‘పులస’ ముక్క పంటికి తగిలితే..ఆహా..

Why Godavari  Pulasa Fish Magic Spreads - Sakshi

ఖండాంతరాలు దాటి వచ్చే చేప పునరుత్పత్తి కోసం 11 వేల నాటికల్‌ మైళ్ల ప్రయాణం

 పసిఫిక్‌ టు గోదావరి.. వయా హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం

వరద గోదారిలోనే లభ్యం     కేజీ ధర రూ. ఐదారు వేల వరకు..

అయినప్పటికీ తినాల్సిందేనంటున్న మాంసాహార ప్రియులు

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అది అన్ని చేపల్లాంటిదీ కాదు. దాని రాక, పుట్టుక.. రుచి, ధర.. అన్నీ ప్రత్యేకమే. ఏడాదికోసారి మాత్రమే.. అదీ ఈ సీజన్‌లోనే.. అందునా వరద గోదావరిలోనే.. అది కూడా ధవళేశ్వరం బ్యారేజి నుంచి సాగరసంగమం వరకు ఉన్న పాయల్లోనే దొరికే చేప. పేరు ‘పులస’. ఆ పేరు వింటేనే మాంసాహార ప్రియుల నోట్లో నీరూరుతూంటుంది. వండిన తరువాత ఆ ముక్క పంటికి తగిలితే.. ఆ రుచికి నాలుక వహ్వా అంటుంది. జీవితంలో ఒకసారి పులస రుచి చూస్తే ఏటా లొట్టలేసుకుని తినాలి్సందే.అత్యంత ఖరీదైన డిష్‌ ఈ పులస చేప. కిలో పులస కావాలంటే ఐదారు వేల రూపాయలు పెట్టాల్సిందే. అయినప్పటికీ ‘పుస్తెలు అమ్మి అయినా సరే పులస తినాలి్సందే’నని గోదావరి జిల్లాల్లోని మాంసాహార ప్రియులు అంటారు. ‘పులస’ నేపథ్యం ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.

పునరుత్పత్తి కోసం..
పసిఫిక్‌ మహాసముద్రం ప్రాంతంలోని ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్‌ తదితర దేశాల సముద్ర జలా ల్లో జీవించే ఈ పులసను క్యుఫిడే కుటుంబానికి చెం దిన కార్డేటాగా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. పులస ప్రజాతి హిల్సా. జాతి ఇల్సా. ఈ ‘ఇల్సా’ కాస్తా  సముద్రంలో ఉన్నప్పుడు ‘విలస’గా.. గోదావరిలోకి ప్రవేశించాక ‘పులస’గా మారుతుంది. ఈ చేపలు పునరుత్పత్తి కోసం పసిఫిక్‌ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మీదుగా.. సుమారు 11 వేల నాటికల్‌ మైళ్లు ప్రయాణించి గోదావరిలోకి వలస వస్తాయి. 

ఇందుకోసం అవి 30 నుంచి 40 రోజుల పాటు జీవ గడియారం (బయోలాజికల్‌ క్లాక్‌) ఆధారంగా ఏకధాటిగా ప్రయాణిస్తాయి. సైబీరియా పక్షులు, ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల మాది రిగానే.. పులసలు కూడా పునరుత్పత్తి కోసం వేల కిలోమీటర్ల దూరాన్ని అలవోకగా అధిగమించి.. ఏటా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో గోదావరి నదికి ఎర్రనీరు (వరద) వచ్చే సమయానికి గుడ్లు పెట్టడానికి వలస వస్తాయి. ఆడ, మగ పులసలు గోదావరిలో ఇసుక, గులక రాళ్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సంగమించి గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు ఒకటి రెండు రోజుల్లోనే చేప పిల్లలుగా ఎదుగుతాయి. పులస చేప పిల్లలను ‘జట్కా’ అని పిలుస్తారు. పునరుత్పత్తి పూర్తయ్యాక వచ్చిన సముద్ర మార్గంలోనే సంతానం(జట్కాలు)తో కలిసి తిరిగి వచ్చిన చోటకే వెళ్లిపోతాయి. ఇందుకు మరో నెల రోజులు సమయం పడుతుంది. వీటిల్లో కొన్ని గోదావరిలో వలలకు చిక్కి, మత్స్యకారులకు సిరులు కురిపిస్తాయి. ఇవి ఉభయ గోదావరి జిల్లాల్లోని గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ట గోదావరి పాయల్లో మాత్రమే లభిస్తాయి.

100 కి.మీ. వేగంతో.. ఏటికి ఎదురీదుతూ..
గోదావరికి వరదలు వచ్చే జూలై చివరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు పులసలు లభిస్తాయి. కొన్ని సార్లు సెప్టెంబర్‌లో కూడా దొరుకుతాయి.. సముద్రం నుంచి గోదావరిలోకి ప్రవేశించాలంటే అవి ఏటికి ఎదురీదుకుంటూ రావాలి్సందే. మహోగ్ర వడితో పరవళ్లు తొక్కే వరద గోదావరికి ఎదురీదడమంటే మాటలు కాదు. అందుకు తగినట్టుగానే పులసలు 100 కిలోమీటర్ల వేగంతో గోదావరికి ఎదురీదుతాయి. గోదావరి జిల్లాల్లో సముద్ర ముఖద్వారం నుంచి గోదావరి నదిలో సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అంత దూరం అంత వేగంతో ఎదురీదడంతో ఈ చేపల్లో కెమికల్‌ రియాక్షన్‌ విపరీతంగా జరిగి దీని కండరాల్లో ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. పులసలకు స్వేదగ్రంధులు ఉండవు.  మామూలుగా చేపల్లో ఒమేగా–3 పేట్రియాసిడ్స్‌ (ఆమ్లాలు) ఉంటాయి. కానీ ఈ ఆమ్లాలు పులసల్లో మూడు రెట్లు అధికంగా ఉంటాయని, అందువల్లనే వీటికి మంచి రుచి వస్తుందని చెబుతారు.

నకిలీల బెడద
మాంసాహార ప్రియులు ఎంతగానో ఇష్టపడి తినే ఈ పులసలకు కూడా నకిలీల బెడద తప్పడం లేదు. పులసలపై అవగాహన ఉన్న గోదావరి వాసులు నకిలీ పులసలను సులువుగా గుర్తిస్తున్నారు. గోదావరిలో దొరికే పులస దిగువన చర్మం బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది. అదే ఒడిశా నుంచి వచ్చే నకిలీ పులస చర్మం కొద్దిగా ఎరుపు రంగులో ఉన్నా మెరుపు ఉండదు. కేజీ బేసిన్‌లో చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం జరుగుతున్న డ్రిల్లింగ్‌ కారణంగా జలకాలుష్యం పెరిగిపోవడం వలన గోదావరిలో పులసల రాక తగ్గుతోందని చెబుతున్నారు. సముద్ర గర్భంలో రిగ్గింగ్, బ్లాస్టింగ్‌ వంటి కార్యకలాపాల వల్ల  ఈ చేపల వలసలు తగ్గాయని మత్స్యకారులు అంటున్నారు.

ఆరోగ్యానికి మేలు
కేవలం రుచే కాదు.. ఆరోగ్యానికి కూడా పులస ఎంతో మేలు చేస్తుంది. ఒమేగా–3, ఒమేగా–6 ఫ్యా టీ ఆమ్లాలు అధికంగా ఉన్నందువలన పులస ఆరో గ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. గర్భిణులకు పులస ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతా రు. ఈ చేప తినడం గుండెకు మంచిదని అంటారు. సముద్ర ముఖద్వారం నుంచి బయలుదేరే పులస.. గోదావరిలో ఎంత దూరం ఎదురీదితే రుచి అంతగా ఉంటుంది. అందుకే సాగర సంగమ ప్రదేశాలైన యానాం, బోడసకుర్రు తదితర ప్రాంతాల్లో కంటే అఖండ గోదావరి (ధవళేశ్వరం బ్యారేజీ) వద్దకు వెళ్లే చేప రుచి, పరిమాణం ఎక్కువగా ఉంటాయి. దీనికి తగినట్టుగానే ధవళేశ్వరం, బొబ్బర్లంక, ఊబలంక తదితర ప్రాంతాల్లో లభించే చేపల ధర కూడా కిలో రూ.5 వేల నుంచి రూ.6 వేలు ఉంటుంది. వరదల సీజన్‌లో మాత్రమే దొరికే అరుదైన పులసల కోసం  ధరతో నిమిత్తం లేకుండా మరీ ఎదురు చూస్తారు. మార్కెట్‌లోకి వచ్చిందంటే చాలు.. ఈ చేప క్షణాల్లో అమ్ముడైపోతుందంటే దీనికి ఎంత డిమాండ్‌ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

గర్భిణులకు ఎంతో మేలు
ఆరోగ్యానికి పులస ఎంతో తోడ్పడుతుంది. ముఖ్యంగా గర్భిణులకు ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా అవసరమవుతాయి. ఇవి మిగిలిన జలచరాల కంటే పులస చేపలో ఎక్కువగా ఉంటాయి. గోదావరికి ఎదురీదటంతో సహజ సిద్ధంగా జనించే ఆమ్లాలు పులసలో రుచికి ప్రత్యేక కారణంగా చెప్పవచ్చు. వరద గోదావరిలో లభించే ప్రత్యేక ఆహారం కోసమే అవి ఇక్కడి వరకూ వస్తాయి. – చిట్టూరి గోపాలకృష్ణ,మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, అమలాపురం 

పులుసు అమోఘం
పులసను పులుసుగానే ఎక్కువగా వండుతారు. ఇప్పటి తరం మహిళలు దీనిని వండినా అంత రుచి రాదనే అంటారు. పులస పులుసును ప్రత్యేక తరహాలో తయారు చేయాల్సిందే. పాత తరం అంటే ఇప్పుడు 60, 70 ఏళ్లు వయస్సున్న గ్రామీణ మహిళలు పులస పులుసు పెడితే ఆ రుచి అమోఘంగా ఉంటుంది. మసాలా దట్టించి మట్టికుండలో చింతపండు పులుసుతో దీనిని వండుతారు. చింతనిప్పులు లేదా కట్టెల పొయ్యి లేదా పిడకల మంటపైనే దీనిని వారు వండుతారు. పొయ్యిపై కూర ఉడికేటప్పుడు బెండకాయలు, వంకాయలు, మిరపకాయలు కోయకుండా ఉన్నవి ఉన్నట్టుగా వేస్తారు. 

అలాగే ఆవకాయలో తేరిన ఎర్రటి నూనె, కొత్తివీుర వేస్తారు. కుండలో వండితేనే దీనికి అసలైన రుచి వస్తుంది. పులుసు వండడం పూర్తయ్యాక అదే కుండలో ఉంచి 24 గంటల తరువాత తింటే దాని రుచే వేరని పలువురు లొట్టలు వేసుకుని తింటారు. పులస చేపకు ముళ్లు ఎక్కువగా ఉండటంతో చాలా నేర్పుగా తినాల్సి ఉంటుంది. ఇందులో వేసిన బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి కూడా భలే రుచిగా ఉంటాయి. గోదావరి జిల్లాల వాసుల్లో పలువురు హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లోని తమవారికి, ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఘుమఘుమలాడే పులస పులుసు తీసుకువెళుతుంటారు.

ఎన్నో ప్రత్యేకతలు
పులసకు ఉన్నంత రుచి, వాసన మరో చేపకు ఉండవు. దీంతో దీనిని అంతర్జాతీయంగా క్వీన్‌ ఆఫ్‌ ది ఫిష్‌  (చేపల రారాణి)గా పిలుస్తారు. పులస చేప కిలో నుంచి 3 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. 3 కిలోల బరువున్న పులస 60 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దీని ఆయుష్షు గరిష్టంగా 3 సంవత్సరాలు. వలలో చిక్కిన వెంటనే పులసలు చనిపోతాయి. అయితే రక్తప్రసరణ ఎక్కువగా ఉండడంతో రెండు రోజుల వరకు ఈ చేప    పాడైపోకుండా ఉంటుంది.పులస ప్రపంచంలో మూడే మూడు ప్రాంతాల్లో మాత్రమే లభిస్తుంది. బంగ్లాదేశ్‌లోని పద్మా నది, పశ్చిమ బెంగాల్‌లోని    హుగ్లీ నది, మన రాష్ట్రంలోని గోదావరి నది. గోదావరిలో కూడా కేవలం మూడే మూడు ప్రాంతాల్లో లభించే పులస రుచి పసందుగా ఉంటుంది. ఆ ప్రాంతాలు తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్ధాంతం, నర్సాపురం.

బంగ్లాదేశ్‌లో పులస జాతీయ చేపగా గుర్తింపు పొందింది.
అఖండ గోదావరి ధవళేశ్వరం దిగువన ఏడుపాయలుగా  విడిపోతుంది. వీటినే ‘సప్త గోదావరులు’ అని పిలుస్తారు. అవి గౌతమి, వైనతేయ, వశిష్ట, తుల్య భాగ, భరద్వాజ, ఆత్రేయ, కశ్యప. ఈ ఏడు పాయలు చివరకు మూడు పాయలు(గౌతమి, వైనతేయ, వశిష్ట)గా సముద్రంలో కలుస్తాయి. అలా నదీపాయలు సముద్రంలో కలిసే సఖినేటిపల్లి మండలం అంతర్వేది అన్నాచెళ్లెళ్ల గట్టు, బోడసకుర్రు సమీపాన ఓడలరేవు – కరవాక మధ్య, కాట్రేనికోన మండలం బ్రహ్మసమేథ్యం సమీపాన కొత్తపాలెం ప్రాంతాల్లో సముద్ర మొగ(సీ మౌత్‌)లు ఏర్పడ్డాయి. ఈ మూడుచోట్ల నుంచే పులసలు గోదావరిలోకి  ప్రవేశిస్తాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top