స్మార్ట్‌ సిటీ ఏదీ బాబు ?

Where Is The Smart Cities Babu - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ‘రాజాం పట్టణాన్ని స్మార్ట్‌సిటీగా మారుస్తాం. పట్టణంలో నివాసముంటున్న ఇల్లులేని పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తాం. ఏడాది లోగా ప్రతి ఒక్క అర్హుడికి ఇల్లు ఇస్తాం. ఈ స్మార్ట్‌ సిటీ ఎలా ఉంటుందంటే ఈ భవనాలపై హెలికాప్టర్‌ కూడా అవలీలగా దిగుతుంది.’ 2017 జనవరి–6వ తేదీన రాజాంలోని జన్మభూమి మా ఊరులో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది. ఇలా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన స్మార్ట్‌ సిటీ హామీ లబ్ధిదారులను ఊహాలోకంలో విహరించేలా చేసింది.

రాజాం పట్టణంలో సొంతింటి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇప్పటికీ ఇల్లు నిర్మించి అధికారులు ఇవ్వలేదు. రాజాం పట్టణ కేంద్రంలో ఇల్లు వస్తుందనుకుంటే పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో నిర్మాణాలు ప్రారంభించారు. అక్కడ ఫ్లాట్ల  నిర్మాణం కూడా నత్తనడకన సాగుతుండడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  10 నెలల క్రితం స్మార్ట్‌ సిటీలో ఫ్లాట్‌ల నిమిత్తం డీడీలు తీసి లబ్ధిదారులు దరఖాస్తు పెట్టుకున్నారు.

వీటికి సంబంధించి లబ్ధిదారులకు తొలివిడత ఫ్లాట్స్‌ కేటాయింపు మూడునెలల క్రితం చేపట్టారు. మొత్తం 893 మంది లబ్ధిదారులు తొలివిడతలో డీడీలు తీయగా, వారిలో 90 మందికి లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయించారు. అయితే వారికి ఇంతవరకూ ఫ్లాట్లు అప్పగించలేదు. మొత్తం 1104 ఫ్లాట్లు నిర్మించాల్సి ఉంది. ఇంతవరకూ ఒక్కటి కూడా పూర్తికాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

నత్తనడకన నిర్మాణాలు
ఈ ఫ్లాట్ల నిమిత్తం సింగిల్‌ బెడ్‌ రూమ్‌కు ముందుగా రూ.500, డబుల్‌ బెడ్‌రూంతో పాటు పెద్ద సైజు సింగిల్‌ బెడ్‌ రూం నిమిత్తం ముందస్తుగా లబ్ధిదారుడు రూ.50 వేలు నుంచి రూ.ఒక లక్ష  డీడీలు తీసి నగరపంచాయతీకి చెల్లించారు. వీరికి ప్రభుత్వం నుంచి రూ.3 లక్షలు రాయితీ వస్తుండగా, మరో రూ.3 లక్షలు బ్యాంకు లోన్‌ కూడా మంజూరు చేశారు.

ఈమొత్తం నిధులను టెండర్ల రూపంలో ఫ్లాట్ల నిర్మాణానికి టెండర్‌ పిలవగా విశాఖపట్నానికి చెందిన ఓ సంస్థ ఆ టెండర్‌ను దక్కించుకుంది. పనులు మాత్రం సకాలంలో పూర్తీచేయకపోవడంతో పలువురు లబ్ధిదారులు  విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీనే ఇలా ఉంటే సాధారణ నాయకులు ఇచ్చే హామీ పరిస్థితి ఏమిటని? నమ్మించి మోసం చేసిన ప్రభుత్వానికి ఇప్పుడెలా ఓటు వేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top