టీటీడీ భూములు విక్రయించరాదని తీర్మానం

We dont sale TTD temple assets says TTD Chairmen Subbareddy - Sakshi

సాక్షి, చిత్తూరు : పాలక మండలి సమావేశంలో టీటీడీ భూములు విక్రయించరాదని తీర్మానం చేసినట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.  ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అనుణంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. టీటీడీ భూములు, ఆస్తులు ఎట్టి పరిస్థితిల్లో అమ్మేదిలేదని స్పష్టం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమావేశమైంది.

టీటీడీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. హిందూ ధర్మానికి సంబంధించిన పెద్దల సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. టీటీడీపై కుట్ర చేస్తున్న వారిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతున్నామన్నారు. తామంతా దేవుడి సేవలోనే ఉన్నామని తెలిపారు.

‘భూములు విక్రయించాలన్న గత పాలకమండలి తీర్మానాన్ని తిరస్కరిస్తూ తీర్మానం చేశాం. మేము అధికారంలోకి వచ్చాక ఎలాంటి గెస్ట్‌హౌస్‌ల కేటాయింపు చేయలేదు. గెస్ట్‌హౌస్‌ కేటాయింపు పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తాం. విద్యా వ్యవస్థలో ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు చర్యలు తీసుకోవాలి. టీటీడీ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ ఆస్పత్రి నిర్మాణానికి తీర్మానం చేశాం. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాకే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తాం. వీలైనంత త్వరగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తాం. దర్శనానికి సంబంధించి నియమ, నిబంధనలు రూపొందిస్తాం’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సుమారు 60 రోజులుగా శ్రీవారి దర్శనం నిలిచిపోయిన తరుణంలో తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా టీటీడీ బోర్డు భేటీ అయింది. బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తిరుపతి నుంచి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు కరుణాకర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. మిగిలిన సభ్యులు వారివారి స్వస్థలం నుంచి పాల్గొన్నారు. టీటీడీ చరిత్రలో మొట్టమొదటి సారిగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top