్తించారు. అప్పటికే కనకదుర్గాదేవి, గౌతంకుమార్ అదృశ్యమవడంతో వారే సోమరాజును హతమార్చి ఉంటారని అనుమానించారు. శుక్రవారం నిందితులు రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తాలో అనుమానాస్పదంగా కనిపించడంతో మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారణ చేయగా, తమ నేరం అంగీకరించారు. నిందితులతో పాటు గోపాల్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement