చేనేత సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ఆర్కే | We Are Committed To Handloom Workers Welfare, Says Mangalagiri MLA RK  | Sakshi
Sakshi News home page

చేనేత రంగం సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ఆర్కే

Jul 22 2019 10:45 AM | Updated on Jul 22 2019 11:06 AM

We Are Committed To Handloom Workers Welfare, Says Mangalagiri MLA RK  - Sakshi

సాక్షి, అమరావతి: చేనేతల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. గతంలో చేనేతల కోసం వైఎస్‌ జగన్‌ దీక్ష చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చేనేతల అంశంపై ఆయన సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. వ్యవసాయ రంగం తర్వాత అధిక ప్రాధాన్యం తమ ప్రభుత్వం చేనేత రంగానికి ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. 

కేంద్ర ప్రభుత్వం మెగా క్లస్టర్లను ఏర్పాటుచేస్తామని ప్రకటించగా.. టీడీపీ హయాంలో వాటిని బ్లాక్‌స్థాయి క్లస్టర్లుగా మార్చారని, దీనివల్ల ప్రయోజనం లేదని, బ్లాక్‌స్థాయి క్లస్టర్ల వల్ల చాలా తక్కువమందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మెగా క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చేనేతరంగానికి రూ. వెయ్యికోట్ల స్థీరికరణ నిధిని ఏర్పాటు చేస్తానని.. ప్రతి ఏడాది వెయ్యి కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు తన హయాంలో కేవలం సుమారుగా రూ. 875.3 కోట్లను మాత్రమే కేటాయించి.. రూ. 473 కోట్లు మాత్రమే నేతన్నల కోసం ఖర్చు చేశారని, మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మొదటి బడ్జెట్‌లోనే చేనేత రంగానికి రూ. రెండువందల కోట్లు కేటాయింపులు చేశారని, చేనేత రంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ఇక, చంద్రాబు హయాంలో ఆప్కో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, దీనిని ఆదుకోవాల్సిన అవసరముందని కోరారు. దీనికి మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సమాధానమిస్తూ.. మెగా క్లస్టర్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, వీటిని కేంద్రం రద్దు చేసి.. బ్లాక్‌స్థాయి క్లస్టర్లను తీసుకొచ్చిందని తెలిపారు. ఇక, ఆప్కో రంగంలో గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టినవిధంగా చర్యలు తీసుకొని.. దీనికి పునర్వైభవాన్ని తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిశ్చయించారని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement