ఆరోగ్య కార్డులేవీ? | where is the Health cards? | Sakshi
Sakshi News home page

ఆరోగ్య కార్డులేవీ?

Oct 16 2013 7:44 AM | Updated on Mar 28 2018 10:56 AM

ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలందించేందుకు ఉద్దేశించిన ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలందించేందుకు ఉద్దేశించిన ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ ప్రక్రియ ప్రారంభించలేదు. రాష్ట్రంలో 9.45లక్షల మంది ఉద్యోగులు, 3లక్షల మందికి పైగా పెన్షనర్లకు ఆరోగ్యకార్డుల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారింది. ప్రభుత్వం ఇప్పటివరకు ఆరోగ్యకార్డులకు సంబంధించి ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌తో కూడిన సభ్య సంఘాలతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ హామీ కార్యరూపం దాల్చలేదు.
 
 ఉద్యోగ సంఘాలు నగదురహిత ఆరోగ్యకార్డులివ్వాలని పట్టుబట్టినప్పటికీ ప్రభుత్వం ముందుగా ఆ పరిమితిని రూ.రెండు లక్షలని, ఆ తర్వాత రూ.మూడు లక్షలని ఎటూ తేల్చక నాన్చుడు ధోరణిని అవలంబిస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత రీయింబర్స్‌మెంట్ విధానంతో ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించనప్పటికీ ప్రభుత్వం రూ. 160 కోట్లను కేటాయిస్తోంది. కాగా ఆరోగ్యకార్డులకయ్యే ఖర్చులో (రూ.350 కోట్లు) రూ.140 కోట్లు తాము చెల్లిస్తామని చెబుతున్న ప్రభుత్వం కార్డుల జారీలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.
 
 ఎటూ తేల్చని ప్రభుత్వం
 ఆరోగ్యకార్డుల జారీకివిధివిధానాలను ఖరారు చేస్తూ గత ఏడాది ఆగస్టులో ఉత్తర్వులు (జీఓ నంబర్లు 184, 186) జారీ చేసినప్పటికీ కార్యాచరణ మాత్రం ప్రారంభించలేదు. పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపినా అవి సఫలం కాలేదు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూతో సంఘాల చర్చల నేపథ్యంలో రూ.మూడు లక్షల పరిమితిని తొలగించడంతోపాటు ప్రీమియాన్ని తగ్గిస్తున్నామని ప్రకటించి సంవత్సర కాలం గడుస్తున్నా అమలుకు నోచుకోలేదు. గతంలో ఇదే మాదిరిగా వివరాలు సేకరించి ఎటూ తేల్చకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారానే ఉద్యోగుల వివరాలు సేకరిస్తామని, ఉద్యోగులు, పెన్షనర్లు సంబంధిత వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఉత్తర్వులిచ్చింది. ఐతే ప్రభుత్వంతో తమ చర్చలు ఫలించిన తర్వాతనే వివరాలు నమోదు చేస్తామని ఉద్యోగ సంఘాలు భీష్మించుక్కూర్చున్నాయి. కాగా ప్రస్తుతం పరిమితి విధించకుండా ఆరోగ్య కార్డులివ్వాలని, ఔట్ పేషెంట్ సౌకర్యాన్ని కల్పించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక ఆరోగ్యశ్రీ ట్రస్టును ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు. అంతేకాక భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ప్రీమియం తప్పనిసరనే నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
 ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేయాలి
 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌తో ఆరోగ్యశ్రీ ట్రస్టును ఏర్పాటు చేయాలి. దీర్ఘకాల వ్యాధులకు రూ.రెండు లక్షలు ఏ మాత్రం సరిపోవు. ప్రభుత్వం షరతులు, పరిమితులు లేని ఆరోగ్యకార్డులను మంజూరు చేయాలి.
     - సత్తు పాండురంగారెడ్డి, టీచర్, జవహర్‌నగర్
 
 ప్రక్రియను వేగవంతం చేయాలి
 రీయింబర్స్‌మెంట్ విధానంలో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. కార్డుల మంజూ రులో పరిమితి విధించడం సమంజసం కాదు.
 - ఎన్. పరమేష, ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి
 
 పెన్షనర్లకు తీవ్ర ఇబ్బందులు
 ప్రభుత్వం ఆరోగ్యకార్డులు అందజేయకపోవడంతో పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రీయింబర్స్‌మెంట్ విధానంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి.  
 - సీహెచ్.ప్రతాప్‌శర్మ, పెన్షనర్ల అసొసియేషన్
  ఇబ్రహీంపట్నం యూనిట్ కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement