గుత్తి సబ్‌జైల్లో వార్డెర్లు డిష్యుం డిష్యుం 

Warders Are Fighting In Gutthi Sub Jail In Anantapur - Sakshi

వార్డర్‌ సిలార్‌ఖాన్‌కు గాయాలు   

గుత్తి: గుత్తి సబ్‌ జైల్లో చిన్నపాటి విషయంపై ఇద్దరు వార్డర్ల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో సిలార్‌ఖాన్‌ అనే వార్డర్‌కు గాయాలయ్యాయి. ఎస్‌ఐ యువరాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో వాటిని రిపేరీ చేయించడానికి చీఫ్‌ వార్డర్‌ జోగులు టెక్నీషియన్‌ను పిలిపించారు. సీసీ కెమెరాలు రిపేరీ చేయడానికి నిచ్చెనను జైల్లోకి తీసుకెళ్లారు. అయితే సూపరింటెండెంట్‌ అనుమతి లేకుండా నిచ్చెనను జైల్లోకి అనుమతించకూడదు. చీఫ్‌ వార్డర్‌ జోగులు నిచ్చెనను లోపలకి అనుమతించారు. దీనికి వార్డర్‌ సిలార్‌ఖాన్‌ అడ్డు చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సిలార్‌ ఖాన్‌ బయట ఉన్న ఖైదీలను, నిచ్చెనను సెల్‌ఫోల్లో వీడియో తీయసాగాడు. దీంతో జోగులు అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చింది. సిలార్‌ఖాన్‌ చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కోవడానికి జోగులు ప్రయత్నించాడు. అయితే సిలార్‌ఖాన్‌ సెల్‌ఫోన్‌ను ఇవ్వలేదు. ఆవేశంలో జోగులు రాయి తీసుకుని సిలార్‌ఖాన్‌ చెయ్యిపై దాడి చేసి గాయపరిచాడు. జోగులు రాయితో తనపై దాడి చేసి గాయపరిచినట్లు సిలార్‌ ఖాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ యువరాజు కేసు దర్యాప్తు చేపట్టారు.  

ఆ ఇద్దరి మధ్య కోల్డ్‌వార్‌ 
సిలార్‌ఖాన్, జోగులు మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. జోగులు ఇష్టానుసారం జైల్లో వ్యవహరిస్తూ ఖైదీల పట్ల ఉదాసీనంగా ఉంటున్నాడని తెలుస్తోంది. ఇది సిలార్‌ఖాన్‌కు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం జోగులు బండారాన్ని జైలు ఉన్నతాధికారులకు చూపించాలని జైల్లో జరుగుతున్న తంతును సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడానికి సిలార్‌ఖాన్‌ ప్రయత్నించాడు. దీన్ని గమనించిన జోగులు.. సిలార్‌ఖాన్‌ చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో కోపోద్రిక్తుడైన జోగులు రాయితో సిలార్‌ఖాన్‌ను గాయపరిచినట్లు తెలుస్తోంది. విచిత్రమేమిటంటే జైల్లోకి సెల్‌ఫోన్, రాయి ఎలా వచ్చాయనేది ఎవరికీ అర్థం కావడం లేదు. సాధారణంగా లేదా నిబంధనల మేరకు జైల్లో ఎలాంటి వస్తువులూ ఉండరాదు. అయితే సెల్‌ఫోన్, రాయి, నిచ్చెన ఎలా వచ్చాయో తెలియాల్సి ఉంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top