వీవీ ప్యాట్‌ స్లిప్పుల కలకలం

VV PAT Slips In College Surroundings - Sakshi

సాక్షి, దర్శి : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వీవీ ప్యాట్‌ స్లిప్‌లు ప్రత్యక్షమయ్యాయంటూ కలకలం రేగింది. కౌంటింగ్‌కు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఈ స్లిప్పులు ప్రత్యక్షమయ్యాయని పుకార్లు రావడంతో ఎస్సై శశి కుమార్‌ ఆ కళాశాలకు వెళ్లి  పరిశీలించారు. వీవీ ప్యాట్‌ స్లిప్పులు మాత్రం దొరకలేదు. వాటిని పరిశీలిస్తే వీవీ ప్యాట్‌ ఆన్‌ చేసినప్పుడు సెన్సార్, బ్యాటరీలు పనితనం గురించి తెలియజేసే స్లిప్‌లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో వీవీ ప్యాట్‌లు భద్రపరిచి.. రాజకీయ పార్టీల నాయకులకు అవగాహన కల్పించిన ప్రాంతంలో ఉన్న చెత్త కుప్ప పక్కన ఈ స్లిప్పులు కనిపించాయి. ఆ ప్రాంతంలోనే ఎన్నికలు కూడా నిర్వహించారు. వీవీ ప్యాట్‌ చెక్‌ చేసినప్పుడు లేదా అన్‌ చేసినప్పుడు 7 స్లిప్పులు బయటకు వస్తాయి. ఆ 7 స్లిప్‌లు ఈవీఎం çపని చేసే కండిషను గురించి తెలియజేస్తాయి. 7స్లిప్‌లు బయటకు రాక పోతే ఆ ఈవీఎం పని చేయనట్లు నిర్ధారణ అవుతుంది. అక్కడ ఉన్న స్లిప్‌లను పరిశీలిస్తే  ఈ వీఎంలు పని చేస్తున్నాయా లేదా తెలిపే బ్యాటరీ చెకప్, సెన్సార్, ఎల్‌ఈడీ రిపోర్ట్‌  స్లిప్‌లుగా అనుమానం వ్యక్తం అవుతోంది. అక్కడ విలేకరులకు దొరికిన స్లిప్‌లను ఎస్‌ఐ శశికుమార్‌ తీసుకుని పరిశీలించారు. ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. అయితే వీవీ ప్యాట్‌లో వచ్చే స్లిప్‌లపై పార్టీలకు చెందిన గుర్తులుంటాయని కొందరు చెప్తున్నారు. ఆ స్లిప్‌లపై అలాంటి గుర్తులు లేవు. ఆంగ్లంలో టైప్‌ అయిన అక్షరాలు మాత్రమే ఉన్నాయి. దీంతో అవి వీవీ ప్యాట్‌ స్లిప్‌లు కావని, వాటి సామర్థ్యం తెలిపే స్లిప్పులు మాత్రమే అని తెలుస్తోంది. ఏదేమైనా పూర్తి స్థాయిలో విచారణ జరిగితేనే అసలు విషయం బయటకు వస్తుంది. ఆర్వో కృష్ణవేణిని వివరణ కోరేందుకు సంప్రదించగా కార్యలయంలో లేరు. ఫోన్‌ ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top